తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల ప్రతీక బోనాలు. యావత్ తెలంగాణ ప్రజలు ఈ పండగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఆషాడమాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్ లో బోనాల సందడి మొదలవుతుంది. ప్రాచీన గోల్కొండ కోటలో వెలిసిన జగదాంబిక అమ్మవారికి తొలిబోనం సమర్పించడంతో ప్రారంభమయ్యే ఈ వేడుకలు నెల రోజుల పాటు కొనసాగనున్నాయి. ఇలా ఇవాళ్టినుండి (జూన్ 26) నుండి ఆషాడమాస బోనాలు ప్రారంభం అవుతున్నాయి.
డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాల మధ్య తెలంగాణ ఆడపడుచులు అమ్మవార్లకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. వేటలను బలిచ్చి కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి విందు… మందేసే మగాళ్లు సరదా చిందులతో బోనాల పండగను ఆనందంగా జరుపుకుంటారు. ఇలా నెలరోజుల పాటు ప్రతి ఆదివారం నగరంలో ఏదోచోట బోనాల సందడి ఉంటుంది.
గోల్కొండ తర్వాత నగరవ్యాప్తంగా వరుసగా బోనాల వేడుకలు జరుగుతాయి. బల్కంపేట ఎల్లమ్మ, సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తారు. సికింద్రాబాద్ బోనాల వేడుకలు అట్టహాసంగా జరుగుతాయి. ఆషాడమాసంలో చివరి ఆదివారం హైదరాబాద్ బోనాలు జరుగుతాయి. పాతబస్తీలోని లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారితో పాటు నగరంలోని అమ్మవార్ల ఆలయాలన్నింటిలో ఈ బోనాల వేడుకలు జరుగుతాయి.
గోల్కొండ బోనాలు వేడుకల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొంటారు. ఉదయమే గోల్కొండకు చేరుకుని కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో జరిగే తొలి బోనం శోభాయాత్రలో పాల్గొంటారు. ఆ తర్వాత బంజారా దర్వాజ వద్ద కాసాల రోహిత్ పటేల్ నివాసంలో తొలి నజర్ బోనం ఉత్సవంలో కవిత పాల్గొంటారని తెలంగాణ జాగృతి ప్రకటించింది.
గురువారం మధ్యాహ్నం గోల్కొండ పోలీస్ స్టేషన్ దగ్గర్లోని శ్రీకాంత్ చారి ఇంటినుండి ప్రారంభమయ్యే మహంకాళి అమ్మవారి ఉత్సవ విగ్రహాల శోభాయాత్రలో కవిత పాల్గొంటారు. ఈ క్రమంలోనే బంగారు బోనమెత్తి అమ్మవారికి సమర్పించనున్నారు.
బోనాల ఉత్సవాలు ప్రారంభం సందర్బంగా ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల పండగ బోనాలను ప్రజలంతా సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో నెలరోజుల పాటు పండగ వాతావరణం ఉంటుందని అన్నారు.
గోల్కొండ కోటలో వెలిసిన జగదాంబిక ఎల్లమ్మ తల్లికి తొలి బోనం సమర్పించడంతో హైదరాబాద్ లో బోనాల సందడి మొదలవుతుందని సీఎం రేవంత్ అన్నారు. ఆ తల్లి ఆశీర్వాదంతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని… వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని… రాష్ట్రం అన్నిరంగాల్లో మెరుగైన వృద్ధి సాధించాలని కోరుకున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ బోనాల కోస తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందని… నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. బోనాల ఉత్సవాల కోసమే రూ.20 కోట్లు కేటాయించి విడుదల చేసినట్లు సీఎం వెల్లడించారు. ఈ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు, ఇతర శాఖల అధికారులు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు.
ఆషాఢ బోనాల ఉత్సవాల ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ఆషాఢ మాసంలో బోనాల వేడుకలతో పండుగ వాతావరణం ఉంటుందన్నారు… గోల్కొండ బోనాలతో ఈ వేడుకలు ప్రారంభం అవుతున్నాయన్నారు. భక్తి, శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ బోనాల పండుగను ఘనంగా జరుపుకోవాలని… అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసతోషాలు, ఆయురోగ్యాలతో ఉండాలని మహేష్ కుమార్ గౌడ్ కోరుకున్నారు.
హైదరాబాద్ తో పాటు వరంగల్ లో కూడా ఉత్సవాలు జరగనున్నాయి… అయితే ఇక్కడ బోనాలు అయితే అక్కడ శాకంబరి ఉత్సవాలు. భద్రకాళి అమ్మవారి శాకంబరి ఉత్సవాలు నేటి నుండి ప్రారంభమై 15 రోజులపాటు కన్నుల పండువగా జరగనున్నాయి. జూలై 10న భద్రకాళి అమ్మవారికి శాకంబరి అలంకరణ ఉంటుంది.