తెలంగాణను డ్రగ్స్ నుంచి స్వచ్ఛంగా ఉంచాలని ప్రభుత్వం కృషి చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం డ్రగ్స్ నిర్మూలనపై దృష్టి సారించగా, పోలీసులు కూడా అదే దిశగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ డ్రగ్స్ మాఫియా కొత్త మార్గాల్లో రవాణాకు తెగపడుతోంది. తాజాగా నార్సింగి ప్రాంతంలో జరిగిన సంయుక్త ఆపరేషన్‌లో డ్రగ్స్ రవాణా చేస్తున్న అంతర్జాతీయ ముఠా గుట్టు రట్టైంది.
తెలంగాణ నార్కోటిక్ బ్యూరో (TNB) మరియు నార్సింగి పోలీసులు కలిసికట్టుగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో ముఠాలో ఉన్న నలుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.30 లక్షల విలువైన కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు వారి పై కేసు నమోదు చేసి విచారణ నిమిత్తం స్టేషన్‌కు తరలించారు.
ఇక గత వారం జరిగిన యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమంలో డీజీపీ జితేందర్ పాల్గొన్నారు. డ్రగ్స్ వాడకంతో ఆరోగ్యం బాగుండదని, భవిష్యత్తు అంధకారమవుతుందని స్పష్టంగా చెప్పారు. మాదక ద్రవ్యాల ప్రభావం ఎంత తీవ్రమో సమాజానికి చాటి చెప్పేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
ఇది మన దేశ భవిష్యత్తు కోసం పోరాటం అని డీజీపీ తెలిపారు. ప్రతీ ఒక్కరు డ్రగ్స్‌తో జరిగే నష్టాన్ని తెలుసుకుని, పది మందికి అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వంతో పాటు పోలీసు విభాగం డ్రగ్స్ రహిత సమాజం కోసం తీవ్రంగా కృషి చేస్తుండగా, ప్రజల భాగస్వామ్యం కూడా అవసరం అనే విషయం స్పష్టమవుతోంది.