భారత కరెన్సీలో భారీ మార్పుల దిశగా ఆర్బీఐ అడుగులు..?
“ప్లాస్టిక్ రూపాయి”పై మళ్లీ జోరందుకున్న చర్చ
దేశంలో డిజిటల్ చెల్లింపులు వేగంగా పెరుగుతున్నప్పటికీ నగదు వినియోగం మాత్రం తగ్గే సూచనలు కనిపించడం లేదు. ముఖ్యంగా గ్రామీణ భారతంలో ఇంకా నగదు లావాదేవీలే ప్రధాన ఆధారం. ఈ నేపథ్యంలో తరచూ చలామణి అయ్యే చిన్న నోట్ల నిర్వహణ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పెద్ద సవాలుగా మారుతోంది. ఈ సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారంగా ప్రస్తుతం వినియోగంలో ఉన్న కాగిత నోట్ల స్థానంలో దశలవారీగా పాలిమర్ కరెన్సీ నోట్లు ప్రవేశపెట్టే అంశంపై ఆర్బీఐ మళ్లీ సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్లాస్టిక్ కరెన్సీ నోట్ల ప్రవేశంపై ప్రతిపాదనను ఆర్బీఐ ఇటీవల పాట్నా, ముంబైల్లో నిర్వహించిన చివరి రెండు బోర్డు సమావేశాల్లో చర్చించిందన్న సమాచారం జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది.
ఇటీవల జాతీయ, ఆర్థిక మీడియాలో వెలువడిన కథనాల ప్రకారం, మొదటి దశలో ₹10, ₹20, ₹50 నోట్లను పాలిమర్ కరెన్సీగా మార్చే అవకాశాలను ఆర్బీఐ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నోట్లు ఎక్కువగా చేతులు మారడం వల్ల త్వరగా చిరిగిపోవడం, మురికిగా మారడం, తరచూ కొత్త నోట్లు ముద్రించాల్సిన అవసరం ఏర్పడుతోంది. దీంతో కరెన్సీ ముద్రణ వ్యయం కూడా భారీగా పెరుగుతోంది.
పాలిమర్ నోట్లు అంటే సాధారణ కాగిత నోట్లు కావు. ఇవి ప్రత్యేక ప్లాస్టిక్ పదార్థమైన పోలీప్రొపిలీన్‌తో తయారవుతాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, సింగపూర్ వంటి అనేక దేశాలు ఇప్పటికే ఈ తరహా కరెన్సీని వినియోగిస్తున్నాయి. కొన్ని దేశాల్లో ఇవి నకిలీ నోట్ల నియంత్రణలో కూడా సమర్థవంతంగా పనిచేశాయి.
పాలిమర్ నోట్లకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణ పేపర్ నోట్లతో పోలిస్తే ఇవి మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. నీటిలో తడిసినా త్వరగా పాడవు. మురికి తక్కువగా పడుతుంది. చినిగే అవకాశాలు కూడా చాలా తక్కువ. మొదట తయారీ వ్యయం ఎక్కువైనా, తరచూ కొత్త నోట్లు ముద్రించాల్సిన అవసరం తగ్గిపోవడంతో దీర్ఘకాలంలో నిర్వహణ ఖర్చులు తగ్గే అవకాశం ఉంది.
ఇంకా ముఖ్యంగా, పాలిమర్ నోట్లలో ప్రత్యేక భద్రతా లక్షణాలు ఉంటాయి. పారదర్శక విండోలు, అధునాతన హోలోగ్రామ్ సాంకేతికత, క్లిష్టమైన సెక్యూరిటీ ఫీచర్లు ఉండటం వల్ల నకిలీ నోట్ల తయారీని కట్టడి చేయడం సులభమవుతుందని భావిస్తున్నారు.
అయితే ఈ మార్పుతో కొన్ని సవాళ్లు కూడా ఎదురుకానున్నాయి. ముఖ్యంగా పాత ఏటీఎం యంత్రాలు పాలిమర్ నోట్లను సరిగా గుర్తించలేకపోవచ్చు. దీంతో ఏటీఎంల కాలిబ్రేషన్ మార్చాల్సిన అవసరం ఉంటుంది. బ్యాంకింగ్ వ్యవస్థలోని కరెన్సీ ప్రాసెసింగ్ యంత్రాంగంలో కూడా మార్పులు చేయాల్సి రావచ్చు. అయితే ప్రస్తుతం టెక్నాలజీ విపరీతంగా అభివృద్ధి చెందడంతో ఈ సాంకేతిక సమస్యలకు పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయని ఆర్బీఐ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.
ఇది పూర్తిగా కొత్త ఆలోచన కాదు. ఇప్పటికే 2012లో యూపీఏ ప్రభుత్వం ₹10 పాలిమర్ నోట్ల పైలట్ ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపింది. కానీ అప్పట్లో సాంకేతిక పరిమితులు, మౌలిక సదుపాయాల లోపం వంటి కారణాలతో ఆ ప్రణాళిక ముందుకు సాగలేదు. ఇప్పుడు పరిస్థితులు మారడంతో ఆర్బీఐ మరోసారి ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇప్పటివరకు రిజర్వ్ బ్యాంక్ అధికారికంగా “పాలిమర్ నోట్లు విడుదల చేస్తున్నాం” అని గానీ, “పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది” అని గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఆర్బీఐ బోర్డు స్థాయిలో ఈ అంశంపై చర్చలు జరిగినట్లు వస్తున్న సమాచారం దేశంలో “ప్లాస్టిక్ రూపాయి” ప్రవేశం ఇక దూరంలో లేదనే సంకేతాలను ఇస్తోంది.
మొత్తానికి, పాలిమర్ కరెన్సీపై ఆర్బీఐ ఆలోచనలు కేవలం కొత్త తరహా నోట్ల ప్రయోగం మాత్రమే కాదు. పెరుగుతున్న కరెన్సీ డిమాండ్, ముద్రణ వ్యయ నియంత్రణ, నకిలీ నోట్ల అరికట్టడం, దీర్ఘకాలిక నిర్వహణ వ్యూహం వంటి అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని భారత ఆర్థిక వ్యవస్థలో ఒక కీలక మార్పు దిశగా అడుగులు పడుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
చందమూరి నరసింహరెడ్డి.
ఖాసా సుబ్బారావు అవార్డు గ్రహీత.
కదిరి.
PlasticRupee


















