తమిళనాడులో మరోసారి కమలం పార్టీకి నిరాశే ఎదురైంది. కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దక్షిణాదిలో పట్టు సాధించాలని భావించిన బీజేపీకి తమిళనాడు ప్రజలు మరోసారి గట్టి షాక్ ఇచ్చారు. భారీ అంచనాలు, మోదీ ప్రచారం, వ్యూహాత్మక పొత్తులు అన్నీ ఉన్నప్పటికీ ఎన్నికల ఫలితాల్లో మాత్రం కమలం పార్టీకి తీవ్ర నిరాశే మిగిలింది.
ఈ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 27 స్థానాల్లో పోటీ చేసింది. అయితే అందులో కేవలం ఒక్క సీటులో మాత్రమే విజయం సాధించడం పార్టీ పరిస్థితిని స్పష్టంగా చూపించింది. గత ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో గెలిచిన కమలం పార్టీ ఈసారి ఒక్క సీటుకే పరిమితం కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా పార్టీకి చెందిన పలువురు అగ్ర నేతలు దారుణ పరాజయాలు చవిచూడడం మరింత ఇబ్బందికరంగా మారింది.
కేంద్రమంత్రి ఎల్. మురుగన్ కూడా ఓటమి పాలవ్వడం బీజేపీకి పెద్ద షాక్‌గా మారింది. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి ప్రజా తీర్పులో ఓడిపోయారు. వరుసగా ఏడోసారి బీజేపీ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోవడం ఆమె రాజకీయ భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నైనార్ నాగేంద్రన్‌కు కూడా పరాభవం తప్పలేదు. పార్టీకి కొత్త ఊపు తీసుకురావాలనుకున్న నాయకత్వానికి ప్రజల నుంచి ఆశించిన మద్దతు రాలేదు.
బీజేపీ గెలిచిన ఏకైక స్థానం కూడా చాలా స్వల్ప మెజారిటీతో రావడం గమనార్హం. నీలగిరి జిల్లా ఊటీ నియోజకవర్గంలో కేవలం 976 ఓట్ల తేడాతో కమలం పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. ఇది పార్టీకి ఊరటనిచ్చినా, రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలహీనతను మాత్రం దాచలేకపోయింది.
తమిళనాడులో బీజేపీ ఎదుగుదలకు కీలకంగా భావించిన అన్నామలైను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడం కూడా ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది. అన్నాడీఎంకేతో పొత్తు కోసం పార్టీ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం వ్యూహాత్మక తప్పిదమైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీర్ఘకాలికంగా పార్టీని బలోపేతం చేయడం కంటే తక్షణ ఎన్నికల లాభాల కోసం పొత్తుల రాజకీయాలకు వెళ్లడం బీజేపీకి నష్టంగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక తమిళనాడులో ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం మరోసారి స్పష్టమైంది. డీఎంకే, అన్నాడీఎంకే వంటి సంప్రదాయ పార్టీల మధ్య ఇప్పుడు నటుడు విజయ్ పార్టీ కూడా బలమైన రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. విజయ్ రాజకీయ ఎంట్రీ యువతలో కొత్త చర్చకు దారి తీసింది. ఈ పరిణామాలతో బీజేపీకి లభించే రాజకీయ స్థలం మరింత తగ్గిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తమిళ ఓటర్లు ఇప్పటికీ జాతీయ పార్టీల కంటే ప్రాంతీయ పార్టీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. భాష, ప్రాంతీయ గౌరవం, స్థానిక రాజకీయాల ప్రభావం తమిళనాడు ఎన్నికల్లో కీలకంగా మారుతున్నాయి. హిందుత్వ అజెండా లేదా మోదీ ఇమేజ్ మాత్రమే తమిళనాడులో సరిపోవడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
దక్షిణాదిలో బీజేపీ విస్తరణకు తమిళనాడు ఎంతో కీలకమైన రాష్ట్రం. కానీ వరుస ఎన్నికల్లో తిరస్కరణ ఎదురవుతుండటం పార్టీ భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. కర్ణాటక మినహా మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ఆశించిన స్థాయిలో ఎదగలేకపోవడం ఇప్పుడు పెద్ద సవాల్‌గా మారింది.
తమిళనాడులో స్వతంత్ర రాజకీయ శక్తిగా ఎదగాలా? లేక ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుని తోకపార్టీగా కొనసాగాలా? అన్న ప్రశ్న ఇప్పుడు కమలం పార్టీ ముందు నిలిచింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీల మద్దతు లేకుండా తమిళనాడులో అధికారానికి చేరుకోవడం బీజేపీకి చాలా కష్టంగా కనిపిస్తోంది.

















