ZPChairman జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం ఎవరిని వరిస్తుంది?
పరిటాల శ్రీరామ్.. కేతిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి పోటీ ముదిగుబ్బ నుంచేనా?
స్థానిక సంస్థల ఎన్నికలు నోటిఫికేషన్ తోనే జిల్లా రాజకీయాల్లో కొత్త లెక్కలు మొదలయ్యాయి. ముఖ్యంగా జిల్లా పరిషత్ చైర్మన్ పదవి జనరల్ కేటగిరీకి కేటాయించబడిన నేపథ్యంలో అధికార కూటమి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల్లో ఆశావహుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఎమ్మెల్యే ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా సాగిన రాజకీయ పోరు.. ఇప్పుడు మండలాల వారీగా జడ్పీటీసీ స్థానాల చుట్టూ తిరిగే పరిస్థితి కనిపిస్తోంది. చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్న నాయకులు ముందుగా ఏ మండలం నుంచి జడ్పీటీసీగా పోటీ చేయాలన్నది తేల్చుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో పరిటాల శ్రీరామ్, కేతిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి పేర్లు ముదిగుబ్బ మండలంతో ముడిపడి వినిపిస్తుండటం రాజకీయ చర్చకు కారణమవుతోంది.
అయితే, జిల్లా పరిషత్ చైర్మన్ పదవి జనరల్ కేటగిరీకి కేటాయించడమంటే ఆ పదవి ఏ ఒక్క మండలానికో కేటాయించినట్లు కాదు. ముందుగా జడ్పీటీసీగా ఎన్నిక కావాలి. ఆ తర్వాత చట్టబద్ధమైన ఎన్నికల ప్రక్రియలో జిల్లా పరిషత్ సభ్యులు చైర్మన్‌ను ఎన్నుకోవాలి. ఈ రెండు దశల్లోనూ రాజకీయ పార్టీలు తీసుకునే నిర్ణయాలు కీలకం కానున్నాయి.
జిల్లా పరిషత్ చైర్మన్‌ను ప్రజలు నేరుగా ఎన్నుకోరు. ప్రజలు తమ మండల పరిధిలోని జడ్పీటీసీ సభ్యుడిని ఎన్నుకుంటారు. ఎన్నికైన జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల సభ్యులలో నుంచి చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. అందువల్ల చైర్మన్ పదవిపై ఆసక్తి ఉన్న నాయకుడికి ముందుగా జడ్పీటీసీగా ఎన్నిక కావడం ప్రాథమిక అర్హత.
పరిటాల శ్రీరామ్ అడుగులు ఎటువైపు?
తెలుగుదేశం పార్టీలో పరిటాల శ్రీరామ్ పేరు జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి సంబంధించిన చర్చల్లో వినిపిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పరిటాల శ్రీరామ్ సొంత మండలం రామగిరి జడ్పీటీసీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు అయింది అక్కడి నుంచి ఆయన పోటీ చేసే అవకాశం రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఉండదు. పక్కనే ఉన్న కనగానపల్లి జడ్పీటీసీ స్థానం ఎస్సీ జనరల్‌కు కేటాయించబడింది. అక్కడి రిజర్వేషన్ కూడా ఆయన అభ్యర్థిత్వానికి అనుకూలంగా ఉండదు.
ఈ నేపథ్యంలో జనరల్ కేటగిరీకి కేటాయించిన ముదిగుబ్బ మండలం నుంచి పరిటాల శ్రీరామ్ బరిలో దిగుతారా? లేక మరో అనుకూలమైన జడ్పీటీసీ స్థానం కోసం ప్రయత్నిస్తారా? అన్నది ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది.
వైఎస్సార్సీపీ నుంచి వజ్రభాస్కర్‌రెడ్డి?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపన వజ్రభాస్కర్‌రెడ్డి పేరు కూడా ఆశావహుల చర్చలో వినిపిస్తున్నట్లు సమాచారం. ఆయన కదిరి రూరల్ మండలం నుంచి జడ్పీటీసీగా పోటీ చేస్తారా? లేక మరో మండలాన్ని ఎంచుకుంటారా? అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని లక్ష్యంగా చేసుకునే నాయకులకు పార్టీ బలం మాత్రమే కాకుండా, పోటీ చేయడానికి అందుబాటులో ఉన్న జడ్పీటీసీ స్థానం, దాని రిజర్వేషన్, స్థానిక రాజకీయ పరిస్థితులు కూడా ముఖ్యమవుతాయి. అందువల్ల వజ్రభాస్కర్‌రెడ్డి అభ్యర్థిత్వంపై అధికారిక సమాచారం వెలువడితేనే ఆయన రాజకీయ వ్యూహంపై స్పష్టత వస్తుంది.
కేతిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి ఎక్కడి నుంచి?
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సోదరుడు కేతిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి పేరు కూడా జిల్లా పరిషత్ రాజకీయాల నేపథ్యంలో చర్చకు వస్తోంది. ఆయన ఏ మండలం నుంచి జడ్పీటీసీగా పోటీ చేస్తారన్నది మరో కీలక ప్రశ్న.ముదిగుబ్బ మండలం ఆయన పోటీకి ఎంపికైతే, అదే స్థానం నుంచి పరిటాల శ్రీరామ్ కూడా బరిలో దిగుతారా? ఇద్దరూ ఒకే మండలాన్ని ఎంచుకుంటే ఆయా పార్టీల అభ్యర్థుల ఎంపిక, స్థానిక నాయకుల సమీకరణాలు, ప్రచార వ్యూహాలు చర్చనీయాంశాలవుతాయి.
ముదిగుబ్బ రాజకీయ కేంద్రంగా మారుతుందా?
జనరల్ కేటగిరీకి కేటాయించిన ముదిగుబ్బ మండలం చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్న నాయకుల దృష్టిని ఆకర్షిస్తోందన్నది ప్రస్తుత రాజకీయ చర్చలో ప్రధాన అంశం. అయితే చైర్మన్ పదవి జనరల్ కేటగిరీకి కేటాయించబడిన కారణంగా ఆశావహులందరూ ముదిగుబ్బ నుంచే పోటీ చేయాల్సిన అవసరం లేదు. సంబంధిత రిజర్వేషన్ నిబంధనలకు అనుగుణంగా ఇతర మండలాల నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉండవచ్చు.అంతేకాదు, అధికార కూటమిలోని ఇతర భాగస్వామ్య పార్టీల నాయకులు కూడా ముదిగుబ్బ జడ్పీటీసీ స్థానాన్ని కోరితే, అభ్యర్థి ఎంపికలో పార్టీలు అంతర్గత చర్చలు జరపాల్సి రావచ్చు. పొత్తుల సర్దుబాట్లు, స్థానిక నాయకుల అభిప్రాయాలు, సామాజిక సమీకరణాలు ఈ నిర్ణయాలను ప్రభావితం చేసే అంశాలుగా నిలుస్తాయి.
ఏ మండలాల నుంచి చైర్మన్ అభ్యర్థులకు అవకాశం?
జనరల్ కేటగిరీకి కేటాయించిన జడ్పీటీసీ స్థానాల నుంచి ఎన్నికైన సభ్యుల్లో చైర్మన్ పదవిపై ఆసక్తి ఉన్న నాయకులు పోటీకి దిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ముదిగుబ్బ, గాండ్లపెంట, నల్లచెరువు, కదిరి, కొత్తచెరువు, పుట్టపర్తి, తాడిమర్రి, చిలమత్తూరు మండలాల పేర్లు రాజకీయ చర్చలో ప్రస్తావనకు వస్తున్నాయి.
ఈమండలాల జడ్పీటీసీ స్థానాలు జనరల్ కేటగిరీలోఉన్నాయి.
చివరకు చైర్మన్ పీఠం ఎవరికి?
జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలో అభ్యర్థి ఏ మండలం నుంచి గెలిచారన్నది మాత్రమే నిర్ణయాత్మకం కాదు. జడ్పీటీసీ ఎన్నికల్లో విజయం, జిల్లా పరిషత్‌లో సభ్యుల బలం, పార్టీ నిర్ణయం, ఎన్నికల నిబంధనల ప్రకారం జరిగే అంతర్గత ఎన్నికలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి.
జడ్పీ చైర్మన్ పీఠం జనరల్ కేటగిరీకి దక్కింది.. కానీ ఆ పీఠాన్ని అధిరోహించే నాయకుడు ఎవరు? ఏ మండలం నుంచి జడ్పీటీసీగా బరిలోకి దిగుతారు? కూటమిలో సీట్ల సర్దుబాటు ఎలా ఉంటుంది? వైఎస్సార్సీపీ ఎవరిని ముందుకు తెస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయాలను నిర్ణయించనున్నాయి. ఏ మండాలన్ని జడ్పీ వరమాల వరిస్తుందో వేచి చూడాలి. ఎవరు జడ్పీ పీఠాన్ని అధిరోహించే నాయకుడు ఎవరో చూడాలి. ZPChairman
నరసింహారెడ్డి చందమూరి.
ఫ్రీలాన్స్ జర్నలిస్టు.
కదిరి.



















