ఆకాశంలో ఒక తార ఓ మంచి సినిమా చూసిన అనుభూతి కలిగించింది.
గ్రామీణ నేపథ్యం నుంచి ఆస్ట్రానమిస్ట్గా ఎదిగిన మహిళా ప్రయాణం.. భర్త త్యాగానికి అద్దం పట్టిన చిత్రం!
సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. మనిషిలో ఆలోచనలను రేకెత్తించాలి. జీవితంపై ఆశను పెంచాలి. లక్ష్యసాధనకు స్ఫూర్తినివ్వాలి. అలాంటి మంచి అనుభూతిని కలిగించే చిత్రమే ఆకాశంలో ఒక తార.
దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి జంటగా నటించిన ఈ చిత్రంలో ఇద్దరూ తమ పాత్రలకున్యాయం చేశారు. కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్, కల్పన పాత్రలో సాత్విక వీరవల్లి అద్భుతమైన నటన కనబరిచారు. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో వారి నటన ప్రేక్షకుల మనసులను తాకుతుంది. సాత్వికకు తొలి సినిమా అయినప్పటికీ అనుభవమున్న నటిలా పాత్రలో ఒదిగిపోయారు. దుల్కర్ తన హావభావాలతో పాత్రకు ప్రాణం పోశారు. నటనలో ఎక్కడా హంగామా ఆర్బాటం కనిపించకపోవడం ఈ చిత్రానికి పెద్ద బలం.
గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన ఓ సాధారణ మహిళ ఆస్ట్రానమిస్ట్గా ఎదిగిన ప్రయాణాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ కలలు కనడం ఒక ఎత్తయితే, వాటిని నిజం చేసుకోవడానికి ఎదురయ్యే అడ్డంకులను అధిగమించడం మరో ఎత్తు. ఈ పోరాటం విద్యార్థినులకు, యువతులకు గొప్ప స్ఫూర్తినిస్తుంది.
ఈ సినిమాలో హృదయాన్ని కదిలించే మరో అంశం భర్త త్యాగం. భార్య విజయాన్ని తన విజయంగా భావించి, ఆమె ఆశయాలకు అండగా నిలిచే కృష్ణ పాత్ర ఆదర్శప్రాయంగా ఉంటుంది. జీవిత భాగస్వామి అంటే ఎదుటివారి కలలను సాకారం చేసుకోవడానికి సహకరించడం కూడా అని ఈ చిత్రం చాటి చెబుతుంది.
అనవసరపు ఫైట్లు, స్మగ్లింగ్, అక్రమాలు, దుర్మార్గాలు, అసభ్యత, హింసకు తావులేకుండా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చని ఈ చిత్రం నిరూపిస్తుంది. ప్రత్యేకమైన విలనిజం లేకుండానే కథను ఆసక్తికరంగా నడిపించడం అభినందనీయం.
కుటుంబ సభ్యులందరూ కలిసి చూడదగిన చిత్రమిది. విద్యార్థుల్లో విజ్ఞానంపై ఆసక్తిని, యువతలో పరిశోధనాత్మక దృక్పథాన్ని, పట్టుదలను పెంపొందించే సందేశం ఇందులో ఉంది. మారుమూల గ్రామాల్లోనూ ప్రతిభకు కొదవలేదని, సరైన ప్రోత్సాహం లభిస్తే అక్కడి నుంచే గొప్ప శాస్త్రవేత్తలు ఎదగగలరనే నమ్మకాన్ని కలిగిస్తుంది.
ఆడపిల్లల కలలకు అడ్డుకట్ట వేయకూడదు. జీవిత భాగస్వామి ఆశయాలకు అండగా నిలవాలి. పిల్లల కలలను ప్రోత్సహించాలి. ఈ మూడు గొప్ప సందేశాలను అందించే ‘ఆకాశంలో ఒక తార’ అభినందించదగిన చిత్రం.ఆకాశంలో తారగా మెరవడానికి అదృష్టం ఒక్కటే సరిపోదు.. ఆశయం, ఆత్మవిశ్వాసం, అలుపెరుగని కృషి ఉండాలని చూపించిన చిత్రం. మంచి సినిమా.
నరసింహారెడ్డి చందమూరి.
ఫ్రీలాన్స్ జర్నలిస్టు, కదిరి.
శ్రీ సత్యసాయి జిల్లా.


















