సీట్లు పెంచడం ప్రజాస్వామ్యమా.. ప్రజాధనం కరిగించడమా?
ప్రజల సమస్యలు తీరకముందే ప్రజాప్రతినిధుల సంఖ్య పెంచడం ఎందుకు? పాలనలో నాణ్యత పెరగకుండానే కుర్చీలు పెంచితే ప్రజాస్వామ్యం బలపడుతుందా? లేక ప్రజల పన్నులతో రాజకీయ వ్యవస్థను మరింత భారంగా మార్చినట్టేనా?
డీలిమిటేషన్తో చట్టసభల్లో స్థానాల సంఖ్య పెంచే ప్రతిపాదనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పార్లమెంటు లో బిల్లు పాస్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే క్యాబినెట్ ఆమోదం పొందిందని చెబుతున్నారు. జనాభా పెరిగిన నేపథ్యంలో ప్రాతినిధ్యం పెరగాలన్న వాదనకు బలం ఉంది. మహిళలు, వెనుకబడిన వర్గాలు, జనాభా పెరిగిన ప్రాంతాలకు మరింత ప్రాతినిధ్యం లభించడం కూడా ప్రజాస్వామ్యపరంగా అవసరమే. అయితే సీట్ల పెంపే అందుకు సరైన మార్గమా? అన్నదే ఇప్పుడు తేలాల్సిన ప్రశ్న.
మహిళా రిజర్వేషన్ అమలుతో ప్రస్తుత నియోజకవర్గాల్లో కొన్ని స్థానాలు మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. దీంతో ప్రస్తుతం పదవుల్లో ఉన్న కొందరు పురుష ప్రజాప్రతినిధుల స్థానాలు రిజర్వేషన్ పరిధిలోకి రావచ్చు. తమ పదవులకు ముప్పు రాకుండా ముందుగా సీట్ల సంఖ్య పెంచి, ఆ తర్వాత మహిళా రిజర్వేషన్ అమలు చేయాలనే రాజకీయ ఆలోచన ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం రాజకీయ అనుమానంగా కాకుండా ప్రజల ముందున్న చర్చనీయాంశంగా మారింది. మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడం తప్పనిసరి అయితే, దానికి అయ్యే ఖర్చు–ప్రయోజనాలపై కూడా అంతే పారదర్శకత అవసరం.
లోక్సభ స్థానాలను ప్రస్తుత 545 స్థాయి నుంచి సుమారు 850కి పెంచే అవకాశాలపై చర్చలు జరుగుతున్నాయి. అలా జరిగితే దాదాపు 305 స్థానాలు అదనంగా రావచ్చు. ఐదారు స్థానాలు అటోఇటో కావచ్చు. ఒక్కో ఎంపీపై జీతభత్యాలు, సిబ్బంది, కార్యాలయం, నివాసం, ప్రయాణాలు తదితర వ్యయాలను కలిపి సంవత్సరానికి సగటున రూ.4–5 కోట్లుగా అంచనా వేస్తే, అదనపు సభ్యులకే ఏటా సుమారు రూ.1,220–1,525 కోట్ల వ్యయం రావచ్చు.
ఇది ప్రత్యక్ష వ్యయానికి సంబంధించిన అంచనా మాత్రమే. రాజ్యసభ, రాష్ట్రాల శాసనసభలు, శాసనమండళ్లలో స్థానాలు పెరిగితే ఖర్చు మరింత పెరుగుతుంది. కొత్త నివాసాలు, కార్యాలయాలు, భద్రత, సిబ్బంది, వాహనాలు, మౌలిక వసతులు వంటి పరోక్ష వ్యయాలు కూడా చేరతాయి. మొత్తం భారం దీర్ఘకాలంలో వేల కోట్లకు చేరే అవకాశం ఉంది. ఆ డబ్బు ప్రజలది.
అదే ప్రజాధనంతో ప్రభుత్వాలు ఆసుపత్రులు, పాఠశాలలు, రహదారులు, సాగునీరు, తాగునీరు, ఉపాధి వంటి ప్రాథమిక అవసరాలను తీర్చాలి. అందువల్ల కొత్త పదవులు, కొత్త సౌకర్యాలు, కొత్త మౌలిక వసతులకు వెచ్చించే ప్రతి రూపాయి ప్రజా ప్రయోజనానికి ఎంత ఉపయోగపడుతుందో చెప్పాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. ఇక్కడ మరో కీలక అంశం ఉంది. సభ్యుల సంఖ్య పెరగడం వల్ల చట్టసభల నాణ్యత తప్పనిసరిగా పెరుగుతుందనే హామీ లేదు. హాజరు, చర్చల స్థాయి, కమిటీల పనితీరు, ప్రభుత్వ విధానాలపై పర్యవేక్షణ, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాల్లోనే అసలు పనితీరు కనిపించాలి.
సీట్లు పెంచే ముందు ఈ వ్యవస్థను ఎందుకు మెరుగుపరచకూడదు? ప్రజాప్రతినిధుల పనితీరును ఎందుకు కొలవకూడదు? ప్రజలు తమ ఎంపీ లేదా ఎమ్మెల్యే ఏం చేశారో తెలుసుకునేలా పారదర్శక వ్యవస్థ ఎందుకు ఉండకూడదు?
కుర్చీలు పెంచడం కంటే బాధ్యత పెంచడం ప్రజాస్వామ్యానికి ఎక్కువ అవసరం.
డీలిమిటేషన్ అవసరమైతే జరగాలి. జనాభా ప్రాతినిధ్యంలో అసమతుల్యత ఉంటే సరిచేయాలి. మహిళలకు రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ అమలు చేయాలి. కానీ ఈ ప్రక్రియ రాజకీయ పదవుల రక్షణకు మార్గంగా మారకూడదు. ప్రజల ప్రాతినిధ్యం పేరుతో ప్రజాధనంపై అదనపు భారాన్ని మోపే ముందు సమగ్ర ఆర్థిక, పరిపాలనా పరిశీలన తప్పనిసరి.
ప్రజాస్వామ్యం పెద్దదవ్వాలంటే చట్టసభ భవనం పెద్దది కావాల్సిన అవసరం లేదు; ప్రజల గొంతుకకు విలువ పెరగాలి. ప్రతినిధులు పెరిగినా ప్రజల సమస్యలు అలాగే ఉంటే సంఖ్యకు అర్థం లేదు. మహిళల ప్రాతినిధ్యం పెరిగినా అది రాజకీయ లెక్కల ఫలితంగా కనిపిస్తే ప్రజాస్వామ్యంపై నమ్మకం దెబ్బతింటుంది. ప్రజాధనం పెరిగిన ఖర్చుతో కరిగిపోతే అభివృద్ధికి కేటాయించాల్సిన వనరులు తగ్గే ప్రమాదం ఉంది.
ప్రజల పన్నులతో రాజకీయ వ్యవస్థను విస్తరించడం కాదు.. ప్రజల జీవితాలను విస్తరించడమే పాలనకు కొలమానం కావాలి. డీలిమిటేషన్ లక్ష్యం కుర్చీల సంఖ్య కాదు.. ప్రజల ప్రాతినిధ్య న్యాయం.
మహిళా రిజర్వేషన్ లక్ష్యం పదవుల పునర్విభజన కాదు.. మహిళలకు సమాన రాజకీయ హక్కు.
ప్రజాధనం లక్ష్యం రాజకీయ సౌకర్యాలు కాదు.. ప్రజా సంక్షేమం.
ఈ మూడు లక్ష్యాలు కలిసినప్పుడే నిర్ణయం ప్రజాస్వామ్యానికి మేలు చేస్తుంది. ప్రజలకు ఎక్కువ కుర్చీలు అవసరమా?
లేక ఎక్కువ బాధ్యతతో పనిచేసే పాలన అవసరమా?
దేశం ఆలోచించాల్సింది ఇదే.
Delimitation
నరసింహ రెడ్డి చందమూరి.
ఫ్రీలాన్స్ జర్నలిస్టు. కదిరి.
శ్రీ సత్యసాయి జిల్లా.


















