ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ఘన విజయాన్ని సాధించారు. మొత్తం 781 మంది పార్లమెంట్ సభ్యులకుగాను 767 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే భారత రాష్ట్ర సమితి (BRS), బీజేడీ, శిరోమణి అకాళీదళ్ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనలేదు.
ఈ ఎన్నికల్లో ఎన్డీయే తరఫున సీపీ రాధాకృష్ణన్, విపక్షాల తరఫున జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి పోటీ చేశారు. విజయానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 377 కాగా.. రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు, సుదర్శన్‌రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. మొత్తం పోలైన ఓట్లలో 15 చెల్లనివిగా తేలాయి. 14 మంది ఎంపీలు గైర్హాజరయ్యారు. చివరికి 152 ఓట్ల మెజార్టీతో రాధాకృష్ణన్ విజయం సాధించినట్లు రాజ్యసభ సెక్రటరీ ప్రకటించారు.
పార్లమెంట్ నూతన భవనంలోని ‘ఎఫ్-101 వసుధ’ హాల్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్, సాయంత్రం 5 గంటలకు ముగిసింది. అనంతరం సాయంత్రం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరిపారు.
భారత 17వ ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ పూర్తి పేరు చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్. ఆయన 1957 అక్టోబర్ 20న తమిళనాడులోని తిరుప్పూర్‌లో జన్మించారు. రాజకీయ రంగంలో విశేష అనుభవం కలిగిన ఆయన, తమిళనాడు నుంచి ఉప రాష్ట్రపతి పీఠాన్ని అధిష్ఠించనున్న మూడో వ్యక్తిగా గుర్తింపు పొందారు. దేశ అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఒకటైన ఉప రాష్ట్రపతి స్థానాన్ని సాధించిన సీపీ రాధాకృష్ణన్ విజయం ఎన్డీయే కూటమికి మరో బలాన్ని చేకూర్చింది. ఆయన అనుభవం, నాయకత్వ లక్షణాలు రానున్న రోజుల్లో దేశానికి ఉపయుక్తం అవుతాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.