అమెరికాకు అతిపెద్ద ఎగుమతిదారుల్లో భారత్ ఒకటి. 2023-24లో అమెరికాకు 77.5 బిలియన్ డాలర్ల (సుమారు 6,74,391 కోట్ల రూపాయలు) విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసింది.
అదే సమయంలో, అమెరికా నుంచి దిగుమతులు 17 శాతం తగ్గి, 42.2 బిలియన్ డాలర్లకు (సుమారు 3,67,219 కోట్ల రూపాయలు) చేరాయి. ఇందులో సమతుల్యత పాటించాలని ట్రంప్ నిత్యం బెదిరిస్తున్నారు.భారత్‌లో దిగుమతి సుంకం సగటు 18 శాతం. ఇంపోర్టెడ్ కార్లపై 125 శాతం, మద్యంపై 150 శాతం వరకూ సుంకాలు ఉన్నాయి.
దిగుమతి సుంకాల విషయంలో, భారత్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నియమాలను కూడా అనుసరిస్తోంది. భారత్ – అమెరికా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) లేదు. ఈ ఒప్పందం ఉండి ఉంటే, ఈ సుంకాలు తగ్గే అవకాశాలు పెరిగేవి.
భారత్ ముడిచమురు, దాని అనుబంధ ఉత్పత్తులు, ముత్యాలు, విలువైన రాళ్లు, ఆర్టిఫిషియల్ జ్యువెల్లరీ, న్యూక్లియర్ రియాక్టర్లు, బాయిలర్లు, పవర్ ప్లాంట్ పరికరాలు, విమానాలు, వాటి విడిభాగాలు, మెడికల్, మిలటరీ పరికరాలను అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటోంది.
పెట్రోలియం ఉత్పత్తులు, ఔషధాలు, ముత్యాలు, విలువైన రాళ్లు, టెలీకమ్యూనికేషన్ పరికరాలు, నూలు వస్త్రాలు, ఎలక్ట్రానిక్ యంత్రాలను భారత్ పెద్దయెత్తున అమెరికాకు ఎగుమతి చేస్తోంది. భారత్ ఎగుమతులు వేగంగా పెరిగాయి. వాణిజ్య లోటు నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చర్యలు ప్రారంభించారు. మెక్సికో, కెనడాలపై 25 శాతం, చైనాపై 10 శాతం పన్నులు విధిస్తున్నట్లు ఫిబ్రవరి 1న ప్రకటించారు.
ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరైనా ప్రతీకార చర్యలకు దిగితే సుంకాలను మరింత పెంచేస్తానని కూడా ట్రంప్ బెదిరించారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించిన ‘రీసర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్’ (RIS) ప్రకారం, అమెరికా వాణిజ్య లోటుకి కారణమవుతున్న దేశాల్లో ప్రధానంగా చైనా, మెక్సికో, కెనడా ఉన్నాయి.
అమెరికాకు భారీగా ముడిచమురు సరఫరా చేస్తున్న దేశం కెనడా. జనవరి నుంచి నవంబర్ మధ్య 61 శాతం ముడిచమురు అమెరికాకు సరఫరా చేసింది.
తాజాగా మెక్సికో, కెనడాలపై విధించిన సుంకాలను నెలరోజులపాటు నిలిపివేస్తున్నట్టు అమెరికా ప్రకటించింది.
ఈ నేపథ్యంలో వాణిజ్యలోటు, సుంకాలు అంటే ఏమిటి? అమెరికా చర్యలు భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? భారత్‌పైనా అమెరికా భారీగా సుంకాలు విధిస్తుందా, అసలు ట్రంప్ మొదటిపాలనా కాలంలో భారత్‌తో సంబంధాలు ఎలా ఉన్నాయో చూద్దాం.ఒక దేశం చేసుకునే దిగుమతులు, దాని ఎగుమతులను మించిపోవడాన్ని వాణిజ్య లోటుగా వ్యవహరిస్తారు. ఈ వాణిజ్య లోటు దేశంలో ఉపాధి అవకాశాలను తగ్గించడంతో పాటు ఆర్థిక వృద్ధిని కూడా ప్రభావితం చేస్తుంది.
ఐఆర్ఎస్ ప్రకారం, ప్రస్తుతం అమెరికాకు చైనా భారీగా ఎగుమతులు చేసి, దిగుమతులు తక్కువగా చేసుకుంటోంది. మెక్సికో, కెనడా విషయంలోనూ ఇదే పరిస్థితి. దీంతో వాణిజ్యంలో అమెరికా నష్టాలను ఎదుర్కొంటోంది.
అంటే, చైనా కారణంగా అమెరికా భారీగా వాణిజ్య లోటును చవిచూస్తోంది. ఆ జాబితాలో మెక్సికో రెండు, కెనడా మూడో స్థానాల్లో ఉన్నాయి.ట్రంప్ పన్నుల ప్రకటన తర్వాత, భారత్‌లోనూ వీటిపై చర్చ మొదలైంది. రాజకీయ వర్గాల నుంచి ఆర్థిక వర్గాల వరకూ, వాణిజ్య లోటు వ్యవహారంలో భారత్ విషయంలోనూ ట్రంప్ ఏదైనా నిర్ణయం తీసుకుంటారా అనే చర్చ జరుగుతోంది.
అమెరికా వాణిజ్య లోటులో భారత్ వాటా కేవలం 3.2 శాతం మాత్రమే. అయినప్పటికీ, ట్రంప్ ఇప్పటికే బ్రిక్స్ దేశాలను బెదిరించారు. ఇందులో భాగమైన చైనాపై చర్యలు కూడా తీసుకున్నారు. భారత్ కూడా బ్రిక్స్ గ్రూపులో భాగమే.
ట్రంప్ మరిన్ని చర్యలకు దిగొచ్చు. మొదటి పదవీకాలంలో స్టీల్, అల్యూమినియం దిగుమతులపై ట్రంప్ సుంకాలు విధించారు. అయితే, హార్లే డేవిడ్‌సన్ బైకుల దిగుమతులపై భారత్ సుంకాలను తగ్గించింది.పన్నులు పెంచుతామని ట్రంప్ నిరంతరం బెదిరింపులకు దిగుతున్నప్పటికీ, భారత అతిపెద్ద మార్కెట్‌ను అమెరికా విస్మరించలేదు.
అమెరికన్ ఈ-కామర్స్ కంపెనీలు, బ్యాంకులు, ఆర్థిక సేవలు, టెక్నాలజీ సంస్థలకు భారత మార్కెట్‌పై ఆసక్తి భారీగానే ఉంది. సోషల్ నెట్‌వర్కింగ్ కంపెనీలకు కూడా భారత్ ప్రధానం.
ఫిబ్రవరిలో జరగనున్న ట్రంప్-మోదీ సమావేశంలో అమెరికా వాణిజ్య లోటు తగ్గించేందుకు నూతన మార్గాన్ని అన్వేషించే అవకాశం ఉంది.
రక్షణ రంగంలో భారత్‌కు అమెరికా మద్దతు అవసరం. భారత్ విభిన్న రకాలైన, అత్యాధునిక ఆయుధాలను కోరుకుంటోంది. అలాగే, పెట్రోలియం రంగంలోనూ, గల్ఫ్ దేశాల కంటే మెరుగైన ఆఫర్ వస్తే అమెరికా వైపే భారత్ మొగ్గుచూపే అవకాశముంది.
జనవరి 27న ట్రంప్ – ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడుకున్న తర్వాత వైట్‌హౌస్ విడుదల చేసిన ప్రకటనలో, ”అమెరికాలో తయారైన రక్షణ పరికరాల కొనుగోళ్ల పెంపుతో పాటు ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోవాల్సిన ప్రాధాన్యాన్ని అధ్యక్షుడు ప్రధానంగా చర్చించారు. అమెరికా – భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం, ఇండో – పసిఫిక్ క్వాడ్ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉన్నట్లు ఇద్దరు నేతలూ చెప్పారు. ఈ ఏడాది చివర్లో క్వాడ్ నేతలకు భారత్ మొదటిసారి ఆతిథ్యం ఇవ్వనుంది” అని పేర్కొంది.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (IIPA) ప్రొఫెసర్, డాక్టర్ మనన్ ద్వివేది మాట్లాడుతూ, ”ఇది వాణిజ్యపరంగా భారత్‌కు లభించిన ఒక అవకాశం. ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్ల సహా అనేక తయారీ పరిశ్రమలకు భారత్ ఒక సప్లై చైన్‌గా ఆవిర్భవించగలదు. ఇక భారత్‌పై సుంకాలు విధించే విషయానికొస్తే, ఇటీవల సీబీఎస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ భారత్ చెడ్డ దేశం కాదన్నారు. సుంకాల విషయంలో భారత్, అమెరికా పనిచేస్తున్నాయి” అన్నారు.
”మరో విషయం ఏంటంటే, ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. అందువల్ల, భారత్‌పై భారీగా సుంకాలు విధించే అవకాశం లేదు. ఈ సుంకాల యుద్ధంతో భారత్‌కు ప్రయోజనం కలగొచ్చు. చైనా సప్లై చైన్‌లో ఇబ్బందుల కారణంగా, ఆ స్థానాన్ని చేజిక్కించుకునే అవకాశం భారత్‌కు వస్తుంది. ఈ సుంకాలు అమెరికా, కెనడా, మెక్సికో ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి” అన్నారాయన.
”మెక్సికో తన ఉత్పత్తుల్లో 83 శాతం అమెరికాకు విక్రయిస్తుండగా, కెనడా 76 శాతం అమెరికాకు ఎగుమతులు చేస్తోంది. చైనాపై భారీ సుంకాల కారణంగా తూర్పు ఆసియా దేశాల నుంచి కూడా అమెరికాకు ఎగుమతులు పెరుగుతాయి. ఇది చైనా, కెనడా, మెక్సికోలో ఉద్యోగాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఆ దేశాల జీడీపీపై కూడా ప్రతికూల ప్రభావం చూపించొచ్చు” అని మమన్ ద్వివేది అంటున్నారు.సుంకం అంటే మరో దేశం నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై వేసే పన్ను. ఎగుమతులు చేసే వాటిపై కంటే, ఆ ఉత్పత్తులను దిగుమతి చేసుకునే సంస్థలపై ఈ పన్నులు విధిస్తారు.
అంటే, అమెరికాకు లక్ష డాలర్ల ఖరీదైన కారును దిగుమతి చేసుకుంటే, దానిపై 25 శాతం పన్ను పడుతుంది, అప్పుడు కారు ధర 25 వేల డాలర్లు పెరుగుతుంది.
ఒక అమెరికన్ కంపెనీ చైనా కంపెనీ నుంచి ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటే, దాని ఫిక్స్‌డ్ రేటుపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. చైనా ఉత్పత్తులపై అమెరికా విధించే సుంకాలు పెరిగితే, సదరు అమెరికన్ కంపెనీ ఎక్కువ సుంకం చెల్లించాల్సి ఉంటుంది.
అప్పుడు, అమెరికన్ కంపెనీలు చైనాకు బదులుగా పన్నులు తక్కువగా ఉన్న ఇతర దేశాల నుంచి ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు మొగ్గుచూపుతాయి. ఇది ఆ ఇతర దేశాలకు లాభం చేకూరుస్తుంది. కానీ, చైనాకు నష్టం చేస్తుంది.
దిల్లీలోని ఫోర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో చైనా వ్యవహారాల నిపుణుడు , ప్రొఫెసర్ ఫైసల్ అహ్మద్ మాట్లాడుతూ, ”ట్రంప్ భారత్‌పై సుంకాలు విధించడం పెద్ద విషయమేమీ కాదు.ఇంతకుముందు కూడా విధించారు. అదొక్కటే కాదు, భారత్‌ను జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ (GSP) నుంచి కూడా తొలగించారు. భవిష్యత్తులోనూ అలా చేసే అవకాశముంది. దీనికి నిరసనగా, భారత్ కూడా అమెరికాకు చెందిన 20కి పైగా ఉత్పత్తులపై సుంకాలు విధించింది. అయితే, జీ20 సమావేశాలకు ముందు వాటిని రద్దు చేసింది. ఇలాంటివన్నీ జరగడానికి ముందే, భారత్ చొరవ తీసుకుని స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్), జీఎస్పీ పునరుద్ధరణపై చర్చించాలి” అన్నారు.
”రెండోది, ఇండో – పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించాలని అమెరికా అనుకుంటోంది. అందుకే ఇదంతా. ఈ నేపథ్యంలో, రెండు దేశాలూ భవిష్యత్ వాణిజ్య వ్యూహాల గురించి చర్చిస్తాయి, తమ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకునేందుకు మొగ్గుచూపుతాయి. మెక్సికో, కెనడా విషయానికొస్తే.. ప్రాంతీయంగా ఆధిపత్యం పెంచుకోవడానికే అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఘర్షణ కారణంగా భారత్‌కు ఏదైనా అవకాశం లభిస్తుందా అంటే, అందుకు అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. దీని ఫలితంగా, ఈ దేశాల నుంచి వచ్చే వస్తువుల ధరలు భారత్‌లోనూ మరింత పెరుగుతాయి” అని ఆయన చెప్పారు.
”ముఖ్యంగా ఈ మూడు దేశాలతో అమెరికా వాణిజ్య లోటు అత్యధికంగా, 65 శాతం ఉంది. అందువల్ల ఇదే పరిస్థితి మరికొంతకాలం కొనసాగవచ్చు. అయితే, దీని వల్ల చైనా పెద్దగా నష్టపోయేది లేదు. ఇప్పుడు పన్నుల పెంపు చర్య ఎందుకంటే,ఇకపై అమెరికా ప్రయోజనాలే ప్రాధాన్యంగా భవిష్యత్ వాణిజ్య వ్యవహారాలు ఉంటాయి. గ్లోబల్ వాల్యూ చైన్‌లో తమ ఆధిపత్యం పెంచుకోవాలనుకుంటున్నారు.”