తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సమగ్ర పర్యాటక విధానాన్ని ఫిబ్రవరి 10వ తేదీలోగా సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రదేశాలు, అభయారణ్యాలు, ఆలయాల ప్రాతిపదిక చేసుకొని పాలసీని రూపొందించాలని సీఎం సూచించారు.
దేశీయంగా వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న పర్యాటక పాలసీలతో పాటు అంతర్జాతీయంగా ప్రముఖమైన పాలసీలను అధ్యయనం చేసి తెలంగాణ పర్యాటక పాలసీ రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. తెలంగాణకు దేశీయ పర్యాటకులనే కాకుండా అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించాలన్నారు.
దేశ, విదేశాల్లోని బెస్ట్ పాలసీలను అధ్యయనం చేసి అందుకు అనుగుణంగా పాలసీని రూపొందించాలని చెప్పారు.ఆదిలాబాద్, వరంగల్, నాగార్జున సాగర్ తదితర ప్రాంతాలలో ఎకో టూరిజంను మరింత అభివృద్ధి పరిచేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. సింగపూర్ తరహా ఎకో టూరిజం విధానాలను పరిశీలించాలంటూ ఉన్నతాధికారులకు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
వచ్చే గోదావరి, కృష్ణా పుష్కరాలకు దేశవ్యాప్తంగా భక్తులు, పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. రాష్ట్రంలో ఎకో టూరిజంకు అవసరమైన ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేసేలా ప్రణాళికలు ఉండాలని పేర్కొన్నారు.
హుస్సేన్ సాగర్ పరిసరాల్లోని సంజీవయ్య, ఎన్టీఆర్, ఇందిరా పార్క్‌లను కలుపుతూ టూరిజం సర్క్యూట్‌ను అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలని ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పర్యాటకాభివృద్ధి ద్వారా రాష్ట్రానికి మరింత గుర్తింపుతో పాటు ఆదాయం వచ్చేలా విధి విధానాలను రూపొందించాలని ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు