ఒకవైపు యుక్రెయిన్‌కు సైనిక సాయం నిలిపివేత, మరోవైపు కెనడా, మెక్సికో దేశాల దిగుమతులపై భారీ సుంకాలను విధించిన అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్.. మంగళవారం రాత్రి అమెరికన్ కాంగ్రెస్ (పార్లమెంట్) జాయింట్ సెషన్‌లో కీలక ప్రసంగం చేశారు.
‘‘ గత ప్రభుత్వాలు నాలుగు లేదా ఎనిమిదేళ్లలో సాధించలేనిది మేం కేవలం 43 రోజుల్లో సాధించాం. ఇదింకా ఆరంభం మాత్రమే’’ అంటూ… వలసలపై ఇప్పటి వరకు దేశం లోపల చేపట్టిన చర్యలను డోనల్డ్ ట్రంప్ ప్రశంసించారు.
ఒక్కోసారి కొందరి వల్ల, కొన్ని సందర్భాల వల్ల కొన్ని మాటలకు భలే డిమాండు పెరుగుతుంది. ఆ సందర్భాలు కష్టపెట్టేవే అయినా “మొలలోతు కష్టాల్లో మోకాటి లోతు ఆనందం” అన్నట్లు ఆ మాటల వాడుకకు భాషాభిమానులు మురిసిపోవచ్చు. అలా రెండోసారి అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ దయ వల్ల ప్రపంచం నిద్రలోకూడా పలవరిస్తున్న మాటలు- పన్నులు, సుంకాలు, ప్రతీకార సుంకాలు.
పట్టుకునేది పన్ను అని స్థూలంగా అనుకోవచ్చు. అందుకే ఆదాయపుపన్ను వాళ్ళు ఎప్పుడూ పట్టుకునే పనిలోనే ఉంటారు. పన్ను ఎగ్గొట్టినవారి పళ్ళూడగొట్టి వసూలు చేసుకుంటూ ఉంటారు. పట్టులో చివరి ట్టు న్ను అవుతుంది. నోట్లో పన్ను కూడా ఆహారాన్ని పట్టుకుని కొరకాలి కాబట్టి అదే అర్థంలోనే ఉంది.
తెలుగుకు ప్రామాణికమైన నిఘంటువు శబ్దరత్నాకరం ప్రకారం పన్ను అంటే యుద్ధానికి సిద్ధపడు, కలుగు, చేయు, ఏర్పరచు, కప్పం అన్న అర్థాలున్నాయి. సుంకం అంటే ఎగుమతులు, దిగుమతుల్లో ప్రభుత్వాలకు కట్టే పన్ను. కప్పం అంటే చక్రవర్తి లేదా రాజుకు సామంతరాజు విధిగా చెల్లించేది.
ఇప్పుడు అమెరికాకు స్వర్ణయుగం తెచ్చే పనిలో ఉన్న ట్రంప్ తెంపరి టెంపరి ట్రంపరి భాషలో “ప్రతీకార సుంకం” అన్న మాట ఒకటి బాగా ప్రచారంలోకి వచ్చింది. దీనిమీద అటు భాషావేత్తలు, ఇటు పన్నులు, సుంకాల నిపుణులు లోతుగా చర్చించి సామాన్యులకు కొంత అవగాహన కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పన్నులు, సుంకాల పరిభాష; వాటి లెక్కలు; వాటి మదింపు; లాభనష్టాలు ఒకపట్టాన ఎవరికీ అర్థం కావు. అర్థమయ్యిందని అనుకునేవారికి ఎంత అర్థమయ్యిందో లోకానికి కూడా ఒక క్లారిటీ ఉంటుంది. ఈ గొడవలన్నీ ఎందుకని ఉద్దేశపూర్వక ఎగవేతదారులు అసలు పన్నులే కట్టరు.
వారు దేశానికి పంటికింద రాళ్ళుగా ఉండి…ఒక శుభ ముహూర్తాన సొంత విమానాల్లో విదేశాలకు చెక్కేసి…కొరకరాని కొయ్యలై…దేశం నెత్తిన పెద్ద బండరాళ్ళు వేస్తూ ఉంటారు. దేశం కొయ్య బొమ్మగా మారి చోద్యం చూస్తూ ఉంటుంది. ఆ భారాన్ని సామాన్యులు, పళ్ళుండి పన్నులు కట్టేవారు సమానంగా పంచుకుంటూ ఉంటారు.
సాధారణంగా మనం కరెంటు బిల్లులు, పెట్రోల్, డీజిల్, టోల్ టాక్స్ లు చూడకుండా కట్టేస్తూ ఉంటాం. చూస్తే ప్రపంచంలో ఉన్న సమకాలీన ఎన్నెన్నో సమస్యలకు మన దగ్గర నుండే ఏయే పేర్లతో సెస్సులుగా వసూలు చేస్తున్నారో తెలుస్తుంది.
ఒక్కోసారి తాగే మద్యం బాటిల్ ధరలో విద్యాభివృద్ధికి వసూలు చేసే ఎడ్యుకేషన్ సెస్ ఉండచ్చు. మన మంచి చదువులకు తాగుబోతులు వారి ప్రాణాలను పణంగా పెడుతూ ఉండి ఉండవచ్చు. సిగరెట్ తాగేవారు తాము బూడిద అవుతూ కొన్న సిగరెట్లో జాతీయ రహదారి నిర్మాణ సెస్ కట్టి…రోడ్డు బూడిదలో బూడిద అయి ఉండవచ్చు.
అలా ట్రంప్ ప్రతీకార సుంకాలు ప్రపంచానికి భారం కావచ్చు. కానీ అమెరికాకు స్వర్ణయుగం రావాలంటే ప్రపంచానికి పాతరాతి యుగం రావాలన్న ట్రంప్ ఆధునిక వ్యాపార రాజకీయ సూత్రానికి అమెరికాలో ఆమోదం కూడా లభించవచ్చు.
వారాల్లో లక్షల కోట్ల సంపద హారతి కర్పూరాలు; శాంతి చర్చల్లో చేపల మార్కెట్ సంభాషణలు; యుద్ధం మీద పెట్టుబడులు; ఆ పెట్టుబడులకు లాక్కునే సహజ వనరులు; నాటో కూటములు; కూల్చే కోటలు; పోయే ప్రాణాలు; రాల్చే మొసలి కన్నీళ్ళు…ఇలా దేని లెక్కలు దానికుంటాయి. ఎవరి లెక్కలు వారికుంటాయి. ఆ లెక్కలు తప్పినప్పుడు లెక్కలు సరిచేసే ప్రతీకార సుంకాలు ప్రవేశిస్తాయి.