ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాల్లో సంఘర్షణలు, యుద్ధాలు, హింసాత్మక వాతావరణం, ఉద్రిక్తతలు ఉన్నాయి. కొందరు ప్రజలు భయాందోళనలతో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. మరికొందరు వలసలు వెళ్లిపోతున్నారు. యుద్ధాలతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయింది. కరవు, ఆహారం, నీటి సంక్షోభాలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత ప్రశాంతమైన దేశం ఏది..? అని సామాజిక మాధ్యమాల్లో సెర్చింగ్ మెదలైంది.
గత కొన్నేళ్లుగా ప్రపంచంలోని అనేక దేశాల్లో అనిశ్చితి నెలకొంది. ఓవైపు యుద్ధాలు, ఉద్రిక్తతలు.. మరోవైపు ఆహారం, నీటి సంక్షోభంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో అసలు ప్రపంచంలోనే అత్యంత ప్రశాంతమైన దేశం ఏది..? అనే దానిపై చర్చ మొదలైంది. అయితే తాజాగా గ్లోబల్ పీస్ ఇండెక్స్-2025 విడుదలైంది. ఈ నివేదిక ప్రతిఏటా రిలీజ్ అవుతుంది. ఈ రిపోర్టును ఇన్ స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్(IEP) అనే సంస్థ విడుదల చేస్తుంది.
ఈ నివేదిక ప్రకారం ప్రపంచదేశాల్లో శాంతి గతేడాదితో పోల్చితే 0.36శాతం క్షిణించింది. రెండో ప్రపంచయుద్ధం తర్వాత ప్రపంచంలో ఇప్పుడే అత్యధికంగా అశాంతి నెలకొందని నివేదిక స్పష్టం చేసింది. గత 17 ఏళ్లుగా చూస్తే ప్రతి దేశంలో శాంతి 5.4 శాతం మేర తగ్గిపోయినట్లు తేలిందని పేర్కొంది. అయితే 74 దేశాల్లో గతంతో పోల్చితే కొంత మెరుగైన పరిస్థితి ఉందని తెలిపింది. మొత్తం ప్రపంచంలోని అన్ని దేశాలను పరిగణలోకి తీసుకుంటే గత రెండు దశాబ్దాలుగా చూస్తే 11.7 శాతం శాంతి క్షీణించినట్లు రిపోర్టు తెలిపింది.
ఇక ప్రపంచంలోనే అత్యంత ప్రశాంతమైన దేశంగా ఐస్ ల్యాండ్ నిలిచింది. రెండో స్థానంలో ఐర్లాండ్ ఉంది. మూడో స్థానంలో న్యూజిలాండ్, నాలుగో స్థానంలో ఆస్ట్రియా, ఐదో స్థానంలో స్విట్జర్లాండ్ ఉంది. ఇక చివరి స్థానాలు చూస్తే 163వ స్థానంలో రష్యా, 162వ స్థానంలో ఉక్రెయిన్ ఉన్నాయి. 161 వ స్థానంలో సూడాన్, 160 వ స్థానంలో కాంగో ఉన్నాయి. 155వ స్థానంలో ఇజ్రాయెల్ ఉంది.
ఇక భారత్ 115వ స్థానంలో ఉంది. 144వ స్థానంలో పాకిస్థాన్ ఉంది. 123వ స్థానంలో బంగ్లాదేశ్, 158వ స్థానంలో ఆఫ్గనిస్థాన్ ఉన్నాయి.