తమిళనాడు రాజకీయాల్లో ఈసారి అసలు సెన్సేషన్‌గా మారింది సినీ నటుడు ‘దళపతి’ విజయ్ రాజకీయ ప్రవేశం. తమిళగ వెట్రి కళగం అంటే TVK పార్టీతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్… ఇప్పుడు కేవలం సినీ స్టార్ కాదు, రాజకీయాల్లో కూడా భారీ ప్రభావం చూపిస్తున్న నాయకుడిగా మారిపోయారు. ప్రస్తుతం తమిళనాడులో ప్రధాన పోటీ DMK, AIADMK మధ్య కొనసాగుతున్నా… విజయ్ పార్టీ మాత్రం గేమ్‌చేంజర్‌గా కనిపిస్తోంది.
ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ చూస్తే కొన్ని సంస్థలు TVK పార్టీకి ఆశ్చర్యకర స్థాయిలో సీట్లు వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నాయి. కొన్ని సర్వేలు 90కి పైగా, మరికొన్ని 100కు పైగా సీట్లు కూడా రావచ్చని చెబుతున్నాయి. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ ఈ అంచనాలు నిజమైతే… విజయ్ కేవలం కింగ్ మేకర్ మాత్రమే కాదు, నేరుగా కింగ్ అయ్యే అవకాశమూ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రత్యేకంగా విజయ్ ఎలాంటి పెద్ద కూటమి లేకుండా ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేయడం చాలా పెద్ద రిస్క్‌గా భావించారు. కానీ అదే ఇప్పుడు అతనికి బలంగా మారిందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. సంప్రదాయ ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయం కావాలనుకునే యువత, మధ్యతరగతి ఓటర్లు, కొత్త నాయకత్వాన్ని కోరుకునే ప్రజలు TVK వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు అధికార పార్టీ DMK కూడా బలంగానే ఉంది. ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలు వారికి ప్లస్‌గా మారాయి. అలాగే AIADMK కూడా తమ పాత ఓటు బ్యాంక్‌ను తిరిగి సంపాదించుకునే ప్రయత్నంలో ఉంది. ఈ నేపథ్యంలో విజయ్ పార్టీ పూర్తి మెజారిటీ సాధించకపోయినా… ప్రభుత్వం ఏర్పాటు చేసే సమయంలో కీలక పాత్ర పోషించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అంటే ఎన్నికల తర్వాత ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నా TVK మద్దతు అవసరం అయ్యే పరిస్థితి రావచ్చు. అదే జరిగితే విజయ్ నిజమైన “కింగ్ మేకర్” అవుతారు. కానీ ఒకవేళ ప్రజలు భారీగా TVKకి మద్దతు ఇస్తే… నేరుగా ముఖ్యమంత్రి పీఠానికే విజయ్ చేరుకునే అవకాశం కూడా పూర్తిగా కొట్టిపారేయలేం.
TVK నేతలు అయితే మరింత ధీమాగా మాట్లాడుతున్నారు. తమ పార్టీకి 180 నుంచి 200 సీట్లు వస్తాయని బహిరంగంగా ప్రకటిస్తున్నారు. ఇది నిజమైతే తమిళనాడు రాజకీయ చరిత్రలోనే అతిపెద్ద సంచలనం అవుతుంది.
సినిమాల్లో హీరోగా కోట్లాది అభిమానులను సంపాదించిన విజయ్… ఇప్పుడు రాజకీయాల్లో కూడా అదే స్థాయి ప్రభావం చూపుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. తమిళ ప్రజలు మార్పు కోరుకుంటున్నారా? లేక సంప్రదాయ పార్టీలకే మరోసారి పట్టం కడతారా? అన్నది ఫలితాలు చెబుతాయి.
కానీ ఒక విషయం మాత్రం స్పష్టం… ఈ ఎన్నికల్లో విజయ్ కేవలం పోటీదారు కాదు… మొత్తం రాజకీయ సమీకరణాలను మార్చే శక్తిగా నిలిచారు.ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న ఒక్కటే…విజయ్ కింగ్ మేకరా? లేక నేరుగా కింగా?

















