Raptadu School Incident : తరగతి గదిలో తలుపుతట్టిన భయోత్పాతం!
బాలికలకు బడిలోనే భద్రత కరువైతే.. సమాజం సాధిస్తున్న అభివృద్ధికి అర్థమేమిటి?అక్షరాలు నేర్చుకోవాల్సిన తరగతి గది.. రేపటి భవిష్యత్తుకు పునాది కావాల్సిన పాఠశాల.. ఒక బాలికకు రక్తసిక్తమైన రణరంగంగా మారితే మన నాగరికత ఎటు పయనిస్తోంది? పుస్తకాలు పట్టాల్సిన చేతులు ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీయాల్సి వస్తే మన విద్యావ్యవస్థ సాధిస్తున్న ప్రగతి దేనికి సంకేతం? కుటుంబ వ్యవస్థలో లోపాలా? విద్యావిధానంలో విలువల కరువా? మాదకద్రవ్యాల మత్తా? సెల్‌ఫోన్ ప్రభావమా?
అక్షరాలు నేర్చుకోవాల్సిన తరగతి గది.. రేపటి భవిష్యత్తుకు పునాది కావాల్సిన పాఠశాల.. ఒక బాలికకు ప్రాణభయాన్ని పరిచయం చేస్తే మన నాగరికత ఎటు పయనిస్తోంది?
అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన దారుణం ప్రతి ఒక్కరినీ నిలదీస్తోంది. ఇది ఒక బాలికపై జరిగిన దాడి మాత్రమే కాదు.. సమాజంలో దిగజారుతున్న మానవీయ విలువలకు నిలువుటద్దం.
రాప్తాడు మండలంలోని ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ యువకుడు ఉదయం 10.30 గంటల సమయంలో తరగతి గదిలోకి చొరబడి చెట్లు కోసే ఎలక్ట్రిక్ పవర్ రంపంతో ముఖం, మెడ భాగాల్లో విచక్షణారహితంగా దాడి చేయడం అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థిని కూడా గాయపర్చడం భయానవాతావర్ణం సృష్టించిన సంఘటన తీవ్రంగా కలచివేసింది. కళ్లముందే జరిగిన ఈ భయానక ఘటనతో విద్యార్థులు వణికిపోయారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన వెనుక కారణాలపై సమగ్ర దర్యాప్తు జరగాలి.
హింసాత్మక మనస్తత్వానికి అడ్డుకట్ట ఎక్కడ?
ఒక వ్యక్తి తన కోపాన్ని, ఆవేశాన్ని అదుపు చేసుకోలేక మరో వ్యక్తిపై ప్రాణాంతక దాడికి దిగడం ఎంతటి ప్రమాదకర పరిణామం? మహిళలు, బాలికలపై వేధింపులు, దాడులు, హత్యలు సమాజంలో తరచూ కలవరపెడుతున్నాయి. ఎదుటివారి స్వేచ్ఛను, వ్యక్తిగత హక్కులను గౌరవించలేని మనస్తత్వం ఎలా పెరుగుతోంది? సాటి మనిషి ప్రాణానికి విలువ ఇవ్వలేని పరిస్థితి ఎందుకు ఏర్పడుతోంది? ఈ ప్రశ్నలకు సమాజం సమాధానం వెతకాలి.
చట్టాలున్నాయి.. నేరస్థుల్లో భయం ఉందా?
బాలల రక్షణకు పోక్సో చట్టం ఉంది. మహిళల భద్రతకు అనేక చట్టాలున్నాయి. నేరాలకు కఠిన శిక్షలూ ఉన్నాయి. అయినా ఇలాంటి దారుణాలు ఎందుకు జరుగుతున్నాయి? నేరం చేసినవారికి శిక్ష పడుతుందనే భరోసా సమాజంలో ఎంతవరకు ఉంది? డబ్బు, పలుకుబడి ఉన్నవారు చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుని బయటపడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నప్పుడు వాటిని కూడా నిష్పక్షపాతంగా పరిశీలించాలి. చట్టం ముందు అందరూ సమానులనే రాజ్యాంగ స్ఫూర్తి ఆచరణలో కనిపించాలి. అరెస్టులతోనే ప్రభుత్వ బాధ్యత ముగియదు. నేరాల నివారణ, వేగవంతమైన దర్యాప్తు, బాధితులకు న్యాయం కూడా అంతే ముఖ్యం.
గంజాయి మత్తా? విలువలు కోల్పోతున్న యువతా?
గ్రామాల నుంచి పట్టణాల వరకు గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. యువత మత్తుకు బానిసలవుతున్న పరిస్థితిని విస్మరించలేం. రాప్తాడు ఘటనలోనూ మాదకద్రవ్యాల వినియోగానికి సంబంధించిన అంశాలుంటే పోలీసులు శాస్త్రీయంగా దర్యాప్తు చేయాలి. అయితే గంజాయినే ఇలాంటి నేరాలకు ఏకైక కారణంగా నిర్ధారించలేం. వ్యక్తి పెంపకం, ఆలోచనా విధానం, మహిళల పట్ల దృక్పథం, హింసాత్మక ప్రవృత్తి వంటి అంశాలనూ పరిశీలించాలి. మత్తుపదార్థాల అక్రమ రవాణాను అరికట్టడంతోపాటు యువతలో మానసిక, సామాజిక పరివర్తనకు చర్యలు అవసరం.
మొదటి పాఠశాల ఇల్లు.. తొలి గురువులు తల్లిదండ్రులే!
పిల్లలకు చదువు, మార్కులు, ఉద్యోగం నేర్పిస్తున్నాం. కానీ ఎదుటివారిని గౌరవించడం, ఇతరుల స్వేచ్ఛను గుర్తించడం, కోపాన్ని నియంత్రించుకోవడం, బాధ్యతాయుతంగా ప్రవర్తించడం ఎంతవరకు నేర్పిస్తున్నాం? చేతిలో సెల్‌ఫోన్ పెడుతున్నాం. అందులో పిల్లలు ఏం చూస్తున్నారు? ఎలాంటి ప్రభావాలకు లోనవుతున్నారు? అనే విషయాలను పట్టించుకుంటున్నామా? పిల్లలతో మాట్లాడటానికి తల్లిదండ్రులకు సమయం లేకపోతే వారి వ్యక్తిత్వ వికాసానికి మార్గనిర్దేశం చేసేదెవరు? మార్పు మొదట ఇంటి నుంచే రావాలి.పిల్లల ప్రవర్తనను గమనించడానికి, వారి సమస్యలను వినడానికి తల్లిదండ్రులకు సమయం ఉందా? పిల్లలతో సంభాషణ తగ్గి, ఖరీదైన సౌకర్యాలు కల్పించడమే ప్రేమగా భావించే పరిస్థితి ఏర్పడిందా? కుటుంబంలోనే క్రమశిక్షణ, మానవత్వం, పరస్పర గౌరవం నేర్పించలేకపోతే సమాజం నుంచి వాటిని ఎలా ఆశించగలం? మార్పు ఇంటి నుంచే మొదలవ్వాలి.
విద్య అంటే కేవలం మార్కులు, ర్యాంకులు కాదు. మానవత్వం, నైతిక విలువలు, స్త్రీపురుష సమానత్వం, వ్యక్తిగత స్వేచ్ఛ, రాజ్యాంగ హక్కుల పట్ల గౌరవం కూడా విద్యలో భాగం కావాలి. పాఠశాల స్థాయి నుంచే బాలల రక్షణ చట్టాలు, వ్యక్తిగత సమ్మతి, సామాజిక బాధ్యత, భావోద్వేగ నియంత్రణ వంటి అంశాలను బోధించాలి.
సెల్‌ఫోన్ చేతిలో ఆయుధమవుతోందా?
సాంకేతిక పరిజ్ఞానం మనిషి జీవితాన్ని సులభతరం చేయాలి. కానీ అదే సాంకేతికత విచక్షణారహిత వినియోగంతో ప్రమాదకరంగా మారకూడదు. సెల్‌ఫోన్లలో హింసను ప్రోత్సహించే దృశ్యాలు, అసభ్యకరమైన కంటెంట్, తప్పుడు సంబంధాలు, సైబర్ వేధింపులు యువతపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో పరిశీలించాలి. పిల్లల చేతుల్లో ఫోన్ పెట్టి బాధ్యతను ముగించుకున్నట్లు కాకుండా, దాని వినియోగంపై అవగాహన కల్పించాలి. డిజిటల్ పరిజ్ఞానంతోపాటు డిజిటల్ బాధ్యతను కూడా నేర్పించాలి.
బడిలోనే భద్రత లేకపోతే బాధ్యత ఎవరిది?
పాఠశాలల్లో బయటి వ్యక్తుల ప్రవేశంపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ, సందర్శకుల వివరాల నమోదు, సీసీటీవీ కెమెరాలు, అత్యవసర స్పందన వ్యవస్థ ఉండాలి. బాలికలు నిర్భయంగా ఫిర్యాదు చేయగల వాతావరణం కల్పించాలి. విద్యాశాఖ అధికారులు భద్రతా ప్రమాణాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. ఉపాధి కోసం గల్ఫ్ దేశాల్లో కష్టపడుతూ పిల్లల భవిష్యత్తు కోసం త్యాగాలు చేస్తున్న తల్లిదండ్రులకు తమ బిడ్డలు పాఠశాలలో క్షేమంగా ఉంటారనే భరోసా కల్పించడం ప్రభుత్వ కనీస బాధ్యత.
రాప్తాడు ఘటనను మరో వార్తగా చూసి మరిచిపోతే మన బాధ్యత ముగిసినట్లు కాదు. బాధిత బాలికకు మెరుగైన వైద్యం, కుటుంబానికి అండ, నిందితుడిపై చట్టప్రకారం చర్యలు, రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల భద్రతపై సమీక్ష తక్షణ అవసరం.
చివరగా మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. తరగతి గదిలోనే మృత్యువు తలుపుతడితే రేపటి తరం ఏ ధైర్యంతో బడికి వెళ్లాలి? ఒక బిడ్డకు జరిగిన నష్టాన్ని ఏ పరిహారం పూడ్చగలదు?
భవనాలు కట్టడం అభివృద్ధి కావచ్చు.. సాంకేతిక పరిజ్ఞానం సాధించడం ప్రగతి కావచ్చు. కానీ మనిషిలో మానవత్వం పెంపొందించలేకపోతే అవన్నీ నిరర్థకమే. నేరస్థుడికి చట్టమంటే భయం, బాలికకు సమాజమంటే భరోసా కలిగినప్పుడే నిజమైన నాగరికతకు అర్థం ఉంటుంది. కొవ్వొత్తులు వెలిగించి సంతాపం తెలిపే సమాజం నుంచి.. మరో బాలిక జీవితంలో చీకటి నిండకుండా కాపాడే సమాజంగా మారాల్సిన సమయం ఆసన్నమైంది.
మార్పు ఇంటి నుంచి మొదలవ్వాలి.. బడిలో బోధించాలి.. చట్టం ద్వారా అమలు కావాలి.. సమాజంలో ఆచరణలోకి రావాలి.మనిషిలో మానవత్వాన్ని నిర్మించడమే నిజమైన నాగరికత. నేరస్థుడికి చట్టమంటే భయం.. బాలికకు సమాజమంటే భరోసా కలిగినప్పుడే మన అభివృద్ధికి సార్థకత.
నరసింహారెడ్డి చందమూరి
ఫ్రీలాన్స్ జర్నలిస్టు, కదిరి.
శ్రీ సత్యసాయి జిల్లా.


















