Municipal Elections ప్రజాస్వామ్యానికి స్ఫూర్తిగా నిలిచిన శ్రీ సత్యసాయి జిల్లా!
ప్రశాంత పోలింగ్‌తో రాష్ట్రానికే ఆదర్శం.. ఈ సంస్కారం స్థానిక ఎన్నికలకే కాదు, రాజకీయ భవిష్యత్తుకూ దిశానిర్దేశం కావాలి! మున్సిపల్ ఎన్నికల్లో ఆదర్శం.. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లోనూ ఇదే సంస్కారం కొనసాగాలి!
ఎన్నికల్లో ఎవరు గెలిచారన్నది కొన్ని రోజుల వార్త మాత్రమే! కానీ ఎన్నికలు ఎలా జరిగాయన్నది ప్రజాస్వామ్య చరిత్రలో నిలిచిపోయే విషయం. గెలుపు ఒకరికి దక్కవచ్చు.. ఓటమి మరొకరిని పలకరించవచ్చు. కానీ ప్రజల ఓటు హక్కుకు గౌరవం లభించి, రాజకీయ ప్రత్యర్థులు పరస్పర సంయమనంతో వ్యవహరించి, ఎలాంటి భయాందోళనలు లేకుండా ఎన్నికల ప్రక్రియ సాగితే అంతకంటే గొప్ప విజయం మరొకటి ఉండదు. ఎన్నికల వేళ అలాంటి ప్రజాస్వామ్య స్ఫూర్తిని శ్రీ సత్యసాయి జిల్లా చాటిచెప్పింది.రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నిరసనలు, ఘర్షణలు, ఉద్రిక్తతలు చోటుచేసుకున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్న వేళ.. శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి, పుట్టపర్తి, హిందూపురం, పెనుకొండ, మడకశిర, ధర్మవరం మున్సిపాలిటీల పరిధిలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరగడం అభినందనీయం. ఇది కేవలం ఒక జిల్లా ఎన్నికల నిర్వహణలో సాధించిన విజయమే కాదు.. రాజకీయ సంస్కారానికి, ప్రజల చైతన్యానికి, ప్రజాస్వామ్య విలువల పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనం.
రాజకీయ పోరాటం ఉండాలి.. కక్షలకు తావుండకూడదు!
ఎన్నికలంటే యుద్ధాలు కాదు.. ప్రజాతీర్పునకు వేదికలు. ప్రత్యర్థులు ఉండొచ్చు.. శత్రువులు ఉండకూడదు. రాజకీయంగా పోటీ పడొచ్చు.. వ్యక్తిగత కక్షలకు దిగజారకూడదు. గెలుపు కోసం ప్రయత్నించాలి.. అందుకోసం ప్రజాస్వామ్య విలువలను బలిపెట్టకూడదు. ఈ కనీస సూత్రాలను ఆచరణలో చూపించినప్పుడే ఎన్నికలకు నిజమైన సార్థకత చేకూరుతుంది.ఈ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు, వారి ఏజెంట్లు ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములై, పరస్పర సహకారంతో పోలింగ్ నిర్వహణకు సహకరించడం సానుకూల పరిణామం. రాజకీయ భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ప్రశాంత వాతావరణాన్ని కాపాడాలన్న బాధ్యతను గుర్తించడం మంచి రాజకీయ పరిణతికి నిదర్శనం. చిన్నపాటి సంఘటనలకు కూడా ఆస్కారం లేకుండా ఎన్నికల ప్రక్రియ సాగడం వెనుక రాజకీయ సంయమనం, ప్రజల చైతన్యం, అధికారుల సమన్వయం స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అధికారంలో ఉన్నవారి బాధ్యత మరింత ఎక్కువ!
ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి, ప్రతిపక్షానికి రాజకీయంగా సమాన హక్కులున్నాయి. అయితే అధికారంలో ఉన్నవారిపై బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుంది. అధికార బలాన్ని ప్రదర్శించడం నాయకత్వం కాదు.. ప్రత్యర్థులకు కూడా స్వేచ్ఛగా ప్రచారం చేసుకునే, ఎన్నికల్లో పోటీ చేసే, పోలింగ్ ప్రక్రియలో భాగస్వాములయ్యే అవకాశం కల్పించడమే నిజమైన ప్రజాస్వామిక నాయకత్వం.ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి కూడా ప్రజల మద్దతు కోరే హక్కు కలిగిన వ్యక్తేననే స్పృహ ప్రతి నాయకుడిలో ఉండాలి. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాస్వామ్య నియమాలను గౌరవించాలి. ఈ ఎన్నికల్లో ప్రశాంత వాతావరణానికి సహకరించిన ఆరు మున్సిపాలిటీల పరిధిలోని ఎమ్మెల్యేలు, అధికార పక్ష నాయకులు, ప్రతిపక్ష నాయకులు అభినందనీయులు. రాజకీయ పోటీని వ్యక్తిగత వైరం స్థాయికి తీసుకెళ్లకుండా వ్యవహరించడం ఇతర ప్రాంతాల నాయకులకూ ఆదర్శంగా నిలవాలి.
అధికారుల నిష్పక్షపాతమే ప్రజాస్వామ్యానికి రక్షణ కవచం!
ఎన్నికల నిర్వహణలో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా ఎస్పీ, సంబంధిత ఎన్నికల సిబ్బంది, పోలీసు అధికారులు, సిబ్బంది పాత్ర అత్యంత కీలకం. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా విధులు నిర్వహించడం అభినందనీయం. ఎన్నికల సమయంలో ప్రజలకు భద్రతపై నమ్మకం కలిగించడం అధికార యంత్రాంగం నిర్వహించాల్సిన అత్యంత ముఖ్యమైన బాధ్యత. ఆ నమ్మకం నిలబడినప్పుడే ఓటరు నిర్భయంగా తన ఓటు హక్కును వినియోగించుకోగలుగుతాడు.రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఉద్రిక్తతల వార్తల మధ్య శ్రీ సత్యసాయి జిల్లా ప్రశాంత పోలింగ్ ఒక సానుకూల సందేశాన్ని అందించింది. ఘర్షణల వార్తలకే కాకుండా, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించిన మంచి ఉదాహరణలకు కూడా విస్తృత ప్రచారం లభించాలి. మంచి విషయాలను పదేపదే చెప్పడం, చూపించడం ద్వారా సమాజంలో సానుకూల మార్పుకు బాటలు వేయవచ్చు. ఈ ఆదర్శాన్ని రాష్ట్రవ్యాప్తంగా చర్చకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.
పోలింగ్ ప్రశాంతంగా జరగడం మొదటి అడుగు.. ప్రజాతీర్పును గౌరవించడం అసలైన పరీక్ష!
ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతోనే ప్రజాస్వామ్య ప్రక్రియ పూర్తయినట్లు కాదు. ఫలితాలు వెలువడిన తర్వాతే నాయకుల రాజకీయ సంస్కారం అసలైన పరీక్షకు అద్దం పడుతుంది. ప్రజాతీర్పు తమకు అనుకూలంగా వచ్చినా, ప్రతికూలంగా వచ్చినా సమానమైన హుందాతనంతో స్వీకరించే నిబ్బరం నాయకుల్లో ఉండాలి. గెలిచినవారు మరింత వినయంగా వ్యవహరించాలి. ఓడినవారు మరింత బాధ్యతతో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి.గెలిచినవారికి అహంకారం ఉండకూడదు. ఓడినవారికి నిరాశతో ప్రజలకు దూరమయ్యే పరిస్థితి రాకూడదు. ఓటమిని విశ్లేషించుకోవాలి, లోపాలను సరిదిద్దుకోవాలి, ప్రజల మధ్య మరింతగా ఉండాలి. గెలిచినవారు తమకు ఓటు వేసినవారికే కాకుండా, ఓటు వేయని వారికీ సమానంగా సేవలందించాలి. ఎందుకంటే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజాప్రతినిధి బాధ్యత పార్టీ పరిధిని దాటి యావత్ ప్రజల పట్ల విస్తరిస్తుంది.
ఫలితాలతో సంబంధం లేకుండా.. ప్రజాస్వామ్య స్ఫూర్తి కొనసాగాలి!
మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉంది
అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది
దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా
దరికి చేర్చు దారులు కూడ ఉన్నాయిగా
భారమెంతో ఉందని బాధపడకు నేస్తమా
బాధవెంట నవ్వుల పంట ఉంటుందిగా
సాగర మధనం మొదలవగానే విషమే వచ్చింది
అది దాటితేనే అమృతమనే బహుమతి ఇచ్చింది
పనితనం ఉంటే పరిస్తితే నీదే అవుతుంది
పట్టుదల ఉంటే తలరాతను మార్చేస్తుంది.
నా ఆటోగ్రాఫ్ (స్వీట్ మెమొరీస్ ) చిత్రంకోసం చంద్రబోస్ రచించిన ఈ పాట ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలి.
మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు గెలిచారు? ఎవరు ఓడిపోయారు? అన్నది పక్కనపెడితే, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవడమే శ్రీ సత్యసాయి జిల్లా సాధించిన గొప్ప విజయం. ఈ స్ఫూర్తి ఎన్నికల ఫలితాలతో ముగిసిపోకూడదు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే రాజకీయ సంయమనం, పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు కొనసాగాలి.
అధికార, ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఇదే బాధ్యతతో వ్యవహరించాలి. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా ప్రజాతీర్పును గౌరవిస్తూ, గెలిచిన వారిని అభినందిస్తూ సమస్యలపై సూటిగా ప్రశ్నిస్తూ స్నేహపూర్వక రాజకీయాలతో ప్రశాంతంగా తదుపరి ఎన్నికలకు సిద్ధపడాలి. గ్రామస్థాయిలో రాజకీయ విభేదాలు కుటుంబ సంబంధాలనూ, సామాజిక ఐక్యతనూ దెబ్బతీసే పరిస్థితులు రాకూడదు. ఎన్నికల తర్వాత కూడా ఒకే గ్రామంలో, ఒకే వీధిలో కలిసి జీవించాల్సిన సామాజిక బాధ్యతను ప్రతి ఒక్కరూ కనబరచాలి.అన్ని స్థానిక సంస్థల ఎన్నికలనూ ఇదే ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశాంతంగా నిర్వహించగలిగితే శ్రీ సత్యసాయి జిల్లాకు రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా మరింత ఖ్యాతి లభిస్తుంది. ఒక ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించడం గొప్ప విషయం.. అదే పంథాను ప్రతి ఎన్నికలో కొనసాగించడం మరింత గొప్ప విషయం!
ప్రజాస్వామ్యానికి అసలైన విజయం ప్రజల విశ్వాసం!
శ్రీ సత్యసాయి జిల్లా ప్రజలు ప్రశాంత పోలింగ్ ద్వారా రాష్ట్రానికే ఒక మంచి సందేశాన్ని అందించారు. ఈ స్ఫూర్తి ఇతర జిల్లాలకూ విస్తరించాలి. ఎన్నికల్లో గెలవడం నాయకుడి విజయం కావచ్చు. కానీ ప్రత్యర్థి హక్కులను గౌరవించడం, ప్రజల తీర్పును శిరసావహించడం, ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం కలిగించడం అంతకంటే గొప్ప విజయం.ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు వేయడం కాదు.. ఆ ఓటుకు విలువనివ్వడం. కేవలం అధికారాన్ని పొందడం కాదు.. అధికారాన్ని ప్రజల కోసం బాధ్యతగా వినియోగించడం. కేవలం ప్రత్యర్థిని ఓడించడం కాదు.. ప్రజల మనసులను గెలుచుకోవడం.
గెలుపు ఒకరికి దక్కవచ్చు.. కానీ ప్రజాస్వామ్యం అందరిదీ!
ఆ సత్యాన్ని శ్రీ సత్యసాయి జిల్లా చాటిచెప్పింది. ఈ ఎన్నికల్లో కనిపించిన రాజకీయ సంయమనం, అధికారుల నిష్పక్షపాత వైఖరి, ప్రజల చైతన్యం భవిష్యత్తు ఎన్నికలకూ మార్గదర్శకం కావాలి. ప్రశాంత ఎన్నికలు ఒకరోజు కార్యక్రమంగా మిగిలిపోకుండా, ప్రజాస్వామ్య సంస్కృతిగా మారాలి. అదే ఈ ఎన్నికల నుంచి సమాజం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం.
నరసింహారెడ్డి చందమూరి
ఫ్రీలాన్స్ జర్నలిస్టు, కదిరి.
శ్రీ సత్యసాయి జిల్లా.


















