దక్షిణాదిన వీక్ గా ఉన్నది బీజేపీ. అయితే తెలంగాణలో మెల్లగా ఎంతో కొంత చోటు సంపాదించుకుంది. ఏపీలో చూస్తే కూటమిలో భాగమై తన ఉనికిని చాటుకుంది. కేరళలో బోణీ కొట్టి ఒక ఎంపీని గెలిపించుకుంది. కర్ణాటకలో బీజేపీ ఒకసారి అధికారంలోకి వచ్చింది. ఇక 2021లో జరిగిన తమిళనాడు ఎన్నికల్లో నాలుగు ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది కానీ 2026 లో మాత్రం బీజేపీ ఏ విధంగా తన రాజకీయ విస్తరణ చేయాలి అన్న దాని మీద తీవ్రమైన కసరత్తు చేస్తోంది.
తమిళనాడులో 2021 ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలసి పోటీ చేస్తే నాలుగు సీట్లు వచ్చాయి. అయితే అప్పటికి ఇప్పటికీ అన్నా డీఎంకేలో బలం ఎంత పెరిగింది లేదా ఎంత తగ్గింది అన్నది ఒక చర్చగా ఉంది. మరో వైపు చూస్తే ఆనాడు లేని పోటీ ఇపుడు విజయ్ పార్టీ రూపంలో ఉంది. డీఎంకే విజయ్ పార్టీల మధ్యనే పోటీ అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇంకో వైపు అన్నాడీఎంకేలో వర్గ పోరు ఉంది. అంతే కాకుండా ఆ పార్టీ నుంచి బీజేపీలోకి జంపింగులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీతో పొత్తు పట్ల అన్నాడీఎంకేలో కొంత మంది అనుకూలం, మరికొంతమంది వ్యతిరేకంగా ఉన్నారని వార్తలు ఉన్నాయి. వీటి మధ్య బీజేపీ ఆశలు తమిళనాడులో ఏ మేరకు నెరవేరుతాయన్నది చర్చగా ఉంది.
ఈ నేపథ్యంలో తమిళనాడులో బీజేపీ తన పార్టీ విస్తరణకు ఒక రోడ్ మ్యాప్ ని సిద్ధం చేసుకుంటోంది. ఈ మేరకు రాష్ట్ర పార్టీ నేతలు అంతా తాజగా కుంభకోణంలో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. పార్టీని సంస్థాగతంగా ఎలా బలోపేతం చేయాలి అన్నది కూడా వారు సీరియస్ గానే మేధో మధనం చేశారు. ముందు బీజేపీని జనం ముందుకు తీసుకుని పోవాలని కమలం పువ్వు గుర్తుని మరింతగా పరిచయం చేయాలని కూడా నిర్ణయించారు.
అదే విధంగా బూత్ లెవెల్ నుంచి పార్టీని పటిష్టం చేసేలా ప్రణాళికలను సిద్ధం చేయాలని కూడా పార్టీ నేతలు తీర్మానించారు. బూత్, మండలం జిల్లా స్థాయిలో బలమైన సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడం ద్వారా రానున్న ఎన్నికలను ధీటుగా ఎదుర్కోవచ్చు అన్నది ఆలోచనగా ఉంది. అంతే కాదు క్రమశిక్షణ కలిగిన కేడర్ ని ముందు వారిని భాగం చేస్తూ పార్టీ కార్యకలాపాలు విస్తృతం చేయాలని, వాటిని నిరంతర ప్రచార కార్యక్రమాలుగా మార్చి జనంలోకి పోవాలని నిర్ణయించారు. అంతే కాకుండా పార్టీలోని వివిధ విభాగాల మధ్య న సమన్వయం అవసరాన్ని కూడా పార్టీ నేతలు గుర్తించి ఆ దిశగా అంతా కలసి పనిచేయాలని కోరారు.
రానున్న రోజులలో సోషల్ మీడియా ద్వారానే పెద్ద ఎత్తున ప్రచారానికి తెర తీయాలని కూడా నిర్ణయించారు. సోషల్ మీడియా ప్రచారంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాలు జనం వద్దకు తీసుకెళ్ళాలని తీర్మానించారు. అలాగే పార్టీ సభ్యత్వాన్ని కూడా చేపట్టాలని నిర్ణయించారు.
బీజేపీకి ఇటీవల కాలంలో ముఖ్యంగా పట్టణ కేంద్రాలు పారిశ్రామిక ప్రాంతాలలో బలం పెరిగింది అని పార్టీ నేతలు అంటున్నారు. అందువల్ల అక్కడ పార్టీ కార్యకర్తలలో ఉత్సాహం గణనీయంగా పెరిగిందని చెబుతున్నారు. రానున్న ఎన్నికల్లో ఎక్కువగా అర్బం సెక్టార్ లో ఫోకస్ పెడితే పార్టీ అనుకున్న విజయాలు సాధిస్తుందని అంటున్నారు. మొత్తానికి చూస్తే దీర్ఘకాలిక లక్ష్యాలను పెట్టుకునే బీజేపీ తమిళనాడు ఎన్నికల బరిలోకి ఈసారి దిగుతోంది అని అంటున్నారు.

















