Ajmer Jail Scandal: ఇద్దరు మహిళా ఖైదీలను అనుమతి లేకుండా బయటకు తీసుకెళ్లి ఇంటి పనులు చేయించారన్న ఆరోపణలపై మాజీ జైలర్ అరెస్ట్. జైళ్ల భద్రత, ఖైదీల హక్కులు, అధికారుల జవాబుదారీతనంపై విశ్లేషణ.
నేరం చేసినవారిని చట్టం ముందు నిలబెట్టాల్సిన అధికారి. చట్టాన్ని పక్కనపెట్టి తన వ్యక్తిగత పనుల కోసం ఖైదీలనే పనివారిగా ఉపయోగించుకుంటే? ఖైదీలు జైలు గోడలు దాటకుండా కాపలా కాయాల్సిన జైలరే ఆ గోడలు దాటించి బయటకు తీసుకెళ్తే? జైలు క్రమశిక్షణను కాపాడాల్సిన చేతులే నిబంధనలను ఉల్లంఘిస్తే? అప్పుడు తప్పు ఒక వ్యక్తిదేనా? లేక అలాంటి అక్రమాలకు ఆస్కారం కల్పిస్తున్న వ్యవస్థదా?
పూలమ్మిన చోటే కట్టెలమ్ముకోవడం అన్నది పల్లెటూళ్లలో వినిపించే సామెత. ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి అన్నది కాలగమనాన్ని గుర్తుచేసే నానుడి. కానీ నేరస్తులు చట్టానికి భయపడాల్సిన చోట, చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులే నిబంధనలను బేఖాతరు చేస్తే.. అది కాలమహిమ కాదు, వ్యవస్థలో పేరుకుపోయిన వైఫల్యానికి సంకేతం!రాజస్థాన్‌లోని అజ్మేర్ కేంద్ర కారాగారంలో వెలుగుచూసిన ఘటన ఈ ప్రశ్నలన్నింటినీ సమాజం ముందుంచుతోంది. ఇద్దరు మహిళా ఖైదీలను అనుమతి లేకుండా జైలు నుంచి బయటకు తీసుకెళ్లి, తన నివాసంలో శుభ్రపరిచే పనులు చేయించారన్న ఆరోపణలపై మాజీ జైలర్ దివ్యా చౌధరిని పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. ఆరోపణలు నిజమని విచారణలో తేలితే, అది కేవలం విధి నిర్వహణలో నిర్లక్ష్యం కాదు.. అధికారాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించుకున్న తీవ్రమైన వ్యవహారం అవుతుంది.జైలు అంటే నేరం చేసిన వ్యక్తికి శిక్ష అమలయ్యే ప్రదేశం మాత్రమే కాదు. ఖైదీల భద్రత, క్రమశిక్షణ, హక్కులు, పునరావాసం వంటి బాధ్యతలను ప్రభుత్వం నిర్వహించే సంస్థ. జైలు అధికారులకు అప్పగించిన అధికారం వ్యక్తిగత ఆస్తి కాదు. అది ప్రజల తరఫున ప్రభుత్వం అప్పగించిన బాధ్యత.
అలాంటి బాధ్యతను నిర్వర్తించాల్సిన జైలరే ఖైదీలను తన నివాసానికి తీసుకెళ్లి ఇంటి పనులు చేయించారన్న ఆరోపణ అత్యంత తీవ్రమైనది. ఒకవేళ వ్యక్తిగత అవసరాల కోసం ఖైదీల శ్రమను ఉపయోగించుకున్నట్లు రుజువైతే, అది వారి గౌరవానికి భంగం కలిగించడమే కాకుండా, అధికార దుర్వినియోగానికి కూడా నిదర్శనమవుతుంది.ఇక్కడ మరో ప్రశ్న తప్పనిసరిగా తలెత్తుతుంది. జైలు నుంచి ఖైదీలను బయటకు తీసుకెళ్లే ప్రక్రియకు సంబంధించిన నిబంధనలు ఏమిటి? ఎవరు అనుమతించాలి? రికార్డుల్లో నమోదు చేయకుండా ఖైదీలను తరలించడం ఎలా సాధ్యమైంది? భద్రతా సిబ్బంది ఏం చేశారు? పర్యవేక్షణాధికారుల బాధ్యత ఏమిటి?జైలు గేటు దాటే ప్రతి ఖైదీ కదలికకు లెక్క ఉండాల్సిన చోట, ఆ కదలికలే రికార్డుల్లో లేకపోతే.. అది ఒక్క అధికారిపై వేసి చేతులు దులుపుకునే వ్యవహారం కాదు. పర్యవేక్షణ వ్యవస్థను కూడా ప్రశ్నించాల్సిన సందర్భం!
ఒక ఘటన మరువకముందే.. మరో ఘటన!
దేశంలోని జైళ్ల నిర్వహణపై ఇప్పటికే అనేక సందర్భాల్లో ప్రశ్నలు తలెత్తాయి. నకిలీ ఉత్తర్వులు, విడుదల ప్రక్రియలో అవకతవకలు, ఖైదీలను అక్రమంగా బయటకు పంపించారన్న ఆరోపణలు, పెరోల్ నిబంధనల ఉల్లంఘన వంటి ఘటనలు జైళ్ల భద్రతపై ఆందోళనలను పెంచుతున్నాయి.అలాంటి ఘటనలపై చర్చ కొనసాగుతుండగానే, జైలు అధికారులే ఖైదీలను వ్యక్తిగత పనుల కోసం బయటకు తీసుకెళ్లారన్న ఆరోపణలు వెలుగులోకి రావడం మరింత ఆందోళనకరం.
నకిలీ ఉత్తర్వులతో ఖైదీల విడుదల వ్యవహారంలో ప్రశ్న అధికారిక పత్రాల ప్రామాణికతపై ఉంటే, అజ్మేర్ ఘటనలో ప్రశ్న జైలు అధికారుల అధికార వినియోగంపై ఉంది. రెండు సందర్భాల్లోనూ ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఒక్కటే: చట్టాన్ని అమలు చేసే వ్యవస్థలోనే నియమాలు ఉల్లంఘించబడితే, వాటిని అడ్డుకునే యంత్రాంగం ఎక్కడుంది?అయితే, వేర్వేరు ఘటనలను ఒకే నేరంగా పరిగణించడం సరికాదు. ప్రతి కేసులోని వాస్తవాలు, బాధ్యతలు, సాక్ష్యాలు వేర్వేరుగా పరిశీలించాలి. కానీ ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయా అనే అంశంపై జైళ్ల శాఖ సమగ్ర సమీక్ష నిర్వహించాల్సిన అవసరం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.దివ్యా చౌధరి తన నివాసానికి తీసుకెళ్లిన మహిళల్లో కిరణ్ అలియాస్ సేథా జీవితఖైదు అనుభవిస్తున్న ఖైదీ కాగా, సనా విచారణ ఖైదీగా ఉన్నారు.
శిక్ష అనుభవిస్తున్న ఖైదీ అయినా, విచారణ ఖైదీ అయినా వారి స్వేచ్ఛపై చట్టబద్ధమైన పరిమితులు మాత్రమే విధించవచ్చు. జైలు అధికారులు తమ ఇష్టానుసారం వారిని వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకునే అధికారం కలిగి ఉండరు.విచారణ ఖైదీ విషయంలో నేరం నిరూపితం కానంతవరకు ఆమెను దోషిగా పరిగణించలేం. జీవితఖైదు అనుభవిస్తున్న వ్యక్తికీ చట్టం కల్పించిన హక్కులు ఉంటాయి. శిక్ష అనుభవిస్తున్నారనే కారణంతో ఖైదీల గౌరవాన్ని, ప్రాథమిక హక్కులను విస్మరించడానికి ఎవరికీ అధికారం లేదు.ఖైదీ స్వేచ్ఛను చట్టం పరిమితం చేయవచ్చు. కానీ ఆ పరిమితిని అధికారి వ్యక్తిగత ప్రయోజనంగా మార్చుకోవచ్చా? ఇదే ఈ ఘటన లేవనెత్తుతున్న అసలు ప్రశ్న.
దివ్యా చౌధరిని పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచిన అనంతరం న్యాయ నిర్బంధానికి పంపినట్లు ఆమెతోపాటు మరో మహిళా జైలు సిబ్బందిపైనా చర్యలు తీసుకున్నట్లు సమాచారం.అరెస్టు అనేది దర్యాప్తులో ఒక దశ మాత్రమే. నేరం రుజువైనట్లు కాదు. న్యాయస్థానంలో సాక్ష్యాధారాల ఆధారంగా నేర బాధ్యత నిర్ణయించాల్సి ఉంటుంది. అదే సమయంలో, ఈ ఘటనలో ఎవరు ఏ పాత్ర పోషించారు? ఖైదీలను బయటకు తీసుకెళ్లాలన్న నిర్ణయం ఎవరిది? వాహనాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? జైలు రికార్డుల్లో వివరాలు ఎందుకు లేవు? ఇతర సిబ్బందికి విషయం తెలుసా? ఉన్నతాధికారులకు సమాచారం అందిందా? అనే అంశాలపై నిష్పాక్షిక దర్యాప్తు జరగాలి.ఒక ఉద్యోగిని అరెస్టు చేశామని చెప్పి వ్యవస్థలోని లోపాలను మరుగునపరచకూడదు. తప్పు వ్యక్తి స్థాయిలో జరిగిందా? పర్యవేక్షణలో వైఫల్యమా? లేక విధానపరమైన లోపాలున్నాయా? అన్నది తేల్చాలి. వ్యక్తిపై చర్యలు తీసుకోవడం అవసరం.. వ్యవస్థను సరిదిద్దడం అంతకంటే అవసరం!
ప్రజాధనంతో నడిచే సంస్థలపై ప్రజలకు ప్రశ్నించే హక్కు ఉంది. పారదర్శకత కోరడం వ్యవస్థను కించపరచడం కాదు. వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని కాపాడే చర్య.
జైళ్ల శాఖలో ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటే కొన్ని చర్యలు తక్షణమే చేపట్టాలి. ఖైదీల కదలికలపై కఠినమైన నమోదు ఉండాలి. జైలు నుంచి బయటకు తీసుకెళ్లే ప్రతి ఖైదీకి సంబంధించిన అనుమతి, కారణం, సమయం, తీసుకెళ్లిన సిబ్బంది వివరాలు తప్పనిసరిగా నమోదు కావాలి. ఖైదీలను తరలించే నిర్ణయాన్ని ఒక్క అధికారి చేతుల్లోనే వదిలేయకుండా, నిబంధనలకు అనుగుణంగా సంబంధిత ఉన్నతాధికారుల అనుమతి, ధ్రువీకరణ ఉండాలి. ఆకస్మికంగా తనిఖీ చేసే వ్యవస్థను బలోపేతం చేయాలి.ఖైదీలు, వారి కుటుంబ సభ్యులు, జైలు సిబ్బంది అక్రమాలపై భయం లేకుండా ఫిర్యాదు చేసే మార్గాలను కల్పించాలి. ఫిర్యాదు చేసినందుకు ప్రతీకార చర్యలకు పాల్పడకుండా రక్షణ ఉండాలి. తప్పు చేసిన వ్యక్తిపైనే కాకుండా, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినట్లు రుజువైన పర్యవేక్షణాధికారుల బాధ్యతనూ నిబంధనల ప్రకారం నిర్ణయించాలి.జైళ్లలో ఖైదీల అనధికారిక తరలింపులు, నకిలీ ఉత్తర్వులు, అక్రమ విడుదలలపై నమోదైన కేసులను పరిశీలించి, వాటి వెనుక ఉన్న సాధారణ లోపాలను గుర్తించాలి. ఇవి కేవలం ఆదేశాలుగా మిగిలిపోకూడదు. అమలు, తనిఖీ, బాధ్యత నిర్ధారణతో కూడిన చర్యలుగా మారాలి.జైలు గోడలు ఎత్తుగా ఉంటే సరిపోదు. బాధ్యతా గోడలు బలంగా ఉండాలి!జైలు గోడలు నేరస్తులు బయటకు వెళ్లకుండా అడ్డుకోవడానికి నిర్మిస్తారు. కానీ ఆ గోడల మధ్య ఉన్న అధికార దుర్వినియోగాన్ని అడ్డుకునే నియమాలు, పర్యవేక్షణ, జవాబుదారీతనం మరింత పటిష్ఠంగా ఉండాలి.
ఖైదీలను కాపాడాల్సిన అధికారులే నిబంధనలను ఉల్లంఘిస్తున్నారన్న ఆరోపణలు వచ్చినప్పుడు, ప్రజల విశ్వాసానికి గండిపడుతుంది. ఒక అధికారి తప్పు చేస్తే చర్యలు తీసుకోవాలి. అలాంటి తప్పు ఎలా జరిగింది, మరెవరైనా సహకరించారా, మళ్లీ జరగకుండా ఏం చేయాలి అన్న ప్రశ్నలకు కూడా సమాధానాలు వెతకాలి.వ్యక్తిగత తప్పిదాలను వ్యవస్థాగత లోపాల నుంచి వేరు చేసి చూడాలి. నేరం రుజువుకాకముందే ఎవరినీ దోషిగా ముద్ర వేయకూడదు. అదే సమయంలో, అధికార దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలను తేలికగా తీసుకోకూడదు. చివరగా ఒక్కటే ప్రశ్న. చట్టాన్ని ఉల్లంఘించిన ఖైదీకి శిక్ష విధించే వ్యవస్థ. చట్టాన్ని ఉల్లంఘించిన అధికారి విషయంలోనూ అదే నిబద్ధతను చూపిస్తుందా?
జైలు గోడల మధ్య జరిగే ప్రతి వ్యవహారానికి లెక్క ఉండాలి. అధికారానికి హద్దులు ఉండాలి. తప్పు చేసినవారికి బాధ్యత ఉండాలి. ఎందుకంటే న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకం నిలవాలంటే, న్యాయాన్ని అమలు చేసే వ్యవస్థ కూడా జవాబుదారీగా ఉండాలి!
నరసింహారెడ్డి చందమూరి.
ఫ్రీలాన్స్ జర్నలిస్టు.
కదిరి.


















