శ్రీ సత్యసాయి జిల్లా మొదటి జడ్పీ చైర్మన్ గా పరిటాల శ్రీరామ్.
Paritala Sriram First ZP Chairman: శ్రీ సత్యసాయి జిల్లా తొలి జడ్పీ చైర్మన్‌గా పరిటాల శ్రీరామ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజకీయ నేపథ్యం, టీడీపీ బలం, కదిరి అభివృద్ధిపై అంచనాలు, ఆయన ముందున్న సవాళ్లు తెలుసుకోండి.
శ్రీ సత్యసాయి జిల్లా ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి జిల్లా పరిషత్ ఎన్నికల్లో నల్లచెరువు మండలం నుంచి జడ్పీటీసీగా విజయం సాధించిన పరిటాల శ్రీరామ్.. అదే జిల్లా తొలి జడ్పీ చైర్మన్‌గా చరిత్రలో తన పేరును లిఖించుకున్నారు. శుక్రవారం 20-11-2026న ఆయన ప్రమాణ స్వీకారం చేయడం కొత్త అధ్యాయానికి నాంది పలికింది. త్వరలో మంచి ముహూర్తం చూసుకుని అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
32 మండలాలతో ఏర్పడిన శ్రీ సత్యసాయి జిల్లా పరిషత్‌లో రాజకీయ సమీకరణాలు కూడా ఈ పదవికి ప్రత్యేక ప్రాధాన్యతను తెచ్చాయి. 9 మండలాల్లో వైసీపీ, 2 మండలాల్లో జనసేన, మిగిలిన 21 మండలాల్లో తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ స్థానాలను గెలుచుకుంది. కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా జిల్లా పరిషత్ చైర్మన్ పదవి తెలుగుదేశం పార్టీకి దక్కింది. ఆ బాధ్యతకు పార్టీ అధిష్టానం పరిటాల శ్రీరామ్‌ను ఎంపిక చేయడం వెనుక రాజకీయ సమీకరణాలతో పాటు ఆయన కుటుంబానికి ఉన్న పార్టీ అనుబంధం, విశ్వసనీయత కూడా కీలకంగా మారాయి.
ఇది కేవలం ఒక పదవి దక్కిన కథ కాదు. 2024 ఎన్నికల్లో ధర్మవరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలన్న ఆశను చివరి నిమిషం వరకు కొనసాగించిన వ్యక్తి.. పొత్తులో ఆ స్థానం బీజేపీకి కేటాయించడంతో తన రాజకీయ ఆకాంక్షను పక్కన పెట్టాల్సి వచ్చింది. సీటు దక్కకపోయినా కూటమి అభ్యర్థి విజయానికి పనిచేశారు. అప్పట్లో పార్టీ పెద్దలు ఇచ్చిన హామీ సమయం వచ్చినప్పుడు న్యాయం చేస్తాం అన్న భరోసాయే నేడు ఆ త్యాగానికి దక్కిన రాజకీయ గౌరవంగా జడ్పీ చైర్మన్ పదవిని చూడవచ్చు.
యువతకు రాజకీయాల్లో ప్రాధాన్యత ఇవ్వాలన్న దిశలో నారా లోకేష్ రూపొందిస్తున్న కొత్త రాజకీయ నాయకత్వ బృందంలో పరిటాల శ్రీరామ్ పేరు మొదటి నుంచీ వినిపించడం కూడా ఆయనకు లభించిన ఈ అవకాశానికి మరో కోణం. పదవులు వారసత్వంగా రావచ్చు.. కానీ రాజకీయ భవిష్యత్తు మాత్రం పనితీరుతోనే నిర్మించుకోవాలి.
ఇక్కడి నుంచే అసలైన ప్రయాణం మొదలవుతుంది.
జడ్పీ చైర్మన్ కుర్చీ దక్కడం విజయం కాదు.. ఆ కుర్చీలో కూర్చొని ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే అసలైన విజయం! పదవి వచ్చిన వెంటనే చుట్టూ చేరే భజనపరుల హడావుడికి మురిసిపోయి, అధికారపు నీడలో ప్రజల సమస్యలను మరిచిపోతే చరిత్ర క్షమించదు. కానీ పదవిని అవకాశంగా మార్చుకుని, తనను నమ్మిన పార్టీకి, తన కోసం పనిచేసిన కార్యకర్తలకు, తనను గెలిపించిన ప్రజలకు న్యాయం చేయగలిగితే మాత్రం ఆ పదవికే విలువ వస్తుంది. శ్రీ సత్యసాయి జిల్లా తొలి జడ్పీ చైర్మన్‌గా పరిటాల శ్రీరామ్ ముందున్న అసలైన పరీక్ష ఇదే!
పదవి వచ్చిన వెంటనే వందిమాగధులు చుట్టూ చేరడం రాజకీయాల్లో కొత్త విషయం కాదు. నిన్నటి వరకు కనిపించని ముఖాలు రేపటి నుంచి అన్నా అంటూ చుట్టూ చేరుతారు. ప్రజల కష్టాల కంటే నాయకుడి చుట్టూ తిరిగే వారి మాటలే వినిపించడం మొదలైతే పదవి ప్రజలకు దూరమవుతుంది. అందుకే పరిటాల శ్రీరామ్‌కు తొలి సవాలు ప్రత్యర్థి పార్టీలు కాదు.. తన చుట్టూ ఏర్పడే కోటరీనే!
కోటరీని అదుపులో పెట్టుకుని, అధికారాన్ని ప్రజా ప్రయోజనానికి వినియోగించి, కార్యకర్తలకు అందుబాటులో ఉండి, అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ జిల్లా అభివృద్ధికి దిశానిర్దేశం చేయగలిగితేనే ఆయన నాయకత్వానికి నిజమైన గుర్తింపు వస్తుంది. భజన వినడం సులువు.. విమర్శ వినడం కష్టం. కానీ విమర్శను తట్టుకుని తప్పును సరిదిద్దుకునే నాయకుడే ప్రజల మనసుల్లో నిలుస్తాడు.విజయాలకు పొంగిపోకూడదు. అపజయాలకు భయపడకూడదు. పొగడ్తలకు ఉప్పొంగకూడదు. విమర్శలకు కుంగిపోకూడదు. రాజకీయాల్లో ఆటుపోట్లు సహజం. కుర్చీ శాశ్వతం కాదు.. కానీ ఆ కుర్చీలో చేసిన మంచి పని మాత్రం చరిత్రలో నిలిచిపోతుంది.ఇక్కడ కదిరి ప్రాంతానికి కూడా ఒక అరుదైన అవకాశం కనిపిస్తోంది.
రామగిరి ప్రాంతం నుంచి కదిరి నియోజకవర్గానికి తీసుకొచ్చి, నల్లచెరువు మండలం నుంచి జడ్పీటీసీగా పోటీ చేయించి గెలిపించడంలో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పాత్ర ఉంది. రాజకీయ ఆటుపోట్లను తట్టుకుని సుదీర్ఘకాలం కొనసాగుతున్న నాయకుడిగా కందికుంటకు ఉన్న అనుభవం.. ఇప్పుడు పరిటాల శ్రీరామ్‌కు మార్గదర్శకంగా నిలవాలి.ఒక నాయకుడిని గెలిపించడం రాజకీయ విజయం కావచ్చు. కానీ ఆ నాయకుడి చేత ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయించడం అసలైన రాజకీయ విజయం.కదిరి ప్రాంతం ఇప్పటికే ఎన్నో రాజకీయ అవకాశాలను చూసింది. కొందరు నాయకులు వెలుగులోకి వచ్చారు.. కొంతకాలానికే కనుమరుగయ్యారు. మరికొందరు పదవులు అనుభవించారు.. కానీ తమ ప్రాంతానికి శాశ్వతమైన గుర్తింపు తీసుకురాలేకపోయారు. ఇప్పుడు ఆ చరిత్రను మార్చే అవకాశం పరిటాల శ్రీరామ్ ముందుంది.
కదిరి ప్రాంత అభివృద్ధి కోసం ఈ పదవిని ఉపయోగించగలిగితే అది పరిటాల శ్రీరామ్ వ్యక్తిగత విజయమే కాదు.. కదిరి రాజకీయ చరిత్రకు కొత్త అధ్యాయంనల్లచెరువు నుంచి వచ్చిన జడ్పీటీసీ.. శ్రీ సత్యసాయి జిల్లా తొలి జడ్పీ చైర్మన్‌గా ప్రమాణం చేశారు. ఇక ఆయన ముందు ఉన్న లక్ష్యం కేవలం జిల్లాపరిషత్ సమావేశాలు నిర్వహించడం కాదు. ప్రతి మండలానికి సమాన ప్రాధాన్యత, గ్రామీణ రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీరు, ఉపాధి, మౌలిక వసతులు వంటి సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో తీసుకుని ముందుకు సాగాలి.
పార్టీ ఇచ్చిన పదవికి ప్రతిఫలం పార్టీకి మాత్రమే కాదు.. ప్రజలకు కూడా అందాలి.
పరిటాల శ్రీరామ్ తనకు వచ్చిన ఈ అవకాశాన్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటారో కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం—పదవి వచ్చింది కాబట్టి నాయకుడు కాలేరు; పదవిని ప్రజల కోసం ఉపయోగించినప్పుడే ప్రజల నాయకుడవుతారు.శ్రీ సత్యసాయి జిల్లా తొలి జడ్పీ చైర్మన్‌గా పరిటాల శ్రీరామ్ పేరు చరిత్రలో ఇప్పటికే నమోదైంది. ఇప్పుడు ఆ పేరుకు ఎదురుగా “అభివృద్ధికి చిరునామాగా నిలిచిన నాయకుడు” అనే మరో వాక్యం రాయించుకోవాల్సిన బాధ్యత ఆయనదే.
కుర్చీని కాపాడుకోవడం నాయకత్వం కాదు.. ప్రజల నమ్మకాన్ని కాపాడుకోవడమే నిజమైన నాయకత్వం.
నరసింహారెడ్డి చందమూరి.
ఫ్రీలాన్స్ జర్నలిస్టు, కదిరి.
శ్రీ సత్యసాయి జిల్లా.


















