ఒక్క ఓటు.. ఓటమిని గెలుపుగా మార్చగలదు!
పంచాయతీ ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా చిన్నది కాదు. ఒక్క ఓటు.. ఓటమిని గెలుపుగా మార్చగలదు. ఒక్క ఓటు.. గెలుపు అనుకున్న అభ్యర్థిని ఓటమి అంచులకు నెట్టగలదు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. అందుకే శ్రీ సత్యసాయి జిల్లాలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల కంటే ఓటరే అసలైన నిర్ణేతగా మారబోతున్నాడు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అసలు పోటీ పార్టీ గుర్తుల మధ్య కాదు.. గ్రామ సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తుల మధ్య జరగాలి. కానీ రాజకీయ పార్టీల జోక్యం పెరిగితే పంచాయతీ ల లక్ష్యం నెరవేరదు. సర్పంచ్ పార్టీ రహితంగా అన్ని పార్టీల ప్రతినిధులను కలసి గ్రామాభివృద్ధికి కృషి చేయాలి.
శ్రీ సత్యసాయి జిల్లాలోని 32 మండలాల్లో 467 గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానాలు, 4,912 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 11,35,917 మంది ఓటర్లు తమ తీర్పు ఇవ్వనున్నారు. ఇందులో 5,66,785 మంది పురుషులు, 5,69,103 మంది మహిళలు, 29 మంది ఇతరులు ఉన్నారు.
467 సర్పంచ్ స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు జరుగుతాయి. తొలి విడతలో 114, రెండో విడతలో 169, మూడో విడతలో 184 స్థానాలు ఉన్నాయి. జనరల్ 111, జనరల్ మహిళలు 129, బీసీ జనరల్ 65, బీసీ మహిళలు 60, ఎస్సీ జనరల్ 42, ఎస్సీ మహిళలు 29, ఎస్టీ జనరల్ 22, ఎస్టీ మహిళలు 9 స్థానాలు కేటాయించారు. మొత్తంగా అన్‌రిజర్వుడ్ స్థానాలు 240 (51.4%), బీసీ స్థానాలు 125 (26.8%), ఎస్సీ స్థానాలు 71 (15.2%), ఎస్టీ స్థానాలు 31 (6.6%) ఉన్నాయి. మహిళలకు మొత్తం 227 స్థానాలు (48.6%) కేటాయించారు.
తొలి విడతలో నవంబర్ 26న 114 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి. బత్తలపల్లి 13, చెన్నేకొత్తపల్లి 15, ధర్మవరం 20, కనగానపల్లి 18, ముదిగుబ్బ 25, రామగిరి 9, తాడిమర్రి 14 పంచాయతీలు ఉన్నాయి.
రెండో విడతలో నవంబర్ 29న 169 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి. గాండ్లపెంట 14, కదిరి 14, నల్లచెరువు 13, నంబులపూలకుంట 14, తలుపుల 17, తనకల్లు 17, అమడగూరు 10, బుక్కపట్నం 13, కొత్తచెరువు 15, నల్లమాడ 14, ఓడిచెరువు 14, పుట్టపర్తి 14 పంచాయతీలు ఉన్నాయి.
మూడో విడతలో డిసెంబర్ 2న 184 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అగళి 13, అమరాపురం 11, చిలమత్తూరు 12, గోరంట్ల 20, గుడిబండ 16, హిందూపురం 14, లేపాక్షి 12, మడకశిర 16, పరిగి 14, పెనుకొండ 11, రొద్దం 19, రొళ్ల 10, సోమందేపల్లి 16 పంచాయతీలు ఉన్నాయి.
పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉండవు. అయినా రాజకీయ పార్టీలు తమ మద్దతు అభ్యర్థులను నిలబెట్టడం, తమ రాజకీయ బలాన్ని ప్రదర్శించేందుకు గ్రామస్థాయి ఎన్నికలను ఉపయోగించుకోవడం కొత్త విషయం కాదు. పార్టీలు తమకు అనుకూలమైన వ్యక్తులను ప్రోత్సహించడాన్ని పూర్తిగా ఆపలేకపోయినా, పంచాయతీని పార్టీ రాజకీయాల మరో యూనిట్‌గా మార్చే స్థాయికి జోక్యం పెరగకూడదు.
ఎందుకంటే గ్రామానికి కావాల్సింది పార్టీ కార్యాలయం కాదు.. మంచి తాగునీరు, రహదారి, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, డ్రైనేజీ, పాఠశాల, ప్రజలకు అందుబాటులో ఉండే పాలన. సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి ఐదేళ్లపాటు గ్రామ ప్రజలందరికీ ప్రతినిధి. ఆయనకు ఓటు వేసినవారికే కాదు.. ఓటు వేయని వారికీ కూడా బాధ్యత వహించాల్సిందే.
ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికలు మరో గుణపాఠాన్ని ఇచ్చాయి. ధర్మవరం మండలం రేగాటిపల్లిలో జనసేన అభ్యర్థి రమణమ్మ 2 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఓడిచెరువు మండలం మిట్టపల్లిలో టీడీపీకి చెందిన రోహిణి, పుట్టపర్తి మండలం చెర్లోపల్లిలో టీడీపీకి చెందిన సాయమ్మ 3 ఓట్ల తేడాతో గెలిచారు. గుడిబండ మండలం దేవరహట్టిలో టీడీపీకి చెందిన నజ్మా 4 ఓట్లతో, గాండ్లపెంట మండలం సోమయాజులపల్లిలో టీడీపీకి చెందిన కంఠమ్మ 6 ఓట్లతో విజయం సాధించారు. సి.కె.పల్లి మండలం మేడాపురం-2లో టీడీపీకి చెందిన నరసింహమూర్తి, హిందూపురం మండలం తుముకుంటలో వైసీపీకి చెందిన ముబారక్, ఓడిచెరువు మండలం సున్నంపల్లిలో వైసీపీకి చెందిన దొడ్డెమ్మ 10 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
ఈ ఫలితాలు చెప్పేది ఒక్కటే—ఓటర్ల సంఖ్య ఎంత తక్కువగా ఉంటే, ఒక్కో ఓటు అంత విలువైనది. కొన్ని వార్డుల్లో 200 ఓట్లలోపే ఉండటంతో అభ్యర్థులు ప్రతి ఓటరును అత్యంత జాగ్రత్తగా సమీకరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వలస ఓటర్లు, వివాహం తర్వాత ఇతర ప్రాంతాలకు వెళ్లిన ఓటర్లను గుర్తించి పోలింగ్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
జిల్లాలో తక్కువ వార్డులు ఉన్న పంచాయతీ గాండ్లపెంట మండలం తుమ్మలబైలు. ఇందులో 6 వార్డులు ఉన్నాయి. అత్యధికంగా గోరంట్ల పంచాయతీలో 20 వార్డులు ఉన్నాయి. ముదిగుబ్బలో అత్యధికంగా 25 పంచాయతీలు ఉండగా, రామగిరిలో అత్యల్పంగా 9 పంచాయతీలు ఉన్నాయి.
మూడు విడతల్లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. అనంతరం ఓట్ల లెక్కింపు చేపడతారు.
ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు తమ బలాన్ని కొలవడం కంటే.. గ్రామాలు తమ భవిష్యత్తును ఎన్నుకోవడం ముఖ్యం. పార్టీ జెండాలు గ్రామ సరిహద్దుల్లోనే ఆగిపోవాలి. గ్రామంలోకి వెళ్లాల్సింది అభివృద్ధి అజెండా. అభ్యర్థి వెనుక ఎవరు ఉన్నారన్నది కాదు.. గెలిచిన తర్వాత ఆయన ఎవరి కోసం నిలబడతారన్నదే అసలు ప్రశ్న.
గ్రామాన్ని గెలవడం అంటే ఓట్లను గెలవడం కాదు.. ప్రజల నమ్మకాన్ని గెలవడం. గ్రామాన్ని పార్టీ కార్యాలయంగా మార్చడం కాదు.. ప్రజల సమస్యలకు పరిష్కార కేంద్రంగా మార్చడం. పంచాయతీ సర్పంచ్ ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేయగలిగిన శక్తి ఉన్నవాడు కావాలి. స్థానిక ప్రజాప్రతినిధుల వద్దకు పార్టీ రహిత సర్పంచ్ గా వెళ్లి గ్రామ అభివృద్ది కి కృషి చేయాలి. ఈ పంచాయతీ ఎన్నికలు ఆ దిశగా సాగుతాయా? లేక మరోసారి రాజకీయ ఆధిపత్యానికి వేదికగా మారతాయా? తీర్పు చెప్పేది చివరికి గ్రామ ఓటరే. PanchayatElections2026
నరసింహారెడ్డి చందమూరి.
ఫ్రీలాన్స్ జర్నలిస్టు.కదిరి.
శ్రీ సత్యసాయి జిల్లా.


















