ఎంపీటీసీలు గెలిచినా.. ఎంపీపీ పీఠం దక్కని చోద్యం!
పులివెందుల రిజర్వేషన్లలో ఈసీ లెక్క తప్పిందా? 19న ఎన్నికకు ముందే చిక్కుముడి విప్పాలి!
ఎన్నికల నిర్వహణలో నిబంధనలు రూపొందించేది ఎన్నికల సంఘమే. కానీ ఆ నిబంధనల అమలులో పరస్పర వైరుధ్యాలు తలెత్తితే బాధ్యత ఎవరిది? పులివెందుల మండలంలో ఎంపీపీ పదవిని ఎస్టీలకు రిజర్వ్ చేసి, ఐదు ఎంపీటీసీ స్థానాల్లో ఒక్కదానిని కూడా ఎస్టీలకు కేటాయించకపోవడం ఇప్పుడు ఎన్నికల సంఘం పనితీరుపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ఎన్నికల ముందే గుర్తించాల్సిన ఈ అసంగతత ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక వెలుగులోకి రావడం అధికారుల ముందుకు కొత్త సమస్యను తెచ్చింది.
పులివెందుల మండలంలో మొత్తం ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటిలో రెండు జనరల్ మహిళలకు, ఒకటి జనరల్‌కు, ఒకటి ఎస్సీకి, మరొకటి బీసీకి కేటాయించారు. మండల పరిషత్ అధ్యక్ష పదవిని మాత్రం ఎస్టీలకు రిజర్వ్ చేశారు. దీంతో ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే.. ఎస్టీకి రిజర్వ్ చేసిన ఎంపీపీ పదవిని భర్తీ చేయడానికి అవసరమైన అర్హత కలిగిన సభ్యుడు ఎన్నికై ఉన్నారా?
ఇక్కడ ఒక విషయాన్ని విస్మరించకూడదు. జనరల్ ఎంపీటీసీ స్థానం అన్ని సామాజిక వర్గాల వారికి అందుబాటులో ఉంటుంది. ఎస్టీ అభ్యర్థి కూడా జనరల్ స్థానంలో పోటీ చేసి గెలవవచ్చు. కాబట్టి ఎస్టీకి ప్రత్యేకంగా ఎంపీటీసీ స్థానం రిజర్వ్ చేయలేదనే కారణంతోనే ఎస్టీ సభ్యుడు లేడని నిర్ధారించలేం. ఎన్నికైన ఐదుగురు సభ్యుల సామాజిక వర్గాలను పరిశీలించిన తర్వాతే అసలు పరిస్థితి స్పష్టమవుతుంది.
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం, 1994లోని సెక్షన్ 153 ప్రకారం ఎంపీపీని ఎన్నికైన ఎంపీటీసీ సభ్యుల నుంచే ఎన్నుకోవాలి. బయట వ్యక్తిని తీసుకొచ్చి అధ్యక్షుడిగా నియమించే అవకాశం లేదు. ఒకవేళ ఎన్నికైన సభ్యుల్లో ఎస్టీ ప్రాతినిధ్యం లేకపోతే 2006 రిజర్వేషన్ నిబంధనల్లోని రూల్ 15(2) ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది కీలకంగా మారుతుంది. ఆ నిబంధనలోని సర్దుబాటు విధానం పులివెందుల పరిస్థితికి ఎలా వర్తిస్తుందో అధికారులు స్పష్టం చేయాలి.
మరోవైపు నవంబర్ 19న ఎంపీపీ, ఉపాధ్యక్షుల పరోక్ష ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. సమయం దగ్గరపడుతున్నా పులివెందుల రిజర్వేషన్ అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. రిజర్వేషన్‌ను యథాతథంగా కొనసాగించాలా? నిబంధనల ప్రకారం కేటగిరీని మార్చాలా? ఇప్పటికే పూర్తయిన ఎంపీటీసీ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఈ ప్రశ్నలకు ఎన్నికల సంఘం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
రిజర్వేషన్లు అనేవి రాజకీయ సౌలభ్యం కోసం రూపొందించే గణాంకాలు కావు. అవి సామాజిక న్యాయానికి, రాజ్యాంగబద్ధమైన ప్రాతినిధ్యానికి పునాదులు. ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లు, ఎంపీపీ పదవి రిజర్వేషన్ మధ్య సమన్వయం లేకపోతే ప్రజాస్వామ్య ప్రక్రియే ప్రశ్నార్థకమవుతుంది.
ఎన్నికల ముందు చేయాల్సిన పరిశీలనను ఎన్నికల తర్వాత చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది అధికారుల నిర్లక్ష్యమా? రిజర్వేషన్ రూపకల్పనలో లోపమా? లేక నిబంధనల అమలులో తలెత్తిన సాంకేతిక సమస్యా? సమగ్ర పరిశీలనతో వాస్తవాలను వెల్లడించాలి.
ఎన్నికలు నిర్వహించడం మాత్రమే ఎన్నికల సంఘం బాధ్యత కాదు. అవి చట్టబద్ధంగా, ఎలాంటి సందేహాలకు తావులేకుండా పూర్తయ్యేలా చూడటం కూడా అంతే ముఖ్యం. పులివెందులలో రాజకీయ బలాబలాలు తేలాయి. ఇప్పుడు ఎన్నికల సంఘం చట్టబద్ధతను నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది! MPTCElections
నరసింహారెడ్డి చందమూరి.
ఫ్రీలాన్స్ జర్నలిస్టు. కదిరి.
శ్రీ సత్యసాయి జిల్లా.


















