పుట్టపర్తిలో ఓటర్ల తీర్పు అధికార పార్టీ కి హెచ్చరిక జారీ చేశారా?
మూడు మండలాల్లో వైసీపీ పట్టు.. మూడు చోట్ల కూటమి ఆధిపత్యం
కార్యకర్తల కృషిని విస్మరిస్తే అధికారం కూడా అచిరకాలమే
పుట్టపర్తి నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను కేవలం గెలుపోటముల పట్టికగా చూడటం రాజకీయంగా పొరపాటే. ఈ తీర్పు ఏ ఒక్క పార్టీకి సంపూర్ణ విజయాన్ని ఇవ్వలేదు. అదే సమయంలో అధికార కూటమికి మాత్రం ఒక ముఖ్యమైన రాజకీయ సందేశాన్ని అందించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించిన కూటమి.. రెండున్నరేళ్ల పాలన అనంతరం మూడు మండలాల్లో జడ్పీటీసీ స్థానాలను కోల్పోయింది. రెండు మండలాల్లో ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నా, మిగిలిన చోట్ల పోరు గట్టిగానే సాగింది. ఇది అధికార పక్షానికి పరాజయ తీర్పు. ఆత్మపరిశీలనకు మాత్రం తప్పనిసరిగా వచ్చిన తీర్పు.
64 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ 34, వైసీపీ 29, జనసేన ఒక స్థానం గెలుచుకున్నాయి. ఓట్ల విషయానికి వస్తే కూటమికి 67,459 (53.6%), వైసీపీకి 65,688 (48.9%) ఓట్లు వచ్చాయి. కూటమి ఆధిక్యం 1,771 ఓట్లు. అయితే ఎంపీపీ పదవుల సమీకరణం మరో చిత్రాన్ని చూపించింది. మూడు మండలాల్లో వైసీపీకి, రెండు మండలాల్లో టీడీపీకి ఎంపీపీని ఎన్నుకునే స్థాయిలో మెజారిటీ ఉండగా, ఒక మండలంలో ఇరుపక్షాలు సమానంగా నిలిచాయి.
జడ్పీటీసీల విషయానికి వస్తే పరిస్థితి మరింత ఆసక్తికరం. ఆరు స్థానాల్లో వైసీపీ మూడు, టీడీపీ రెండు, జనసేన ఒకటి గెలుచుకున్నాయి. ఓట్లలో కూటమికి 67,441 (50.2%), వైసీపీకి 65,945 (49.1%) వచ్చాయి. కూటమి ఆధిక్యం 1,496 ఓట్లు మాత్రమే. సీట్ల గణితం ఒకవైపు, ఓట్ల తీర్పు మరోవైపు ఉండటం ఈ ఎన్నికల అసలు రాజకీయ సందేశం.
మండలాల తీర్పు చెప్పిన పాఠం
అమడగూరు మండలం టిడిపి కంచుకోట గా నిలుపుకుంది. యంపిటిసిలలో టిడిపికి 8783 ఓట్లు లభించాయి. అంటే 52.4%, వైసీపీ కి 7801 ఓట్లు లభించాయి. 46.5 %. తొమ్మిది సీట్లకు గాను వైసీపీ 1 టిడిపి 8 కైవశం చేసుకొంది. మండలం మొత్తం టిడిపి 982 ఓట్ల (5.9%)మెజారిటీ లభించింది .
జడ్పీటిసి టిడిపి అభ్యర్థికి 8862 ఓట్లు (53.1%) లభించాయి. వైసీపీ కి 7809 ఓట్లు (46.8%) లభించాయి. టిడిపి కి 1053 ఓట్ల (6.3%)ఆధిక్యం.
ఓడి చెరువు లో టిడిపి కూటమి వైసీపీ నువ్వానేనా అన్నరీతిలో పోటీ పడ్డాయి. 14 యంపిటిసీ స్థానాలుండగా సమానంగా గెలుచుకొన్నాయి. మండలం మొత్తం కలిపితే వైసీపీ 85 ఓట్ల స్వల్ప ఆధిక్యం లభించింది. యంపిటిసీ కూటమికి 13843ఓట్లు 48.9% వైసీపీ కి 13928 ఓట్లు 49.2 %. వైసీపీ 83 ఓట్లు 0.3% ఆధిక్యత సాధించింది.
జడ్పీటిసి ఎన్నికలో టిడిపి కి14042 ఓట్లు 49.5% ఓట్ షేర్ వైసీపీ కి 14021ఓట్లు 49.5 % ఓట్ షేర్ దక్కింది. టిడిపి జడ్పీటీసీ అభ్యర్థి కేవలం 21 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఓడి చెరువు మండలం లో నోటాకు 157 ఓట్లు , కాంగ్రెస్ పార్టీకి 167 ఓట్లు పోలైయ్యాయి. 594 ఓట్లు చెల్లని ఓట్లు . ఇవి ఫలితం పై పెద్ద ప్రభావం చూపించాయి. కాంగ్రెస్ ఓట్లు గెలుపును ప్రభావితం చేసింది.
పుట్టపర్తి మండలం టిడిపి కి 9 వైసీపీకి 1 యంపిటిసీ సీట్లు లభించాయి. , ఓట్లు సీట్లు టిడిపి కి ఆధిక్యత . వైసీపీ కి 7683 ఓట్లతో 43.5%, ఓట్ షేర్ రాగా టిడిపి కి 9948 ఓట్లతో 56.3%, ఓట్ షేర్ వచ్చింది. తేడా 2265 ఓట్లు.
జడ్పీటిసి ఎన్నిక లో పొత్తు లో భాగంగా జనసేన పోటీ చేసింది. వైసీపీ కి 7466 ఓట్లు (42.6%) రాగా జనసేనకి 9979ఓట్లు (56.9%) లభించాయి . జనసేన 2513 ఓట్లతో గెలిచింది. పొత్తు లో భాగంగా జడ్పీ చైర్మన్ జనసేనకు కేటాయిస్తే ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచిన చిలకం మధుసూదన్ రెడ్డి కి లభిస్తుంది. పుట్టపర్తి మండలం లో వైసీపీ పూర్తిస్థాయిలో వెనుకబడింది.
బుక్కపట్నం మండలం మండలం యంపిటిసీలలో కూటమి (టిడిపి +జెయస్పీ) 4 స్థానాలు 11509 ఓట్లు 49.2 %, ఓట్ షేర్ వైసీపీ కి 11823ఓట్లు 50.6 %.ఓట్ షేర్ దక్కింది. సీట్లు టిడిపి 3 జెయస్పీ 1, వైసీపీ 7 . వైసీపీ 314 ఓట్లు(1,4%) మెజారిటీ యంపిటిసీల్లో దక్కించుకొంది.
జడ్పీటిసి ఎన్నిక లో వైసీపీ అభ్యర్థి కి 12055 ఓట్లు 51.5 % ఓట్ షేర్ టిడిపి కి 11245 ఓట్లు 48% ఓట్ షేర్ వచ్చింది. వైసీపీ 810 ఓట్లు మెజారిటీ. యంపిటిసి లో టిడిపి వచ్చిన ఓట్లు జడ్పీటిసి లో నిలవలేదు. ఓట్లు క్రాస్ ఓటింగ్ జరిగింది. వైసీపీ మెజారిటీ పెరిగింది. తెలుగు దేశం పార్టీ కార్యకర్తల్లో నిర్లిప్తత కనిపిస్తోంది. వైసీపీ కార్యకర్తలు గట్టిగా పోరాటం చేసి సాధించారు. ఇందులో కార్యకర్తల కృషి తప్ప నాయకుల శ్రమ కనపడటంలేదు. గ్రామాలకు వెళ్లి ఎన్నికల ప్రచారం చేసింది లేదు.
కొత్త చెరువు మండలం యంపిటిసీ లో తెలుగు దేశం పార్టీ 5 సీట్లు వైసీపీ 6 సీట్లు గెలిచింది. టిడిపి కి 11893 ఓట్లు 48.9 % ఓట్ షేర్ వైసీపీ కి 12239 ఓట్లు 50.3 % ఓట్ షేర్ . ఓట్లపరంగా వైసీపీ కి 346 మెజారిటీ.
జడ్పీటీసీ ఎన్నికలో వైసీపీ కి 12298ఓట్లు వైసీపీ కి 11889ఓట్లు లభించాయి. వైసీపీ 409 ఓట్లతో గెలిచింది. కొత్త చెరువు ఎన్నికల చరిత్ర లో కొత్త చెరువులో టిడిపి యంపిటిసి ఓడిపోవడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తొంది. కమ్మ సామాజిక వర్గం ఇక్కడ చాలా బలంగా ఉంది. వైసీపీ గెలిచిన చరిత్ర ను తిరగరాసింది. ఇది జడ్పీటీసీ స్థానం గెలవడం లో వైసీపీ కి కలిసొచ్చింది. చెల్లని ఓట్లు , నోటాకు పడ్డ ఓట్లు మెుత్తం 596. జడ్పీటీసీ మెజారిటీ కంటే అధికంగా ఉండటం విశేషం.
నల్లమాడ మండలంలో యంపిటిసీ స్థానాలు వైసీపీ 8 , తెలుగు దేశం 4 గెలుచుకొన్నాయి . ఓట్ షేర్ వైసీపీ కి ఎక్కువ. వైసీపీకి 12214ఓట్లు 51.1% ఓట్ షేర్ కాగా టిడిపి 11483ఓట్లు 48% ఓట్ షేర్ దక్కింది. వైసీపీ 731 ఓట్ల మెజారిటీ సాధించింది.
జడ్పీటిసి ఎన్నికలో టిడిపి కి 11424 ఓట్లు 47.8%ఓట్ షేర్ వైసీపీకి 12296 ఓట్లు 51.4 % ఓట్ షేర్ లభించింది. వైసీపీ అభ్యర్థి 872 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నియోజకవర్గంలో చాలా తాండాలు ఉన్నప్పటికీ వారిని కాదని కదిరి నియోజకవర్గం లోని సున్నపుగుట్ట తాండా కు చెందిన అభ్యర్థిని తెలుగు దేశం పార్టీ నుంచి పోటీ చేయించారు. ఇది కొంత దెబ్బ తీసింది. పుట్టపర్తి నియోజకవర్గంలో మిశ్రమ ఫలితాలు లభించాయి.
సింధూరరెడ్డికి నాయకత్వ స్వేచ్ఛ అవసరం
ఈ ఫలితాలు మరో అంశాన్ని కూడా చర్చకు తెచ్చాయి. యువ ఎమ్మెల్యే సింధూరరెడ్డి అసెంబ్లీలో సమస్యలపై అవగాహనతో, సమర్థమైన ప్రసంగాలతో తనదైన గుర్తింపు పొందుతున్నారు. అయితే నియోజకవర్గ రాజకీయాల్లో ఆమెకు పూర్తి స్థాయి నాయకత్వ స్వేచ్ఛ ఉందా అన్న ప్రశ్న మాత్రం చర్చనీయాంశంగా మారుతోంది.
మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రభుత్వ కార్యక్రమాలు, సమీక్షలు, అధికారిక వ్యవహారాల్లో ముందుండటం ప్రతిపక్షాలకు విమర్శలకు అవకాశం కల్పిస్తోంది. అనుభవం విలువైనదే. కానీ అనుభవం యువ నాయకత్వాన్ని నడిపించేది కావాలి తప్ప, దాని స్థానాన్ని ఆక్రమించేది కాకూడదు.
మహిళా సాధికారతకు నిజమైన అర్థం నిర్ణయాధికారంలోనే ఉంటుంది. సింధూరరెడ్డికి రాజకీయంగా స్వతంత్రంగా పనిచేసే అవకాశం కల్పించి, గ్రామస్థాయి కార్యకర్తలతో నేరుగా సంబంధం పెంచుకుని, ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునే వ్యవస్థను నిర్మించడం ఇప్పుడు అవసరం. నాయకత్వం తనదైన పునాదిని నిర్మించుకున్నప్పుడే భవిష్యత్తు రాజకీయ ప్రయాణం బలపడుతుంది.
తీర్పు చెప్పిన బాధ్యత
పుట్టపర్తి ఫలితాలు టీడీపీకి ఒక స్పష్టమైన హెచ్చరికను ఇచ్చాయి. కార్యకర్తలను విస్మరించి కేవలం అధికార బలంపై ఆధారపడటం ప్రమాదకరం. వైసీపీకి మాత్రం వచ్చిన విజయాన్ని అంతిమ విజయంగా భావించే అవకాశం లేదు. ప్రజల సమస్యలపై నిరంతరం పనిచేసినప్పుడే ఈ ఫలితాలు రాజకీయ స్థిరత్వంగా మారతాయి.
స్థానిక సంస్థల ఎన్నికలు అధికారానికి మధ్యంతర ప్రజాభిప్రాయ సేకరణ వంటివి. ప్రజలు ఎవరినీ శాశ్వతంగా గెలిపించరు.. శాశ్వతంగా ఓడించరు. పనితీరు, ప్రజలతో సంబంధం, అందుబాటు, బాధ్యత—ఇవే ప్రతి ఎన్నికలో తిరిగి పరీక్షించబడతాయి.
పుట్టపర్తి ఓటరు ఈసారి పార్టీలకు చెప్పిన సందేశం స్పష్టమే. అధికారం ప్రజల నుంచి వస్తుంది. దానిని నిలబెట్టేది ప్రజల మధ్య నిరంతరం పనిచేసే నాయకత్వమే. గెలిచినవారికి ఇది బాధ్యత.. ఓడినవారికి ఇది అవకాశం. అంతిమంగా గెలవాల్సింది పార్టీ కాదు ప్రజాస్వామ్యం. Puttaparthi
నరసింహారెడ్డి చందమూరి
ఫ్రీలాన్స్ జర్నలిస్టు, కదిరి.
శ్రీ సత్యసాయి జిల్లా.



















