మధ్యప్రదేశ్‌కు చెందిన రాజా రఘువంశీని అతడి భార్య సోనమ్ తన లవర్‌తో కలిసి హత్య చేయించింది. తాజాగా అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లా నాగ్లా హిమాచల్ గ్రామంలోనూ జరిగింది. లలిత అనే మహిళ తన లవర్ నీరేశ్‌తో కలిసి భర్త రుషి కుమార్‌ను హత్య చేయించింది. ఇదే రాష్ట్రంలోని దాన్ బహాదూర్ డీహ్ గ్రామంలో కరిష్మా అనే మహిళ లవర్‌తో ఉండగా భర్తకు దొరికిపోయింది. దీంతో వెంటనే ఆమెకు లవర్‌తో భర్త పెళ్లి చేయించాడు.
పోలీసుల కథనం ప్రకారం, నాగ్లా హిమాచల్ గ్రామానికి చెందిన రుషి కుమార్ వయసు 30 ఏళ్లు. అతడొక ట్రక్ డ్రైవర్. రెండేళ్ల క్రితమే రిషికి లలితతో పెళ్లి జరిగింది. లలిత తరచుగా తన మేనత్త ఇంటికి వెళ్తూ ఉండేది. స్వయానా రుషి బాబాయి సౌదాన్ సింగ్‌తోనే లలిత మేనత్తకు పెళ్లయింది. సౌదాన్ సింగ్ కుమారుడే నీరేశ్. రుషికి నీరేశ్ కజిన్ బ్రదర్ (బాబాయి కొడుకు) అవుతాడు. మేనత్త ఇంటికి రాకపోకలు సాగించే క్రమంలోనే నీరేశ్‌కు లలిత దగ్గరైంది. రుషి డ్రైవింగ్ పనిపై దిల్లీ, ముంబై, కోల్‌కతాలకు చాలా రోజుల పాటు వెళ్లిపోయేవాడు. ఈ వ్యవధిని ఆసరాగా చేసుకొని నీరేశ్, లలితల వివాహేతర సంబంధం మొదలైంది. రుషిని దారి నుంచి తప్పిస్తే తామిద్దరం హ్యాపీగా కలిసి బతకొచ్చని చాలాసార్లు నీరేశ్‌తో లలిత చెప్పింది. అందుకు నీరేశ్ కూడా ఒప్పుకున్నాడు.
నీరేశ్ సోదరుడు బబ్లూ జూన్ 17న పెళ్లిని ఫిక్స్ చేశారు. ఈ పెళ్లి కోసం 10 నుంచి 12 రోజులు ముందే బాబాయి సౌదాన్ సింగ్ ఉండే గ్రామానికి రుషి, లలిత దంపతులు చేరుకున్నారు. ఎట్టకేలకు గత మంగళవారం(జూన్ 17న) బబ్లూ పెళ్లి జరిగింది. అదే రోజు రాత్రి రుషి, లలితల మధ్య అక్రమ సంబంధాలపై తీవ్ర వాగ్వాదం, గొడవ జరిగింది. కోపంతో ఊగిపోయిన లలిత వెంటనే తన ప్రేమికుడు నీరేశ్ ఇంటికి చేరుకొని ఈరోజే అవకాశం వచ్చింది రుషిని చంపేయాలని కోరింది. దీంతో రుషిని ఎలాగైనా చంపేస్తానని లలితకు నీరేశ్ మాట ఇచ్చాడు.
మద్యం తాగొద్దాం పదా అంటూ రుషిని నీరేశ్ పలకరించాడు. ఆ మాటలను నమ్మిన రుషి నీరేశ్ వెంట ఇంటి బయటికి బయలుదేరాడు. అప్పటికే నీరేశ్ చొక్కా లోపల పిస్టల్ సిద్ధంగా ఉంది. జూన్ 18న (బుధవారం) తెల్లవారుజామున ఒంటి గంటకు రుషిపై నీరేశ్ కాల్పులు జరిపాడు. అక్కడికక్కడే రుషి చనిపోయాడు. ఆ వెంటనే నీరేశ్ లలిత దగ్గరికి వెళ్లి రుషిని చంపేశానని చెప్పాడు. ఇక ఇద్దరం కలిసి పారిపోవచ్చన్నాడు. మరోవైపు తుపాకీ ఫైరింగ్ శబ్దానికి పరిసర ప్రాంత ప్రజలంతా మేల్కొన్నారు. అన్నీ తెలిసినా తెలియనట్టుగా లలిత నటించింది.
తన భర్త రుషి హత్యకు సంబంధించి గ్రామానికి చెందిన ఒక వ్యక్తిపై అనుమానం ఉందని పోలీసులకు చెప్పింది. ఆ వ్యక్తిని పోలీసులు విచారించగా, హత్యకు లింక్ లేదని తేలింది. దీంతో లలితపైనే పోలీసులకు అనుమానం పెరిగింది. రూరల్ ఎస్పీ అమృత్ జైన్ నేతృత్వంలోని పోలీసుల దర్యాప్తు బృందం సాంకేతిక ఆధారాలు, కాల్ రికార్డులు, నేరస్థలం పరిస్థితి, లలిత వ్యవహార శైలిని పరిశీలించి నిజాన్ని గుర్తించింది. లలితను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా, ఆమె లవర్ నీరేశ్ హంతకుడు అని తేలింది. వివాహేతర సంబంధం వల్లే నీరేశ్‌తో భర్తను లలిత హత్య చేయించిందని రూరల్ ఎస్పీ అమృత్ జైన్ వెల్లడించారు. ఈ హత్య కోసం ఉపయోగించిన పిస్టల్ (315 బోర్), ఒక లైవ్ కార్ట్రిడ్జ్, ఒక ఖాళీ కార్ట్రిడ్జ్‌ను నీరేశ్ ఇంట్లో నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.