జగన్ భద్రతకు ఏ విధమైన డోకా లేదని, జగన్ నుంచే ఈ రాష్ట్ర ప్రజలకు భద్రత అవసరమని రాష్ట్ర జలవనుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.. తెలుగుదేశం పార్టీ ఒంగోలు జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అశాంతి, అలజడులను రేకెత్తిస్తున్నారని ఆయన విమర్శించారు. పరామర్శల పేరిట ప్రజలకు ప్రాణహాని తలపెడుతున్నారన్నారు. వివిధ కారణాలతో మృతిచెందిన నేరగాళ్లకు శిలా విగ్రహాలు నెలకొల్పటం రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి కే చెల్లిందన్నారు. వారి కుటుంబాల పరామర్శ పేరుతో కొత్త వారి ప్రాణాలు బలికుంటున్నారన్నారు. తన కాన్వాయ్ లో జరిగిన ప్రమాదంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లకుండా అతని మృతికి కారకుడు అయ్యాడు అన్నారు.
జగన్ మనస్తత్వం మానవత్వానికి మచ్చగా పేర్కొన్నారు. ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన అతను ఇలాంటి ప్రవృత్తి వల్ల
రాజకీయాల్లో కొనసాగే నైతిక అర్హత అతనికి లేదన్నారు .
సాటి మనిషి ప్రాణం పోతుంటే సామాన్యుడు సైతం స్పందిస్తాడు.. అలాంటిది ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని నిర్ధాక్షిణ్యంగా వదిలేసి వెళ్లిపోయిన కర్కశమనస్తత్వం కలవాడు జగన్ అని దుయ్యబట్టారు.నా దళితులు, నా ఎస్సీలు, నా బీసీలు అని చెప్పుకునే జగన్ కు వారిపై ఉన్నది కపట ప్రేమగా ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. చనిపోయిన వాడు మా పార్టీ వాడు మీకెందుకని అనడం అతని దుర్మార్గానికి పరాకాష్ట గా పేర్కొన్నారు..పరామర్శలు పేరిట ప్రాణ నష్టం కలిగించటం, శాంతిభద్రతలు లోపించాయని ప్రభుత్వంపై నిందలు వేయడం జగన్ కుట్ర రాజకీయంగా విమర్శించారు.
సంవత్సరం కిందట బెట్టింగ్ లో నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లి, మరో ఇద్దరిని బలిగొన్న రాక్షస మనస్తత్వం గల వ్యక్తి జగన్ అని అన్నారు..పరామర్శల పేరిట ప్రజలపై దండయాత్రలు చేయడం , ప్రాణహాని కలిగించడం అతని ఉన్మాద ప్రవృత్తికి నిదర్శనంగా చెప్పారు.డిజె సౌండ్ లు, నృత్యాలు, గజ మాలలు వేయించుకోవడం, ఘనంగా స్వాగతం పలికించుకోవడం ఇవన్నీ ఏ రకమైన పరామర్శలు అని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. జగన్ ఎక్కడికి వస్తే అక్కడ జనం చచ్చిపోతున్నారు. కాబట్టి అతని పరామర్శలు, పలకరింపులు వద్దు వద్దంటూ అతని నుంచి మమ్మల్ని రక్షించండి అంటూ ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి చెప్పారు.