తెలంగాణ రాష్ట్రంలో మహిళా సాధికారతకు కొత్త దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి Revanth Reddy స్పష్టం చేశారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాల్లో పాల్గొన్న సీఎం, మహిళల ఆర్థిక అభివృద్ధే రాష్ట్ర ప్రగతికి పునాది అని పేర్కొన్నారు. మహిళలను స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ఆయన విస్తృతంగా వివరించారు.
సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం మహిళల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుందని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజులకే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామని గుర్తుచేశారు. ఈ పథకం కోసం ఇప్పటివరకు 10 వేల కోట్ల రూపాయలను ఆర్టీసీకి చెల్లించామని తెలిపారు. కొందరు మహిళల ఉచిత ప్రయాణంపై అపోహలు సృష్టించేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదని స్పష్టం చేశారు.
మహిళలే బస్సుల యజమానులు కావాలనే ఆలోచనతో 1000 బస్సులను కొనుగోలు చేసి మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీకి అద్దెకు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించామని వెల్లడించారు. జూన్ 5న పరేడ్ గ్రౌండ్‌లో 553 కొత్త బస్సులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం దేశంలోనే సంచలనాత్మక కార్యక్రమంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సోలార్ ఎనర్జీ రంగాన్ని కూడా మహిళల చేతుల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ఇప్పటివరకు సోలార్ అంటే అదానీ, అంబానీ వంటి పెద్ద కార్పొరేట్ సంస్థలే గుర్తుకొచ్చేవని, కానీ ఇప్పుడు మహిళా సంఘాలతోనే 1000 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయిస్తున్నామని తెలిపారు. అదే విధంగా పెట్రోల్ బంక్ వ్యాపారాలను కూడా మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
మారుమూల గ్రామాల్లోని మహిళలు కూడా ఆర్థికంగా బలపడాలని ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం అన్నారు. ప్రస్తుతం ఉన్న 5 లక్షల రూపాయల బ్యాంక్ లింకేజ్ రుణ పరిమితిని 10 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకు 60 వేల కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజ్ రుణాలు మహిళలకు అందించామని తెలిపారు. మహిళల కోసం ఇచ్చిన సున్నా వడ్డీ రుణాలపై ప్రభుత్వం ఇప్పటికే 1390 కోట్ల రూపాయలు చెల్లించిందన్నారు.
మహిళలు తీసుకున్న ప్రతి రూపాయిని నిజాయితీగా తిరిగి చెల్లిస్తున్నారని, కానీ కొందరు వ్యాపారులు మాత్రం అప్పులు ఎగ్గొట్టి పారిపోతున్నారని వ్యాఖ్యానించారు. మహిళల క్రమశిక్షణ, నిబద్ధత దేశానికి ఆదర్శమని కొనియాడారు.
రైస్ మిల్లులు, గోడౌన్లు, లాజిస్టిక్ పార్కులు మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు కావాలని సీఎం పిలుపునిచ్చారు. అవసరమైతే 100 ఎకరాల వరకు ప్రభుత్వ భూములు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇకపై ధాన్యం నిల్వలను ప్రైవేట్ గోడౌన్లలో కాకుండా మహిళా సంఘాల ఆధ్వర్యంలోని గోడౌన్లలో నిల్వ చేసే విధానాన్ని తీసుకువస్తామని చెప్పారు.
స్వయం సహాయక మహిళా సంఘాలే వడ్లు కొనుగోలు చేసి బియ్యాన్ని ప్రభుత్వానికి అందించే విధానాన్ని ప్రవేశపెడతామని వెల్లడించారు. రైస్ మిల్లులు, గోడౌన్ల ఏర్పాటు కోసం సున్నా వడ్డీతో భారీ రుణాలు అందజేస్తామని హామీ ఇచ్చారు.
అలాగే మహిళా శక్తి సూపర్ బజార్లను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేయాలని సూచించారు. డీమార్ట్, బిగ్ బజార్ కంటే మెరుగైన స్థాయిలో మహిళా శక్తి సూపర్ బజార్లు ఉండాలని అన్నారు. ఈ సూపర్ బజార్లలో ప్రభుత్వం కూడా వాటాదారుగా ఉంటుందని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో తక్కువ లీజుతో ప్రభుత్వ భూములు అందిస్తామని చెప్పారు. నాణ్యమైన వస్తువులు ప్రజలకు అందేలా మహిళలే నిర్వహణ బాధ్యతలు చేపట్టాలని కోరారు.
ఇందిరమ్మ చీరల పంపిణీపై కూడా సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఇచ్చిన చీరలను పొలాల్లో పిట్టలను తోలడానికి ఉపయోగించేవారని, కానీ ఇప్పుడు ఇచ్చే ఇందిరమ్మ చీరలతో మహిళలు పాలపిట్టల్లా కనిపిస్తున్నారని అన్నారు. త్వరలో పట్టణ ప్రాంతాల్లో కూడా చిలుక పచ్చ రంగులో ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.
రాజకీయాలపై కూడా సీఎం చురకలు అంటించారు. “కొంతమంది అన్నదమ్ములు ఇంటి నుంచి చెల్లెల్లను వెళ్లగొడుతున్నారు. ఇటీవల రాజకీయాల్లో కూడా కొందరు చెల్లెల్లను బయటకు పంపితే వారు బయటకు వెళ్లి ఎలా శాపనార్థాలు పెడుతున్నారో చూస్తున్నాం” అంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
మహిళలే ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చే శక్తి అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 2034 నాటికి కోటీ మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. మహిళల అభివృద్ధి అంటే కుటుంబ అభివృద్ధి, గ్రామాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి అని ఆయన పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితే తెలంగాణ దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తుందని తెలిపారు.
Telangana


















