సినిమా స్టైల్‌లో చోరీలు.. మాస్క్‌లు, నకిలీ నెంబర్ ప్లేట్లతో దొంగతనాలు చేసిన ఆనంద్
సినిమా కథను తలపించేలా ఉన్న ఓ సీరియల్ దొంగ జీవితగాథ ప్రస్తుతం సంచలనంగా మారింది. హీరో కావాలని కలలు కన్న వ్యక్తి చివరకు దేశంలోని మూడు రాష్ట్రాల్లో 32 కేసులు ఎదుర్కొంటున్న సీరియల్ చోర్‌గా మారడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
బెంగళూరుకు చెందిన నాగరాజు గారి ఆనంద్ చిన్నప్పటి నుంచే సినిమా హీరో కావాలని ఆశపడ్డాడు. ఆ కలను నిజం చేసేందుకు తన తల్లిని నిర్మాతగా నిలబెట్టి, తానే హీరోగా, స్వీయ దర్శకత్వంలో ఓ సినిమాను ప్రారంభించాడు. సినిమా షూటింగ్ సగం వరకు పూర్తయినా, వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న పరిణామాలు అతని జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి.
భార్యకు సంబంధించిన ఒక వివాదం నేపథ్యంలో హత్యకు కుట్ర పన్నిన కేసులో ఆనంద్ జైలుకు వెళ్లాడు. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత సన్మార్గంలో నడవాల్సింది పోయి నేరాల మార్గాన్ని ఎంచుకున్నాడు. పూల వ్యాపారం ముసుగులో తిరుగుతూ దొంగతనాలకు పాల్పడడం ప్రారంభించాడు.
సాధారణ ఇళ్లను కాకుండా పెద్ద షాపింగ్ మాల్స్నే లక్ష్యంగా ఎంచుకోవడం అతని ప్రత్యేకత. ముందుగా ఒంటరిగా వెళ్లి రెక్కీ నిర్వహించి, ఆ తర్వాత కూడా ఒంటరిగానే చోరీలకు పాల్పడేవాడు. ఎలాంటి సహచరులు లేకుండా ప్లాన్ చేసి అమలు చేయడం వల్ల పోలీసులకు చాలాకాలం చిక్కలేదు.
దొంగతనాల సమయంలో సినిమా స్టైల్‌లో మాస్క్‌లు, గ్లౌజులు ధరించేవాడు. ప్రయాణానికి ఉపయోగించే కార్లపై నెంబర్ ప్లేట్లను తరచూ మార్చుతూ పోలీసులను తప్పుదోవ పట్టించేవాడు. ఈ జాగ్రత్తల కారణంగా దాదాపు 10 సంవత్సరాల పాటు పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నాడు.
అయితే జూన్ 27 అర్ధరాత్రి అనంతపురంలోని డ్రెస్ సర్కిల్, కాంచీపురం షాపింగ్ మాల్స్‌లో జరిగిన చోరీలు కేసును అనంతపురం పోలీసులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాలు, వాహనాల కదలికలను విశ్లేషించి చివరకు ఆనంద్‌ను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల విచారణలో అతనిపై ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మొత్తం 32 క్రిమినల్ కేసులు నమోదైనట్లు వెలుగులోకి వచ్చింది. అతని క్రైమ్ పద్ధతి, ప్లానింగ్, ఆధారాలు లేకుండా నేరాలు చేయడం పోలీసులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.
హీరో కావాలనే కలతో ప్రారంభమైన ఆనంద్ జీవితం చివరకు నేర ప్రపంచంలోకి మళ్లడం విషాదకరంగా మారింది. ఇప్పుడు అతని అరెస్టుతో పలు రాష్ట్రాల్లో నమోదైన కేసులపై పోలీసులు మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు.



















