ఫిష్ వెంకట్ అన్నంతనే గుర్తుకు రాకపోవచ్చు. అత్తారింటికి దారేది.. ఆది.. డీజే టిల్లు.. దిల్.. లాంటి సినిమాల్లో తనదైన డైలాగ్ డెలివరీతో మిగిలిన వారికి మించి క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకుల మదిలో రిజిస్టర్ అయ్యే అతికొద్ది నటుల్లో అతడొకడు. తనదైన టిపికల్ హైదరాబాదీ యాసతో.. చేసేది నెగిటివ్ రోల్స్ అయినా.. తన డైలాగులతో అందరి ముఖాన నవ్వులు పూయించే టాలెంట్ అతడి సొంతం.
అలాంటి ఫిష్ వెంకట్ ఆరోగ్యం ఇప్పుడు విషమంగా ఉంది. గడిచిన కొన్నేళ్లుగా రెండు కిడ్నీలు పాడుకావటంతో తీవ్ర ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్న అతనికి డయాలసిస్ ద్వారా చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం బోడుప్పల్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడి ఆరోగ్యం ఏ మాత్రం బాగోలేదంటున్నారు.
మరోవైపు తీవ్రమైన ఆర్థిక సమస్యలు అతడ్ని వెంటాడుతున్నాయి. వెండితెర మీద తన నటనతో వెలిగినా.. ఆర్థికంగా ఏ మాత్రం బలం లేని వెంకట్.. ఇప్పుడు సాయం చేసే చేతుల కోసం ఎదురుచూస్తున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యవసరంగా ఎవరైనా అతడ్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. రెండు కిడ్నీలు మార్పిడి చేయాలని.. అందుకు భారీగా ఖర్చు అయ్యే అవకాశం ఉండటం.. ఆర్థికంగా బలహీనంగా ఉన్న అతడ్ని బతికించేందుకు మనసున్న దాతలు ముందుకు రావాలని అతడి కుమార్తె స్రవంతి కోరుతున్నారు. సినిమా ఇండస్ట్రీలోని విషాదం ఇదే. చిన్న క్యారెక్టర్లు వేసే వారి బతుకులు ఎంత దీనంగా ఉంటాయనటానికి నిదర్శనంగా రెండు రోజుల క్రితం నటి పాకీజా ఉదంతం తెలిసిందే. ఆమె ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితుల గురించి తెలుసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆమెకు ఆర్థికంగా సాయం చేసిన సంగతి తెలిసిందే. ఫిష్ వెంకట్ విషయంలోనూ ఆయన సానుకూలంగా స్పందించాలని కోరుకుంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.