వెలిగొండపై కూటమి ఫోకస్.. “చంద్రబాబు నీళ్లు పారిస్తుంటే జగన్ రక్తం పారిస్తున్నాడు” : మంత్రి నిమ్మల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిని స్వయంగా పరిశీలించేందుకు వచ్చిన ఆయన దాదాపు 20 గంటల పాటు టన్నెల్స్‌లోనే గడుపుతూ పనులను సమీక్షించడం విశేషంగా మారింది.టన్నెల్‌లలో లైనింగ్, బెంచింగ్ పనులు, గ్యాంట్రీల పనితీరు, కార్మికుల సమన్వయం, వెహికల్ మూవ్‌మెంట్ వంటి అంశాలను మంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు. క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తున్న కార్మికులు, అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులకు భరోసా ఇవ్వడానికే తాను టన్నెల్స్‌లో గడిపానని చెప్పారు.
ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన నిమ్మల రామానాయుడు.. “చంద్రబాబు నీళ్లు పారిస్తుంటే జగన్ రక్తం పారిస్తున్నాడు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి రైతుల జీవితాల్లో వెలుగులు నింపాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమైతే, జగన్ మాత్రం హింసాత్మక రాజకీయాలతో ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాడని ఆరోపించారు.వెలిగొండ ప్రాజెక్టు పరిస్థితికి గత జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మంత్రి మండిపడ్డారు. “రూ.3000 కోట్ల పనులు మిగిలి ఉండగానే ప్రాజెక్టును జాతికి అంకితం చేశామని చెప్పడం ప్రజలను మోసం చేయడమే” అని విమర్శించారు. టన్నెల్-2లో 12వ కిలోమీటర్ వద్ద చిక్కుకుపోయిన భారీ టిబిఎం (TBM) మిషన్ తొలగింపుపై గత ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని అన్నారు.
టిబిఎం మిషన్ తొలగింపుపై హైకోర్టులో స్టే ఉన్నప్పటికీ దానిని తొలగించేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నించలేదని, చంద్రబాబు అడ్వకేట్ జనరల్‌తో మాట్లాడి స్టే తొలగించేలా చర్యలు తీసుకున్నారని వివరించారు. టిబిఎం ఉన్న ప్రాంతానికి చేరుకోవడం కూడా చాలా క్లిష్టమైందని, జేసీబీపై వెళ్లి పరిస్థితిని పరిశీలించాల్సి వచ్చిందన్నారు. అక్కడికి వెళ్లే దారిలో మూడు చోట్ల భారీ కొండరాళ్లు ఊడిపడ్డాయని తెలిపారు.టన్నెల్స్‌లో చిక్కుకున్న టిబిఎంను తొలగించకుండా నీటిని తరలించడం సాధ్యం కాదని మంత్రి స్పష్టం చేశారు. అందుకోసం టిబిఎం తయారీ సంస్థతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని, త్వరలో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి పనులు వేగవంతం చేస్తామని చెప్పారు.
వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి ప్రకాశం జిల్లా రైతుల జీవితాల్లో వెలుగులు నింపాలనే ధృఢ సంకల్పంతో సీఎం చంద్రబాబు ఉన్నారని మంత్రి తెలిపారు. అందుకే ప్రతి వారం వెలిగొండ పనులపై ముఖ్యమంత్రి స్వయంగా సమీక్ష నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
అలాగే రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టుల పురోగతిపైనా మంత్రి వివరాలు వెల్లడించారు. హంద్రీనీవా కాలువ పనులను రూ.3850 కోట్లతో పూర్తి చేసి కుప్పానికి నీరు అందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువలో క్లిష్టమైన పనులు కొనసాగుతున్నాయని, సీజన్ ప్రారంభానికి ముందే అనకాపల్లి వరకు గోదావరి జలాలు తరలించే లక్ష్యంతో పని చేస్తున్నామని చెప్పారు.2027 పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ఉత్తరాంధ్ర, రాయలసీమకు గోదావరి జలాలు అందిస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలోని 11 కీలక ప్రాజెక్టులను రెండేళ్లలో పూర్తి చేయడానికి రూ.2000 కోట్లతో పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
నిర్వాసితులకు త్వరలోనే రూ.900 కోట్ల పరిహారం అందజేయనున్నట్లు కూడా మంత్రి తెలిపారు. రాష్ట్రాన్ని 2047 నాటికి దేశంలో అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో చంద్రబాబు పనిచేస్తుంటే, జగన్ అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తున్నాడని విమర్శించారు.“ప్రజలు ఇప్పుడు నిర్ణయించుకోవాలి.. నీళ్లు తీసుకొచ్చి భూములను సస్యశ్యామలం చేసే నాయకులు కావాలా? లేక రక్తపాతం సృష్టించే వాళ్లు కావాలా?” అంటూ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

















