ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగమోహన్ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘సతీ లీలావతి’. లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ‘భీమిలీ కబడ్డీ జట్టు’, ‘ఎస్.ఎం.ఎస్ (శివ మనసులో శృతి)’ చిత్రాలతో గుర్తింపు పొందిన తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. మే 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి మీడియాతో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.లావణ్య మాట్లాడుతూ.. “‘సతీ లీలావతి’ మూవీని ఇప్పటికే చూశాను. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ కథపై, సినిమాలోని వినోదంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని బాగా ఆదరిస్తారని భావిస్తున్నాను” అన్నారు. షూటింగ్ సమయంలోనే తాను ప్రెగ్నెంట్ అని తెలిసిందని, అయినా కూడా చిత్ర బృందం ఇచ్చిన సహకారంతో షూటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేశానని తెలిపారు.
“ప్రతి రోజు షూటింగ్ పూర్తయ్యాక హాస్పిటల్‌కి వెళ్లి చెకప్ చేయించుకునేదాన్ని. ఈ సినిమా కోసం బరువు కూడా తగ్గాను. కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనడం కాస్త కష్టంగానే అనిపించింది. కానీ టీమ్ సపోర్ట్‌తో అన్నీ సాఫీగా పూర్తయ్యాయి. ఇకపై మాత్రం ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు షూటింగ్‌లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను” అని చెప్పారు.ఈ చిత్రంలో తాను డైరెక్టర్ పాత్రలో కనిపించబోతున్నానని వెల్లడించిన లావణ్య.. “సినిమాలో కామెడీ అద్భుతంగా ఉంటుంది. నేను, నా మేనేజర్ సినిమా చూస్తూ చాలా నవ్వుకున్నాం. ఎమోషన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మెసేజ్ ఉన్నా కూడా ఎక్కడా బోధిస్తున్నట్టుగా అనిపించదు” అని వివరించారు.
సినిమాలో చూపించిన రిలేషన్‌షిప్స్ గురించి మాట్లాడుతూ.. “రియల్ లైఫ్‌లో అలాంటి పరిస్థితులు ఎవరికి రావొద్దు. నాకు మాత్రం వరుణ్ లాంటి మంచి భర్త దొరికారు. ప్రస్తుతం నా భర్త, నా కొడుకుతో చాలా సంతోషంగా జీవిస్తున్నాను” అని చెప్పారు.యాక్షన్ సీక్వెన్స్ గురించి మాట్లాడుతూ.. “నా కెరీర్‌లో ఫస్ట్ టైం యాక్షన్ సీన్ చేశాను. కాలితో కొట్టే ఒక సీన్‌లో కాస్త ఇబ్బంది అనిపించింది. కానీ కొత్త అనుభవంగా అనిపించింది” అని తెలిపారు.రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ.. “ఆయన ఎప్పుడూ చాలా సపోర్టివ్‌గా ఉంటారు. ఏమైనా సహాయం కావాలా అని అడుగుతుంటారు. మా సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయడం వల్ల మరింత రీచ్ వచ్చింది” అన్నారు. అలాగే చిరంజీవి గారు కూడా తమ అందరినీ ఎంతో ప్రోత్సహిస్తారని చెప్పారు.
హీరో దేవ్ మోహన్‌పై ప్రశంసలు కురిపించిన లావణ్య.. “ఆయన అద్భుతమైన నటుడు. ఈ సినిమా కోసం స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పారు. నేను కూడా నా పాత్రలకు సొంతంగా డబ్బింగ్ చెప్పాలని ప్రయత్నిస్తున్నాను” అన్నారు.ప్రస్తుతం కొత్త సినిమాలు ఒప్పుకోవడం లేదని, తన కుటుంబానికి సమయం కేటాయించాలని అనుకుంటున్నానని లావణ్య స్పష్టం చేశారు. “నా కొడుకుతోనే నాకు టైం సరిపోతోంది. కొంత గ్యాప్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను” అని పేర్కొన్నారు.సీనియర్ నటుడు నరేష్, వీటీవీ గణేష్ తదితరులు సినిమాలో అద్భుత పాత్రలు పోషించారని ఆమె తెలిపారు. కమల్ హాసన్ నటించిన క్లాసిక్ ‘సతీ లీలావతి’తో తమ సినిమాను పోల్చకూడదని, అయితే తమ చిత్రం పూర్తిగా వినోదాత్మకంగా సాగుతుందని చెప్పారు.
వరుణ్ తేజ్‌తో కలిసి నటించే అవకాశంపై స్పందిస్తూ.. “మాకు కూడా కలిసి నటించాలని ఉంది. ఇటీవల ఓ కథ కూడా వచ్చింది. కానీ రియల్ లైఫ్‌లో ఉన్నట్టే తెరపై కనిపించాలంటే కథ చాలా కొత్తగా ఉండాలి. అలాంటి కథ వస్తే తప్పకుండా ఆలోచిస్తాం” అన్నారు.చివరిగా “సతీ లీలావతి’ చిత్రం ప్రేక్షకులకు మంచి రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఇస్తుంది. పూర్తి ఎంటర్టైనింగ్‌గా సాగుతూ అందరినీ ఆకట్టుకుంటుంది” అంటూ లావణ్య త్రిపాఠి సినిమా మీద తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
SathiLeelavathi

















