ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-II, ఫేజ్-III ప్రాజెక్టులపై విస్తృతంగా చర్చించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగర భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెట్రో విస్తరణకు తక్షణ ఆమోదం అవసరమని సీఎం కేంద్ర మంత్రిని కోరారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-IIలో మొత్తం ఏడు కారిడార్లతో 122.9 కిలోమీటర్ల మేర విస్తరణ చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.38,595 కోట్లుగా నిర్ణయించారు. దీనికి సంబంధించిన సమగ్ర డీపీఆర్‌ను ఇప్పటికే కేంద్రానికి సమర్పించినట్లు సీఎం వివరించారు. ఫేజ్-II ప్రాజెక్ట్‌ను కేంద్ర ప్రభుత్వం – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మెట్రో విస్తరణ వల్ల ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు ప్రజలకు వేగవంతమైన, సౌకర్యవంతమైన రవాణా అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-Iను నిర్వహిస్తున్న L&T Metro Rail Hyderabadను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం మెట్రో విస్తరణను వేగవంతం చేయడమేనని సీఎం తెలిపారు. ప్రస్తుతం ఫేజ్-I ప్రభుత్వం పరిధిలో ఉండటంతో ఫేజ్-II, ఫేజ్-III పనులు మరింత సులభంగా సాగుతాయని కేంద్ర మంత్రికి వివరించారు.
భవిష్యత్ నగర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ వరకు ప్రత్యేక మెట్రో కారిడార్‌ను ఫేజ్-III కింద అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఈ కారిడార్‌కు సంబంధించిన డీపీఆర్ కూడా ఇప్పటికే కేంద్రానికి సమర్పించామని తెలిపారు. ఈ మార్గం అభివృద్ధి చెందితే ఐటీ, రియల్ ఎస్టేట్, పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలకు భారీ ఊతం లభిస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఈ కీలక సమావేశంలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి కె. శ్రీనివాస్, సీఎం ప్రత్యేక కార్యదర్శి బి. అజిత్ రెడ్డి, హెచ్ఎంఆర్ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, రాష్ట్ర ప్రభుత్వ పట్టణ రవాణా సలహాదారు ఎన్.వి.ఎస్. రెడ్డి, ఢిల్లీ తెలంగాణ భవన్ ప్రత్యేకాధికారి సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Telangana

















