రాష్ట్ర సచివాలయంలోని 5వ బ్లాక్‌లో నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 7వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు దక్కించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు కలెక్టర్లు, ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు. ఈ అవార్డు రాష్ట్ర ప్రభుత్వ సమష్టి కృషికి దక్కిన గుర్తింపని సీఎం పేర్కొన్నారు.
“రెండేళ్ల క్రితం రాష్ట్రం గురించి ప్రజలు ఎలా మాట్లాడారు.. ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారో చూడండి. ఇదే మన పనితీరుకు నిదర్శనం” అని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ అవార్డు మరింత బాధ్యతను పెంచిందని, గ్రామ స్థాయి అధికారుల నుంచి మంత్రులు, సీఎస్ వరకు అందరి కృషి వల్లే ఈ గౌరవం దక్కిందని తెలిపారు. ఈ పురస్కారాన్ని రాష్ట్ర ప్రజలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.
గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రధాన కేంద్రంగా మారబోతోందని సీఎం వెల్లడించారు. ఇప్పటికే ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టాయని, రానున్న రోజుల్లో ఈ రంగాలకు ఏపీ ఒక బ్రాండ్‌గా నిలుస్తుందని చెప్పారు. రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ తిరుపతి జిల్లా సత్యవేడులో రూ.2,200 కోట్ల పెట్టుబడితో యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీని ద్వారా 3,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ఆటోమొబైల్ హబ్‌గా ఎదుగుతోందని సీఎం అన్నారు.
రైతు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇప్పటివరకు 46 లక్షల మంది రైతుల ఖాతాల్లో మూడు విడతలుగా రూ.8,985 కోట్లను జమ చేశామని వెల్లడించారు. అలాగే ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా ఇప్పటివరకు రూ.63 వేల కోట్లకుపైగా పెన్షన్లు పంపిణీ చేశామని చెప్పారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ఏడాదికి ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున 1,25,000 మంది మత్స్యకారులకు రూ.250 కోట్లు అందిస్తున్నామని వివరించారు.
విద్యారంగంలో కూడా పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చామని సీఎం తెలిపారు. పదో తరగతి ఫలితాలు బాగా వస్తే రాజకీయ నాయకులు క్రెడిట్ తీసుకుంటారని, కానీ అసలు హీరోలు విద్యార్థులేనని పేర్కొన్నారు. అందుకే విద్యార్థుల ఫోటోలతో ప్రకటనలు ఇచ్చామని చెప్పారు. కార్పొరేట్ రంగం చేసే పనిని ప్రభుత్వం చేయడం దేశంలోనే కొత్త ఒరవడిగా నిలిచిందని వ్యాఖ్యానించారు.
అమరావతిలో జరిగిన ఈ 7వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, సంక్షేమ పథకాల అమలు, విద్యా రంగ సంస్కరణలు, పరిశ్రమల ప్రోత్సాహం వంటి కీలక అంశాలపై సమావేశంలో చర్చించారు.

















