ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా భక్తులతో కిక్కిరిసిపోవడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించేందుకు లక్షలాది భక్తులు తరలివచ్చారు. ఈ పెరిగిన రద్దీ కారణంగా రహదారులపై వాహనాలు కదలలేని పరిస్థితి ఏర్పడింది. 300 కిలోమీటర్ల మేర వాహన రాకపోకలు నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు.
భక్తుల ప్రవాహం నియంత్రించలేక, యూపీ ట్రాఫిక్ పోలీసులు ప్రయాగ్‌రాజ్ వెళ్లే మార్గాల్లో రాకపోకలను నిలిపివేశారు. కొన్ని ప్రాంతాల్లో 50 కిలోమీటర్లు ప్రయాణించేందుకు 12 గంటల సమయం పడుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రయాగ్‌రాజ్ సంగం రైల్వే స్టేషన్ మూసివేశారని వస్తున్న వార్తలను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఖండించారు.
ఈ ట్రాఫిక్ జామ్ ప్రభావం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా కనిపిస్తోంది. అక్కడి కొన్ని జిల్లాల్లో ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే భక్తుల వాహనాల కారణంగా కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భక్తులను ప్రయాగ్‌రాజ్ యాత్రను మరో రెండు రోజులు వాయిదా వేసుకోవాలని సూచించారు.
ఈ పరిస్థితి భారతదేశ చరిత్రలో అరుదుగా కనిపించే భారీ ట్రాఫిక్ జామ్‌లలో ఒకటిగా నిలుస్తోంది. ఇంతకుముందు 2010లో చైనా రాజధాని బీజింగ్‌లో 100 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో 12 రోజుల పాటు ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అలాగే, 2012లో బ్రెజిల్‌లోని సావోపాలోలో 300 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు 12-15 గంటలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ప్రయాగ్‌రాజ్ ట్రాఫిక్ జామ్ ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్‌లలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. అధికార యంత్రాంగం పరిస్థితినినియంత్రించేందుకు కృషి చేస్తోంది. భక్తులు ముందస్తు ప్రణాళికతో పర్యటనలు ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆద్యాత్మిక కార్యక్రమం భారతదేశంలో జరుగుతోంది. 144 ఏళ్లకు ఓసారి ప్రయాగరాజ్ లో మహా కుంభమేళా జరుగుతుంది… కాబట్టి యావత్ దేశం ఈ మహాకార్యంలో పాల్గొనడం మహద్భాగ్యంగా భావిస్తారు. ఇందులో పాల్గొని పవిత్ర గంగా, యమునా, సరస్వతి నదుల పవిత్ర సంగమంలో పుణ్యస్నానం చేయాలని ప్రతి హిందువు కోరుకుంటాడు. విదేశీయులు సైతం ఈ మహా కుంభమేళాను చూసేందుకు తరలివస్తుంటారు.
ఇలా గత నెల రోజులుగా ప్రయాగరాజ్ లో గంగానది తీరం జనసంద్రాన్ని తలపిస్తోంది. జనవరి 13, 2025న ప్రారంభమైన ఈ మహా కుంభమేళాలో ఇప్పటివరకు 40 కోట్లమమందికిపైగా పాల్గొన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా పది పదిహేను రోజుల సమయం వుంది… ఇంతలో మరో 5 నుండి 10 కోట్ల మంది వస్తారని అంచనా.మొత్తంగా కుంభమేళా ముగిసేనాటికి 50 కోట్లమంది ప్రయాగరాజ్ ను సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు.
మహా కుంభమేళాలో ఇప్పటికే మకర సంక్రాంతి, మౌని అమావాస్య, వసంత పంచమి అమృత స్నానాలు ముగిసాయి. ఇక ఇప్పుడు ఫిబ్రవరి 12న అంటే రేపు బుధవారం మాఘ పౌర్ణమి రోజున సంగమ స్నానం చేసేందుకు భక్తులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో దేశ నలుమూలల నుండి తండోపతండోలుగా భక్తులు తరలివస్తున్నారు. ఒక్కసారిగా భక్తుల తాకిడి పెరగడంతో ప్రయాగరాజ్ కు వెళ్లే రోడ్లన్ని వాహనాలతో నిండిపోయి రద్దీగా మారాయి. స్వయంగా మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రయాగరాజ్ కు వెళ్లేవారు రెండురోజులు ఆగాలని సూచిస్తున్నారంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు.