కంచె చేను మేస్తే.. న్యాయం ఎవరిని అడగాలి? పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పోస్ట్లు అమ్మకాలు.
కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో జరిగిన అక్రమాల ఆరోపణల నేపథ్యంలో శ్రీ శ్రీ రచించిన వెలుగు నీడలు సినిమా లోని పాట గుర్తుకొస్తుంది.
ఆకాశమందుకునే ధరలొకవైపు.. అదుపులేని నిరుద్యోగమింకొకవైపూ..
అవినీతి.. బంధుప్రీతి.. చీకటి బజారూ..
అలముకున్న నీ దేశమెటు దిగజారూ..
కాంచవోయి నేటి దిస్థితి..ఎదిరించవోయి ఈ పరీస్థితి..
కాంచవోయి నేటి దిస్థితి..ఎదిరించవోయి ఈ పరీస్థితి..
కాంచవోయి నేటి దిస్థితి…
వెలుగు నీడలు సినిమా లో శ్రీ శ్రీ పాడవోయి భారతీయుడా పాటలోని ఈ భాగం “కాంచవోయి నేటి దుస్థితి… ఎదిరించవోయి ఈ పరిస్థితి” — ఇది సమాజంలోని అసమానతలను, నిరుద్యోగాన్ని, అవినీతిని ప్రశ్నిస్తూ ప్రజల్లో చైతన్యం కలిగించే సందేశాత్మక గీతం ఇది.కంచె చేను మేస్తే యజమాని ఎవరికి చెప్పుకోవాలి? ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడంటారు. లోగుట్టు పెరుమాళ్లకెరుక అంటారు. కానీ ప్రజల నమ్మకంతో నడిచే నియామక వ్యవస్థలోనే అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వస్తే, ఆ లోగుట్టును బయటపెట్టాల్సిన బాధ్యత ఎవరిది? కాపాడాల్సినవారే కబళిస్తే, కష్టపడి చదివిన నిరుద్యోగులకు న్యాయం చేసేదెవరు?
ప్రతిభకు పట్టం కట్టాల్సిన ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో అవినీతి ఆరోపణలు రావడం సిగ్గుచేటు. పరీక్ష రాసే అభ్యర్థులు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునే వ్యవస్థలో, పరీక్ష నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ఉన్నతాధికారులపైనే ఆరోపణలు వస్తే ఎవరిని ప్రశ్నించాలి? వ్యవస్థను నమ్మాలా? లేక ఆ వ్యవస్థలోనే ఏదో జరుగుతోందన్న అనుమానంతో బతకాలా?కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ (కేపీఎస్సీ) నిర్వహించిన వెటర్నరీ ఆఫీసర్ల నియామక పరీక్షలో ప్రశ్నపత్రం ముందుగానే లీకైందని, అభ్యర్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ కేసులో సస్పెండ్ అయిన కమిషన్ చైర్మన్ శివశంకరప్ప సాహుకార్, సభ్యురాలు బి.వి. గీతలను అక్టోబర్ 6న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసినట్లు వార్తా నివేదికలు వెల్లడించాయి.
అయితే అరెస్టు కావడం నేరం నిరూపితమైనట్లు కాదు. ఆరోపణలను ఆధారాలతో నిరూపించాల్సిందే. న్యాయస్థానాలే దోషులను నిర్ణయించాలి. కానీ ఇంతటి తీవ్రమైన ఆరోపణలు ఎందుకు వచ్చాయి? నియామక వ్యవస్థలో లోపం ఎక్కడుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత మాత్రం సంబంధిత అధికారులపై ఉంది.2026 జనవరి 8, 9 తేదీల్లో జరిగిన వెటర్నరీ ఆఫీసర్ల పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం ముందుగానే కొందరు అభ్యర్థులకు చేరిందని ఈడీ ఆరోపించింది. 80 ప్రశ్నలకు సరైన సమాధానాల ఎంపికలతో కూడిన ప్రశ్నపత్రాన్ని పరీక్షకు ముందే అందించారని, పది మంది అభ్యర్థులను బెంగళూరు శివార్లలోని రిసార్ట్‌కు తీసుకెళ్లి సమాధానాలను గుర్తుపెట్టుకునేలా చేశారని దర్యాప్తు సంస్థ వెల్లడించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
అప్పటి పరీక్షల నియంత్రణాధికారి జ్ఞానేంద్ర కుమార్ గంగ్వార్ వద్ద ఉన్న పరీక్షా సామగ్రి నుంచి ప్రశ్నపత్రం బయటకు వెళ్లిందన్నది ప్రధాన ఆరోపణ. బసవరాజ్ కన్నాలే అనే మధ్యవర్తి ద్వారా అభ్యర్థులను సంప్రదించి సమాధానాలు అందించారని, ఒక్కో అభ్యర్థి నుంచి రూ.80 లక్షల వరకు డిమాండ్ చేశారని వార్తలు వెల్లడించాయి. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరగాలి. డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాయి? ప్రశ్నపత్రం ఎలా బయటకు వచ్చింది? ఎవరు లబ్ధి పొందారు? ఆధారాలతో తేల్చాల్సిన అంశాలివి.
ఒక నిరుద్యోగి ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి చదువుతాడు. తల్లిదండ్రులు తమ అవసరాలను తగ్గించుకుని చదివిస్తారు. పరీక్ష కోసం నెలల తరబడి శ్రమిస్తాడు. ఒక్క మార్కు కోసం పోరాడతాడు. అలాంటిది పరీక్షకు ముందే ప్రశ్నపత్రం కొందరి చేతుల్లోకి వెళ్లిందనే ఆరోపణలు వస్తే అతని పరిస్థితి ఏమిటి?ఒక అక్రమ ర్యాంకు వెనుక అర్హుడైన మరో అభ్యర్థి కోల్పోయిన అవకాశం ఉండవచ్చు. ప్రతిభకు బదులు డబ్బు పనిచేస్తే పేద నిరుద్యోగి భవిష్యత్తుకు భరోసా ఏమిటి?
ఉన్నతాధికారుల బాధ్యత ఏది?
సాహుకార్‌పై వెటర్నరీ ఆఫీసర్ల నియామకాల్లో అక్రమాలతో పాటు, నకిలీ ఆదాయ ధ్రువీకరణ పత్రం ఆధారంగా తన కుమార్తెకు ఇండస్ట్రియల్ ఆఫీసర్ ఉద్యోగం ఇప్పించారన్న ఆరోపణ కూడా ఉన్నట్లు వార్తా నివేదికలు పేర్కొన్నాయి. ఈ వ్యవహారాలపై వేర్వేరు దర్యాప్తులు జరుగుతున్నాయి. 2019లో బీజేపీ ప్రభుత్వం ఆయనను కేపీఎస్సీ చైర్మన్‌గా నియమించగా, 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఆ పదవిలో కొనసాగారు.పదవిలో ఉన్నవారిపై ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ మరింత పారదర్శకంగా జరగాలి. చైర్మన్ అయినా, సభ్యుడైనా, పరీక్షల నియంత్రణాధికారి అయినా చట్టానికి అతీతులు కారు. అదే సమయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారి హక్కులను కూడా కాపాడాలి.
అసలు ప్రశ్నపత్రాన్ని భద్రపరిచే విధానం ఏమిటి? దానికి ఎవరు బాధ్యులు? ప్రశ్నపత్రం బయటకు వెళ్లకుండా నిరోధించాల్సిన పర్యవేక్షణ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? అక్రమాలపై ముందుగానే ఫిర్యాదులు వచ్చాయా? వస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఈ ప్రశ్నలకు సమాధానాలు లేకుండా కొందరిని అరెస్టు చేయడంతోనే సమస్య పరిష్కారమైనట్లు భావించగలమా?2026 జూలై 17న 400 వెటర్నరీ ఆఫీసర్ పోస్టులకు తుది ఎంపిక జాబితా విడుదలైనట్లు నివేదికలు పేర్కొన్నాయి. అనంతరం అక్రమాల ఆరోపణల నేపథ్యంలో జూలై 26–27 తేదీల్లో ఎంపిక ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసి అంతర్గత విచారణకు ఆదేశించినట్లు సమాచారం.
విచారణ ఎప్పుడు పూర్తవుతుంది? అక్రమాలు నిర్ధారణ అయితే నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం ఎలా చేస్తారు? పరీక్షను మళ్లీ నిర్వహించాలా? ఎంపిక జాబితాను కొనసాగించవచ్చా? నిర్ణయం తీసుకునే ప్రమాణాలేమిటి? నిర్దోషులైన అభ్యర్థులను నిరవధికంగా అనిశ్చితిలో ఉంచడం మరో అన్యాయం కాదా?దర్యాప్తు నిష్పక్షపాతంగా, కాలపరిమితితో జరగాలి. ప్రశ్నపత్రం లీకేజీ, డబ్బుల లావాదేవీలు, అభ్యర్థుల సమాధానాల సరళి, అధికారుల పాత్ర వంటి అంశాలను ఆధారాలతో పరిశీలించాలి. అక్రమాలు నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో అర్హులైన అభ్యర్థుల భవిష్యత్తును కాపాడే నిర్ణయం తీసుకోవాలి.
నిరుద్యోగులకు న్యాయం ఎప్పుడు?
ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరి వ్యక్తిగత ఆస్తులు కావు. నియామక కమిషన్లు ఎవరి స్వప్రయోజనాల కోసం పనిచేసే సంస్థలు కావు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడం వాటి ప్రాథమిక బాధ్యత.ఒక నిరుద్యోగి ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి చదువుతాడు. నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తాడు. పరీక్ష కోసం నెలల తరబడి సిద్ధమవుతాడు. ఒక మార్కు కోసం పోరాడతాడు. చివరికి మెరిట్ జాబితాలో తన పేరు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తాడు.అలాంటి సమయంలో అదే నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వస్తే అతని పరిస్థితి ఏమిటి? తన ప్రతిభపై నమ్మకం పెట్టుకోవాలా? పరీక్ష నిర్వహించిన వ్యవస్థపై విశ్వాసం ఉంచాలా? లేక తెరవెనుక ఏం జరిగిందో తెలియని అనిశ్చితిలోనే ఉండిపోవాలా?
కంచెను కాపాడాల్సినవారే కంచెను తినే పరిస్థితి ఏర్పడితే, దాన్ని ప్రశ్నించడం తప్పు కాదు. ప్రశ్నించకుండా మౌనంగా ఉండటమే అసలైన ప్రమాదం.కంచె చేను మేసిందా లేదా అన్నది ఆధారాలతో తేలాలి. మేసినట్లు నిర్ధారణ అయితే బాధ్యులను శిక్షించడమే కాదు, నష్టపోయిన చేనుకు న్యాయం కూడా చేయాలి.ప్రతిభకు పట్టం కట్టాల్సిన చోట పైసలకు పట్టం కట్టే పరిస్థితి రాకూడదు. ఉద్యోగం అర్హతతో రావాలి.. అక్రమంతో కాదు. న్యాయం పలుకుబడికి తలవంచకూడదు.. నిజానికి పట్టం కట్టాలి. అదే నిజమైన పారదర్శకత. అదే ప్రజాస్వామ్య బాధ్యత.
నరసింహారెడ్డి చందమూరి.
ఫ్రీలాన్స్ జర్నలిస్టు.
కదిరి.


















