*కదిరి స్థానిక సంస్థల ఎన్నికల ముఖచిత్రం.*
కదిరి ప్రాంతానికి ఓ విశిష్ట చరిత్ర ఉంది. క్రీ.శ. 1352 కంటే ముందు కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. బుక్క 1 పాలనా కాలంలో ఆలయం లో ఓ మంటపం నిర్మించినట్లు శాసనాలు ఉన్నాయి. బ్రిటిష్ పరిపాలన కాలంలో కదిరి కడప జిల్లాలో ఉంది. మదనపల్లి రెవిన్యూ డివిజన్ లో ఉండేది. 1910లో అనంతపురం జిల్లాలో కలిపారు. 1832 కంటే ముందు కదిరిలో తాలూకా కేంద్రం గా ఏర్పడింది. 1827 అని కొందరు చెబుతున్నారు. ఏదిఏమైనా త్వరలో దాదాపు 200 సంవత్సరాల కాలం పూర్తి అవుతుంది. రెండు శతాబ్దాల చరిత్ర కలిగిన కదిరి లో ఎన్నికల చరిత్రకుఎంతో ప్రాముఖ్యత ఉంది.1871లో రూపొందిన స్థానిక బోర్డుల చట్టం IV ద్వారా ఫండ్ బోర్డులు ఏర్పాటయ్యాయి. 1884లో వచ్చిన స్థానిక బోర్డుల చట్టం V ద్వారా జిల్లా స్థాయిలో జిల్లా బోర్డులు, తాలూకా/డివిజన్ స్థాయిలో తాలూకా బోర్డులు, గ్రామం లేదా గ్రామాల సమూహం స్థాయిలో యూనియన్ బోర్డులు ఏర్పాటు ఏర్పడ్డాయి. అనంతపురం జిల్లాలో 1886 అక్టోబరులో తాలూకా బోర్డులు ఏర్పాటు చేయబడ్డాయి. తదుపరి 1959లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సమితులు మరియు జిల్లా పరిషత్తుల చట్టం ద్వారా గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీలు, బ్లాక్ స్థాయిలో పంచాయతీ సమితులు, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్తులు ఏర్పాటయ్యాయి.
బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ సూచనల మేరకు మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేశారు. పంచాయతీ సమితులు మరియు జిల్లా పరిషత్తుల చట్టం, 1959 నియమాలు, నిబంధనలు రాష్ట్రంలో మూడు అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటుకు మార్గం సుగమం చేశాయి. అక్టోబర్ 1959 లో ఈ చట్టం ప్రకారం మూడు రకాల సంస్థలు ఏర్పడ్డాయి.18 సెప్టెంబర్ 1959న చట్టానికి గవర్నర్ ఆమోదం లభించగా, అది 2 అక్టోబర్ 1959 నుంచి అమల్లోకి వచ్చింది.
1. గ్రామాల్లో గ్రామ పంచాయతీలు. వాటికి సర్పంచ్ , మెంబర్లు ఉంటారు. అంతకు మునుపు పంచాయతీ బోర్డు ఉండేది.
2. పంచాయతీ సమితులు. వాటికి అధ్యక్షుడు ఉంటారు.
3. జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్తులు .
1959–1985 మధ్య పంచాయతీ సమితుల కొనసాగాయి. సమితి అధ్యక్షులు జిల్లా పరిషత్ అధ్యక్షున్ని ఎన్నుకొనేవారు.
జిల్లా స్థాయిలోని జిల్లా పరిషత్తులు ప్రధానంగా పర్యవేక్షణ, సమన్వయ సంస్థలుగా పనిచేసేవి.
క్రింది స్థాయిలో గ్రామ పంచాయతీలు ఉండేవి.అంటే మూడు అంచెల వ్యవస్థలో జిల్లా పరిషత్ , పంచాయతీ సమితి , గ్రామ పంచాయతీ అనే నిర్మాణం ఉండేది. పంచాయతీ సమితులు రెండో అంచెగా ఉండేవి.సమితి పరిధిలోని అన్ని గ్రామాల సర్పంచులు పంచాయతీ సమితికి సభ్యులుగా ఉండేవారు.అదనంగా కో-ఆప్షన్ సభ్యులు ఉండేవారు.పంచాయతీ సమితుల్లో మొత్తం ఐదు స్థాయీ సంఘాలు ఉండేవి. ప్రతి సంఘానికి వివిధ రకాల పనులు, బాధ్యతలు అప్పగించేవారు. పంచాయతీ సమితుల పనితీరులో ఈ స్థాయీ సంఘాలు గణనీయమైన పాత్ర పోషించేవి.పంచాయతీ సమితి అధ్యక్షుడు సమితి సమావేశాలను సమావేశపరచి, వాటికి అధ్యక్షత వహించేవాడు. సమితి సమావేశాల కార్యక్రమాలను నిర్వహించేవాడు. సమితికి సంబంధించిన అన్ని పత్రాలు, దస్తావేజులను పరిశీలించే హక్కు అధ్యక్షుడికి ఉండేది. అధ్యక్షుడికి సహాయంగా సమితి సభ్యులు తమలో నుంచి ఒకరిని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకునేవారు.
బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (బీడీఓ) పంచాయతీ సమితికి ప్రధాన కార్యనిర్వహణాధికారిగా వ్యవహరించేవాడు.
పంచాయతీ సమితి, దాని స్థాయీ సంఘాలు చేసిన తీర్మానాలను అమలు చేయించేందుకు అధ్యక్షుడికి బీడీఓపై పరిపాలనా నియంత్రణ ఉండేది.
కదిరి లో రెండు పంచాయతీ సమితిలు ఉండేవి. కదిరి తూర్పు సమితి , పడమర సమితి .
కదిరి తూర్పు సమితి కార్యాలయం తనకల్లు లో ఉండేది. తర్వాత కదిరికి మార్చారు. కదిరి తూర్పు సమితి లో తనకల్లు ఫిర్కా , కదిరి ఫిర్కా, ధనియాని చెరువు ఫిర్కా , తలుపులు ఫిర్కాఉండేవి.కదిరి తూర్పు సమితి కి 1959 లో దేశాయి రాజారెడ్డి మొట్టమొదటి అద్యక్షులు. కొంత కాలం తరువాత అవిశ్వాస తీర్మానం పెట్టి ఆయన స్థానంలో దేశాయి వెంకట శిద్దారెడ్డి అద్యక్షులు అయ్యారు. తర్వాత జూన్ 1964లో ఐ. బయారెడ్డి సమితి అధ్యక్షుడు. 1971 లో మూడో సారి జరిగిన ఎన్నికల్లో బి.ఏ. వెంకటరెడ్డి (పూల వెంకటరెడ్డి) సమితి అధ్యక్షులు గా ఎన్నికయ్యారు. 1976 నుంచి 1981 వరకు ప్రత్యేక అధికారి పాలనలో ఉంది. 1981 లో సమితి అధ్యక్షునికి నేరుగా ఎన్నికలు జరిగాయి. అప్పుడు దేశాయి రెడ్డప్పరెడ్డి సమితి అధ్యక్షుడు గా గెలిచారు. తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. దీంతో కదిరి తూర్పు సమితి కి మళ్లీ ఎన్నికలు జరిగాయి అప్పుడు నరసయ్య సమితి అధ్యక్షుడు గా గెలిచారు.
కదిరి పడమర సమితి లో గుంజేపల్లి ఫిర్కా , నల్లమాడ ఫిర్కా , మహ్మదాబాద్ ఫిర్కా, కదిరి ఫిర్కా లోని కొంతభాగం ఉండేది. కదిరి పడమర సమితి మొదటి అద్యక్షులు గా 1959లో దొరిగల్లు వెంకట రంగారెడ్డి ఎన్నికయ్యారు. తిరిగి రెండవసారి 1964 లో రెండవ సారి కూడ ఆయనే ఎన్నికైనారు. దీంతో రెండు పర్యాయాలు దొరిగల్లు వెంకట రంగారెడ్డి ఎన్నికయ్యారు. మూడవ సారి 1971 లో జరిగిన ఎన్నికల్లో యస్. వెంకటరెడ్డి సమితి అధ్యక్షులు గా ఎన్నికయ్యారు. 1981 లో సమితి అధ్యక్షుడు గా రామానాయక్ ఎన్నికైనారు. కదిరి తూర్పు , పడమర సమితి అధ్యక్షులు గా ఎన్నికైన వారిలో నరసయ్య మినహా మిగిలిన అందరూ కాంగ్రెస్ పార్టీ కి చెందిన వారు. నరసయ్య జనతాదళ్ కు చెందిన వారు. 1985లో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ యన్టీఆర్ సమితి వ్యవస్థను రద్దు చేశారు. 25 మే 1985 నుంచి పూర్వపు తాలుకాలు , ఫిర్కాల వ్యవస్థ ను రద్దు చేసి వాటి స్థానంలో మండలాలను ఏర్పాటు చేశారు.1987 లో మండల ప్రజా పరిషత్ లు, జిల్లా ప్రజా పరిషత్ లు గా పని చేయడం ప్రారంభించాయి. 1987 లో జిల్లా ప్రజా పరిషత్ కు , మండల ప్రజా పరిషత్ లకు నేరుగా ఎన్నికలు జరిగాయి. అప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లా కు జడ్పీ చైర్మన్ గా తెలుగు దేశం కు చెందిన లింగరాజు ఎన్నికయ్యారు. జిల్లా పరిషత్ లో మండలాద్యక్షులు సభ్యులు. వారిలో ఒకరిని జడ్పీ ఉపాద్యక్షులుగా ఎన్నుకొనేవారు. తలుపుల మండలాద్యక్షులు టి. కులశేఖర రెడ్డి అనంతపురం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు.1994 నుంచి కొత్త పంచాయతీరాజ్ చట్టం వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం, 1994 (యాక్ట్ 13 ఆఫ్1994)తో మండల, జిల్లా పరిషత్తుల వ్యవస్థకు కొత్త చట్టపరమైన రూపం ఏర్పడింది. జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌ను ప్రజలు నేరుగా కాకుండా, చట్టంలో పేర్కొన్న ఎన్నికైన జిల్లా పరిషత్ సభ్యులు తమలో నుంచి ఒకరిని చైర్మన్ గా ఇంకొకరిని వైస్ చైర్మన్ గా ఎన్నుకునే విధానం అమల్లోకి వచ్చింది.కదిరి తూర్పు, పడమర సమితి స్థానం లో 10 మండలాలు ఏర్పడ్డాయి. 1987లో మండల ప్రజా పరిషత్ కు నేరుగా ఎన్నికలు జరిగాయి. మండలాద్యక్షులు నేరుగా ప్రజలచే ఎన్నికయ్యారు. పంచాయతీ సర్పంచ్ లు మండల ప్రజా పరిషత్ లో సభ్యులు గా ఉండేవారు. మండల ఉపాధ్యక్షులు గా సర్పంచ్ లోనుంచి ఒకరిని ఎన్నుకొనేవారు.
1987 లో జరిగిన మండల ప్రజా పరిషత్ ఎన్నికలో నేరుగా ప్రజలు ఎన్నుకొన్న మండలాద్యక్షులుగా కదిరి రూరల్ మండలం లో జిగినేనాయక్ , గాండ్లపెంట లో ఓబుళ రెడ్డి , నంబులపూలకుంట లో జి. పుల్లారెడ్డి , తలుపులలో టి. కులశేఖర రెడ్డి , ముదిగుబ్బ లో దొరిగల్లు రాజారెడ్డి , నల్లమాడ లో నారాయణ నాయక్ ,అమడగూరు లో శ్రీనివాస రెడ్డి , ఓబుళదేవర చెరువు(ఓడిసి) లో బోయపాటి రామప్ప నాయుడు , తనకల్లు లో దేశాయి వెంకట రమణారెడ్డి , నల్లచెరువు లో చెవిటివారిపల్లి కి చెందిన మిట్టపల్లి లక్షిదేవమ్మ మండలాద్యక్షులుగాగెలిచారు. 1987 మార్చిలో 11, 14 తేదీల్లో రెండు విడతలుగా రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. 1992 ఏప్రిల్ నాటికి వీరి పదవీ కాలం పూర్తి అయింది. మూడేళ్ల పాటు స్పెషల్ ఆఫీసర్ పరిపాలన లో ఉంది.1994 లో పంచాయతీరాజ్ చట్టం మార్పులు ఫలితంగా మండలాద్యక్ష ఎన్నిక పరోక్ష పద్ధతికి మారింది. యం.పి.టి. సి మెంబర్, జెడ్.పి.టి.సి. మెంబర్ ఎన్నికలు ప్రారంభమైయ్యాయి. 1992 నుంచి 1995 వరకు ప్రత్యేక అధికారి పాలనలో ఉంది. 1995 మార్చి6న తిరిగి మండల పరిషత్ కు ఎన్నికలు జరిగాయి. 2001 జూలై 12, 15 తేదీల్లో మండల పరిషత్ (ఎం.పీ.టీ.సీ.), జిల్లా పరిషత్ (జెడ్.పీ.టీ.సీ.) ఎన్నికలు రెండు విడతల్లో జరిగాయి. 2001 జూలై 17న ఫలితాల ప్రకటన. 2001 జూలై 22, 23, మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికల సమావేశాలుజరిగాయి. 2001 తర్వాత 2006 జులై2న ఎన్నికలు జులై 4 ఓట్ల లెక్కింపు జరిగింది. వీరి పదవీ కాలం 2011 వాటికి పూర్తి కాగానే ప్రత్యేక అధికారి పాలనలో ఉంది. తర్వాత లో 2014లో మండల పరిషత్ (ఎం.పీ.టీ.సీ.), జిల్లా పరిషత్ (జెడ్.పీ.టీ.సీ.) ఎన్నికలు ఏప్రిల్ 6, 11 తేదీల్లో రెండు విడతలుగా జరిగాయి. ఏప్రిల్ 13, 2014న కౌంటింగ్ ఫలితాల ప్రకటన వెలువడింది. తర్వాత మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నికలు నిర్వహించారు. 2020లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై కోవిడ్ కారణంగా నిలిచిపోయింది. 2021 ఏప్రిల్8న పోలింగ్ జరిగినప్పటికీ, కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఓట్ల లెక్కింపు సెప్టెంబర్ వరకు వాయిదా పడింది. సెప్టెంబర్ 19న ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటన జరిగింది. 2021 సెప్టెంబర్ 24న మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక జరిగింది. 2026 సెప్టెంబర్ నాటికి పదవీకాలం ముగియడంతో ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్ పరిపాలన లో ఉంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. KadiriPolitics
నరసింహారెడ్డి చందమూరి.
ఫ్రీలాన్స్ జర్నలిస్టు.
కదిరి.


















