ఎనిమిదేళ్ల క్రితం సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన విశ్వనటుడు కమల్ హాసన్ చట్టసభలోకి అడుగుపెట్టాలనే కలను ఎట్టకేలకు నెరవేర్చుకున్నారు. శుక్రవారం ఆయన రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేశారు. తమిళనాడు నుంచి జూనులో రాజ్యసభకు ఎన్నికైన కమల్ హాసన్ తన మాతృ భాష తమిళంలో ప్రమాణం చేశారు. తమిళనాడులో ద్రావిడేతర రాజకీయాల కోసం సొంత పార్టీని స్థాపించిన కమల్ హాసన్ గత పార్లమెంటు ఎన్నికల్లో అధికార డీఎంకే మద్దతు ప్రకటించారు. ఫలితంగా ఆయనకు రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టారు.
మక్కల్ నీది మయ్యం (ఎంఐఎం) పార్టీని స్థాపించి తమిళ రాజకీయాల్లో సత్తా చాటాలని కమల్ హాసన్ భావించారు. కానీ, ఆయనకు ప్రజల నుంచి పెద్దగా మద్దతు లభించలేదు. దీంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ ఖాతా తెరవలేదు. అయినప్పటికీ గణనీయ సంఖ్యలో ఓట్లు సాధించింది ఎంఐఎం. దీంతో గత పార్లమెంటు ఎన్నికల ముందు కమల్ హాసన్ పార్టీని అధికార డీఎంకే పార్టీ తన కూటమిలో చేర్చుకుంది. తమిళనాడులో డీఎంకే, ఏఐడీఎంకే పార్టీలకు ప్రత్యామ్నాయంగా రాజకీయ పార్టీని స్థాపించిన కమల్ హాసన్ తన పంథాను మార్చుకుని అధికార పార్టీతో రాజీకి వచ్చారు. ఆ సమయంలో లోక్ సభ ఎన్నికల్లో టికెట్ లేదా రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇస్తామని డీఎంకే హామీ ఇచ్చింది.
అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి విముఖత వ్యక్తం చేసిన కమల్ హాసన్ రాజ్యసభకు ఎన్నికవడానికే ప్రాధాన్యమిచ్చారు. దీంతో గత నెలలో జరిగిన రాజ్యసభ ద్వైర్షిక ఎన్నికల్లో తమిళనాడు నుంచి ఆయనను డీఎంకే, కాంగ్రెస్ కూటమి ఎన్నుకుంది. దీంతో శుక్రవారం కొత్త సభ్యులతో కలిసి కమల్ హాసన్ ప్రమాణం చేశారు. జాతీయ ప్రయోజనాల కోసమే గత ఎన్నికల్లో పోటీ చేయలేదని చెప్పిన కమల్ హాసన్ ఎంపీగా జాతి ప్రయోజనాల కోసం పనిచేస్తానని ప్రతినబూనారు.
తమిళనాడు అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. దీంతో కమల్ హాసన్ ఎంపిక రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఏడాది ఆరంభం నుంచి కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్లే అంశంపై చర్చ జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం ఎంఎన్ఎం పార్టీ 8వ వార్షికోత్సవ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో తన రాజ్యసభ ఆరంగేట్రంపై ఆయన సంకేతాలిచ్చారు. తమ పార్టీ పార్లమెంటులో తన గొంతు వినిపిస్తుందని, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల తర్వాత తమ పార్టీ కార్యకర్తల గొంతు అసెంబ్లీ వినిపిస్తుందని అన్నారు. అంటే డీఎంకేతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పొత్తు ఉంటుందని, తమ పార్టీ నేతలు అసెంబ్లీకి పోటీ చేస్తారని కమల్ హాసన్ స్పష్టం చేశారు.