పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో రోజుకో సంచలనాత్మక విషయం బయటపడింది. పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) కోసం పనిచేస్తున్న అలీ హసన్ అనే ఏజెంట్‌తో జ్యోతి మల్హోత్రా జరిపిన వాట్సాప్ చాట్‌లు విస్తుపోయే నిజాలను వెల్లడిస్తున్నాయి. ఈ చాట్‌లలో ఆమె అలీ హసన్‌ను “నన్ను పాకిస్థాన్‌లో పెళ్లి చేసుకోండి” అని కోరినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వారిద్దరి మధ్య అనేక కోడెడ్ సంభాషణలు కూడా జరిగాయని దర్యాప్తు అధికారులు గుర్తించారు.
హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా (33) ‘ట్రావెల్ విత్ జో’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతోంది. ట్రావెల్ వ్లాగర్‌గా చెలామణి అవుతూ, భారత దేశంలోని కీలక ప్రాంతాలు, ముఖ్యంగా ఆలయాల వద్ద రెక్కీ నిర్వహించి, వాటి వివరాలను పాక్ ఇంటెలిజెన్స్ అధికారులకు చేరవేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె డైరీలో పాకిస్థాన్‌లో తన పది రోజుల పర్యటన విశేషాలను, అక్కడి ప్రజల ఆతిథ్యాన్ని పొగుడుతూ రాసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన వాట్సాప్ చాట్‌లు జ్యోతి మల్హోత్రాకు, ISI ఏజెంట్ అలీ హసన్‌కు మధ్య ఉన్న బంధాన్ని మరింత లోతుగా తెలియజేస్తున్నాయి. ఆమె కేవలం సమాచారాన్ని అందించడమే కాకుండా, వ్యక్తిగతంగా హసన్‌తో బలమైన భావోద్వేగ సంబంధాన్ని కలిగి ఉందని ఈ చాట్‌లు స్పష్టం చేస్తున్నాయి. “నన్ను పాకిస్థాన్‌లో పెళ్లి చేసుకోండి” అనే ఆమె అభ్యర్థన వారి మధ్య గూఢచర్యానికి మించి ఒక రకమైన ‘హనీ ట్రాప్’ వ్యూహం కూడా ఉండవచ్చని సూచిస్తుంది.
దర్యాప్తు అధికారులు జ్యోతి మల్హోత్రా మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకుని లోతుగా పరిశీలిస్తున్నారు. ఆమె ఐఎస్ఐ ఏజెంట్లతో ఎన్‌క్రిప్ట్ చేసిన ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కోడ్ భాషలో సంభాషణలు జరిపినట్లు తేలింది. ముఖ్యంగా, భారత అండర్‌కవర్ ఏజెంట్ల వివరాలు, వారి ఆపరేషన్ల గురించి అలీ హసన్ ఆమెను ప్రశ్నించినట్లు కొన్ని చాట్‌లలో గుర్తించారు. అటారీ సరిహద్దును సందర్శించినప్పుడు ప్రత్యేక ప్రోటోకాల్ ఉన్న అండర్‌కవర్ ఏజెంట్లను చూశావా అని హసన్ అడగగా, అలాంటిదేమీ లేదని జ్యోతి బదులిచ్చింది. “ఎవరు ప్రోటోకాల్ పొందుతున్నారో గమనించు… అండర్‌కవర్ ఏజెంట్లను గుర్తించడానికి అదే మార్గం” అని హసన్ సూచించినట్లు, దానికి జ్యోతి “వారంతా తెలివితక్కువ వాళ్లేం కాదు” అని సమాధానం ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. ఈ సంభాషణల ద్వారా జ్యోతి ఉద్దేశపూర్వకంగానే భారత నిఘా సమాచారాన్ని ISIకి అందించిందా లేదా ఆమెను మభ్యపెట్టి ఈ పనికి ఉపయోగించుకున్నారా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.
జ్యోతి మల్హోత్రాకు నాలుగు బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, దుబాయ్ నుంచి వాటిలో డబ్బు జమ అవుతోందని దర్యాప్తులో వెల్లడైంది. 2023లో బైశాఖి పండుగ సందర్భంగా ఆమె తొలిసారి పాకిస్థాన్‌లో పర్యటించింది. అక్కడే పాక్ హైకమిషన్ అధికారి డానిష్‌తో ఆమెకు పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. మొదట డానిష్‌తో ఎలాంటి సంబంధం లేదని బుకాయించినా, తర్వాత పొంతన లేని సమాధానాలు ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడికి ముందు ఆమె పహల్గాంను సందర్శించి వీడియోలు తీసినట్లు కూడా గుర్తించారు. భారతీయ అండర్‌కవర్ ఏజెంట్లను గుర్తించడానికి ISI ఆమెను ఉపయోగించుకుందని భావిస్తున్నారు. ఆమెతో పాటు ఈ కేసులో ఇప్పటికే పాకిస్థాన్‌కు గూఢచర్యం చేసిన ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా పాక్ నుంచి డబ్బులు తీసుకుని ఇక్కడి రహస్య సమాచారాన్ని, పోలీసులు, అధికారుల కదలికలను ఎప్పటికప్పుడు పాకిస్థాన్ నిఘా వర్గాలకు చేరవేస్తున్నట్లు గుర్తించారు.