నీటి పంపకంపై భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్‌కు మద్దతుగా చైనా భారత్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. భారత్‌లోకి బ్రహ్మపుత్ర నదీ ప్రవాహాన్ని చైనా అడ్డుకోగలదని సెంటర్ ఫర్ చైనా అండ్ గ్లోలైజేషన్ ఉపాధ్యక్షుడు విక్టర్ జికాయ్ గవో సోమవారం బీజింగ్‌లో ప్రకటించారు. పాకిస్థాన్‌తో సింధూ జలాల ఒప్పందంపై భారత్ వైఖరి పట్ల ఆయన ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇతరుల పట్ల తాము ఎలా వ్యవహరిస్తామో తమ పట్ల కూడా ఇతరులు అలాగే వ్యవహరిస్తారు అని గ్రహించాలని ఆయన పేర్కొన్నారు. చైనా మిత్రుడైన పాకిస్థాన్‌కు నీరు రాకుండా భారత్ అడ్డుకుంటే భారత్‌లోకి నీరు ప్రవహించకుండా చైనా కూడా అడ్డుకోగలదని ఆయన హెచ్చరించారు.
భారతదేశ జల భద్రతకు అత్యంత ముఖ్యమైనదైన బ్రహ్మపుత్ర నది నియంత్రణ తమ పరిధిలో ఉందని విక్టర్ గుర్తు చేశారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌పై చేపట్టిన ప్రతీకార చర్యలలో భాగంగా సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంపై విక్టర్ స్పందిస్తూ భారత్ నుంచి నదులు పాక్‌లోకి ఎలా ప్రవహిస్తాయో చైనా నుంచి కూడా నదులు భారత్‌లోకి ప్రవహిస్తాయని వ్యాఖ్యానించారు. సర్వ కాలాలలో తమకు అత్యంత ఆప్త మిత్రుడైన పాకిస్థాన్‌కు మద్దతుగా బ్రహ్మపుత్ర నదీ జలాలను భారత్‌పైకి అస్త్రంగా చైనా వాడుకుంటుందని ఆయన చెప్పారు. ఇతరులకు వ్యతిరేకంగా భారత్ చర్యలు తీసుకుంటే అందుకు వచ్చే ప్రతిస్పందనలకు కూడా భారత్ సిద్ధంగా ఉండాల్సి ఉంటుందని, ఆ ప్రతిస్పందనలు భారత్‌లో పెను సవాళ్లకు దారి తీయగలవని ఆయన హెచ్చరించారు.