భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకే కాదు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన జీవన విధానం మనది.. కుటుంబం మన జీవన విధానానికి మూలస్తంభం. భార్యాభర్తల బంధం కేవలం ఒక ఒప్పందం కాదు నమ్మకం, బాధ్యత, పరస్పర గౌరవం, త్యాగం, సహనంతో నిర్మితమైన జీవన యానం. మన పెద్దలు ఇల్లు నిలవాలంటే మనసులు కలవాలి అని చెప్పిన మాటలు తరతరాలకు మార్గదర్శకం.
భారతీయ కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శం అని ఒకప్పుడు గర్వంగా చెప్పుకునే వాళ్లం. భార్యాభర్తల అనుబంధం జన్మజన్మల బంధంగా భావించబడేది. విభేదాలు వచ్చినా పెద్దల సలహాతో, సంభాషణతో, రాజీతో కుటుంబాలు నిలిచేవి
ఒకప్పుడు కుటుంబం అంటే భద్రత. వివాహం అంటే విశ్వాసం. భార్యాభర్తల బంధం అంటే జీవితాంతం ఒకరికి ఒకరు అండగా నిలిచే పవిత్ర బాధ్యత. కానీ ఇప్పుడు అదే బంధం అనుమానాల కత్తిపై నడుస్తోంది. ప్రేమకు బదులు మోహం, సంభాషణకు బదులు కుట్ర, రాజీకి బదులు ప్రతీకారం, విడాకులకు బదులు హత్య అనే ప్రమాదకరమైన మనస్తత్వం సమాజంలో పెరుగుతున్నట్లు వరుస సంఘటనలు చెబుతున్నాయి.
కాలం మారింది. జీవనశైలి మారింది. ఆలోచనలు మారాయి. మార్పు సహజమే. కానీ ఆ మార్పు మనుషుల మధ్య ప్రేమను, నమ్మకాన్ని, బాధ్యతను దూరం చేస్తే ఆ మార్పు అభివృద్ధి కాదు, ఆందోళన.
ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా వెలుగులోకి వస్తున్న కొన్ని హత్య కేసులు సమాజాన్ని కలవరపెడుతున్నాయి.
వివాహేతర సంబంధాలు, అనుమానాలు, ఆర్థిక విభేదాలు, అహం, ప్రతీకారం వంటి కారణాలతో జీవిత భాగస్వామినే హత్య చేయడం, ప్రియుడు లేదా ఇతరుల సహాయంతో కుట్రలు పన్నడం, ఆ తర్వాత ప్రమాదంగా లేదా అదృశ్యమైనట్లుగా నాటకం ఆడడం వంటి ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి.
జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేసిన వ్యక్తినే తొలగించాలని కుట్రలు పన్నడం, ప్రియుడితో లేదా ఇతరులతో కలిసి హత్యలకు పాల్పడటం, ఆ తర్వాత ప్రమాదంగా లేదా ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నాలు పెరుగుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.
తాజాగా జూన్ నెలలో చిత్తూరు జిల్లా మదనపల్లె సమీపంలోని నారమాకుల తాండాలో జరిగిన ఘటన ఇందుకు మరో విషాద ఉదాహరణ. రైతు చిన్నబుడ్డన్న నాయక్ కుటుంబాన్ని పోషిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య ఆశా కార్యకర్తగా పనిచేస్తోంది. ఈ సమయంలో ఆమెకు గ్రామానికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. విషయం భర్తకు తెలియడంతో తరచూ గొడవలు జరిగాయి. చివరకు నిద్రలో ఉన్న భర్తపై రుబ్బురోలుతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. భర్తను కోల్పోయిన కుటుంబం మాత్రమే కాదు, ముగ్గురు చిన్నారుల భవిష్యత్తు కూడా అనిశ్చితిలో పడింది.
తెలంగాణలోని నల్గొండలో 2024లో జరిగిన ఒక కేసులోవనం ఈశ్వర్ ను భార్య నవ్య, ప్రియుడు సతీష్‌తో పాటు మరో ముగ్గురు కలిసి వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి కారులో తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేశారు.
పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు.
ఏప్రిల్ 2025లో రంగారెడ్డి జిల్లాలో భార్య మౌనిక, ప్రియుడు అశోక్ ల వివాహేతర సంబంధం బయటపడుతుందనే భయంతో హత్యకు ప్లాన్ చేశారు.ఎరుకల యాదయ్యకు మద్యం తాగించి గొంతు కోసి, అనంతరం శవాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు. తర్వాత భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసి పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని పోలీసులు వెల్లడించారు.
కర్నూలు జిల్లా గద్వాల కేసు (జూన్ 2025) లో గంటి తేజేశ్వర్ ను
భార్య ఐశ్వర్య, ఆమె ప్రియుడు తిరుమలరావు, తో సహా మొత్తం ఎనిమిది మంది కలిసి హత్య చేశారు. పెళ్లికి ముందే ప్రేమ సంబంధం ఉండటంతో భర్తను తొలగించాలని కుట్ర పన్నారు. భర్త బైక్‌కు జిపియస్ ట్రాకర్ అమర్చారు. కిరాయి హంతకులను ఉపయోగించారు. పెళ్లై నెల రోజుల్లోనే హత్య చేయించారని ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని పోలీసులు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలో 2025లో నల్లి రాజును
భార్య మౌనిక, ప్రియుడు ఉదయ్ కుమార్, మరో సహచరుడు కలిసి హత్య చేశారు. ప్రియుడిని వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో భర్తను హత్య చేయాలని నిర్ణయించారు. రెండు రోజుల పాటు నిద్రమాత్రలు ఇచ్చారు. స్పృహ కోల్పోయిన తర్వాత దిండుతో ఊపిరాడకుండా చేసి చంపారు. అనంతరం శవాన్ని పడేసి, కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో నిజం బయటపడటంతో ముగ్గురినీ అరెస్ట్ చేశారు.
ఇటీవల మహారాష్ట్రలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం లోహగఢ్ కోట వద్ద జరిగిన యువ వ్యాపారవేత్త కేతన్ విశాల్ అగర్వాల్ మృతి కేసు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. తొలుత అది ప్రమాదమని భావించారు. కానీ దర్యాప్తులో కాబోయే భార్య సియా గోయల్ ముందుగానే ప్రణాళిక వేసి హత్య చేసినట్లు పోలీసులు ఆరోపించారు. అంతేకాదు, ఘటనకు నాలుగు రోజుల ముందే అదే ప్రాంతంలో హత్యాయత్నం చేసినట్లు కూడా దర్యాప్తులో వెలుగులోకి రావడం మరింత కలచివేసింది. ప్రేమ, పెళ్లి, భవిష్యత్తు అనే కలలతో వెళ్లిన యువకుడు ప్రాణాలు కోల్పోవడం ఎన్నో ప్రశ్నలను మిగిల్చింది.
ఈ కేసులన్నింటిలోనూ కాల్ డేటా, సీసీటీవీ దృశ్యాలు, మొబైల్ లొకేషన్, ఇతర శాస్త్రీయ ఆధారాలు కీలక పాత్ర పోషించాయి. ఈ ఘటనలు ఒక్క కుటుంబానివి కావు. ఇవి కేసులు మాత్రమే కాదు .
ఇవి కేవలం పోలీసు కేసులు కావు. సమాజం ముఖంపై పడుతున్న గట్టి చెంపదెబ్బలు. కుటుంబ వ్యవస్థలో పెరుగుతున్న నైతిక సంక్షోభానికి అద్దం పట్టే సంఘటనలు. సమాజానికి వినిపిస్తున్న హెచ్చరికలు. వివాహేతర సంబంధాలు, అనుమానాలు, అహం, ఆవేశం, ప్రతీకారం ఇవి కలిసి మనిషిని ఎంతటి ఘోర నిర్ణయానికైనా నెట్టివేస్తున్నాయనే వాస్తవాన్ని ఈ సంఘటనలు గుర్తు చేస్తున్నాయి.దాంపత్య జీవితం అంటే ఇద్దరు వ్యక్తుల ప్రయాణం మాత్రమే కాదు రెండు కుటుంబాల విశ్వాసం .
దాంపత్య జీవితంలో విభేదాలు కొత్తవి కావు. ప్రతి కుటుంబంలో అభిప్రాయ భేదాలు ఉంటాయి. కానీ ఒకప్పుడు పెద్దల సలహా, పరస్పర సంభాషణ, రాజీ, సహనం సమస్యలను పరిష్కరించేవి. ఇప్పుడు అదే స్థానాన్ని ఆవేశం, అనుమానం, అసహనం ఆక్రమిస్తున్నాయి. సమస్యను ఎదుర్కొనే బదులు, మనిషినే తొలగించాలని భావించే ప్రమాదకర ధోరణి పెరుగుతోంది.
గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే హత్యతో సమస్య ముగియదు. అక్కడి నుంచే మరో విషాదం మొదలవుతుంది. ఒక కుటుంబం ఆధారాన్ని కోల్పోతుంది. పిల్లలు తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోతారు; మరోకరు జైలు పాలవుతారు. వృద్ధ తల్లిదండ్రులు జీవితాంతం కన్నీళ్లతో మిగిలిపోతారు. చివరికి నాశనం అయ్యేది ఒక వ్యక్తి కాదు, తరాల భవిష్యత్తు.
ఇది మహిళల గురించి మాత్రమే కాదు, పురుషుల గురించి మాత్రమే కాదు. నేరం చేసిన వ్యక్తి ఎవరైనా చట్టం ముందు సమానమే. కానీ సమాజం ముందు నిలిచే ప్రశ్న ఒక్కటే మన బంధాలు ఎందుకు ఇంత బలహీనమవుతున్నాయి?
బాధితుడు ఎవరైనా, కోల్పోయేది ఒక ప్రాణమే కాదు ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు. విభేదాలు వస్తే చట్టబద్ధమైన మార్గాలు ఉన్నాయి. కౌన్సెలింగ్ ఉంది. కుటుంబ పెద్దల మధ్యవర్తిత్వం ఉంది. అవసరమైతే విడాకుల ప్రక్రియ కూడా ఉంది. కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఎప్పటికీ పరిష్కారం కాదు.
సమాజం సంచలన వార్తలను చదివి మరచిపోకూడదు. వాటి వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకుని, కుటుంబాల్లో సంభాషణను పెంచాలి. పిల్లలకు చిన్నప్పటి నుంచే విలువలు, భావోద్వేగ నియంత్రణ, పరస్పర గౌరవం నేర్పాలి. కుటుంబం బలంగా ఉంటే సమాజం బలంగా ఉంటుంది.
వైవాహిక జీవితాన్ని దాటి భావోద్వేగాల కోసం ఎందుకు వెతుకుతున్నారు? ఆ భావోద్వేగాల పేరుతో హత్యల వరకు వెళ్లడం దేనికి సంకేతం? ఈ ప్రశ్నలకు ఏ ఆల్గరిథం సమాధానం చెప్పలేదు. ఏ సాంకేతిక పరిజ్ఞానం వాటిని ఆపలేదు. ఏ కృత్రిమ మేధస్సు కూడా ఇలాంటి విషాదాలను నివారించలేకపోయింది.
ఎందుకంటే ఇది సాంకేతిక సమస్య కాదు; ఇది మానవ సంబంధాలు, విలువలు, బాధ్యత, నైతికత, కుటుంబ వ్యవస్థ, సమాజపు సంస్కృతికి సంబంధించిన ప్రశ్న.
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది సమాజమే. భావోద్వేగాలను అర్థం చేసుకునే సంభాషణలు, పరస్పర గౌరవం, బాధ్యతాయుతమైన నిర్ణయాలు, మానవీయ విలువలను బలపరిచే సామాజిక వాతావరణమే ఇలాంటి విషాదాలను తగ్గించే నిజమైన మార్గం.
బంధాలు నిలిస్తేనే కుటుంబం నిలుస్తుంది. కుటుంబం నిలిస్తేనే సంస్కృతి నిలుస్తుంది. ప్రాణాలను తీసే నిర్ణయాల కంటే, మనసులను కలిపే నిర్ణయాలే ఈ సమాజానికి అవసరం. మన పిల్లలకు ఉన్నత విద్యతో పాటు ఉన్నత విలువలు కూడా నేర్పాలి. దాంపత్యంలో గౌరవం, సంభాషణ, సహనం, బాధ్యత ఎంత ముఖ్యమో కుటుంబాలు గుర్తించాలి. సామాజిక మాధ్యమాల ప్రభావం, తక్షణ కోరికలు, ఆవేశపూరిత నిర్ణయాలు జీవితాలను నాశనం చేస్తున్నాయని అర్థం చేసుకోవాలి.
ప్రేమ పేరుతో ప్రాణాలు తీయడం ప్రేమ కాదు. అది నేరం. నమ్మకాన్ని హత్య చేయడం విజయం కాదు . అది జీవితాంతం వెంటాడే శిక్ష. కుటుంబాన్ని కాపాడే నిర్ణయమే ధైర్యం. విభేదాలను చట్టబద్ధంగా పరిష్కరించడమే నాగరికత. బంధాలను నిలబెట్టే విలువలే భారతీయ సంస్కృతికి అసలైన గుర్తింపు. వాటిని కాపాడుకోవడం ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి, ప్రతి తరం బాధ్యత.
చందమూరి నరసింహరెడ్డి
ఫ్రీలాన్స్ జర్నలిస్టు.
కదిరి.


















