భారత రాజ్యాంగ పదవుల ఎంపిక గతంలో కొంత రాజకీయానికి దూరంగా ఉండేది. రాను రానూ ఇది రాజకీయ పోటీగా మారుతోంది. రాజ్యాంగ పదవులు అయిన రాష్ట్రపతి ఉప రాష్ట్రపతి వంటి వాటిని నిజానికి ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి. అలా అందరూ కూర్చుని ఆమోదయోగ్యమైన వారికి ఆ అత్యున్నత పీఠం అందించాలి. కానీ వర్తమాన రాజకీయాలు చూస్తే కనుక ఆ విధంగా జరిగే అవకాశాలు ఎంతమాత్రం లేదు అన్నది స్పష్టం. అందుకే పోటీ జరుగుతోంది ఇది సిద్ధాంతాల మధ్య పోటీగా చెబుతున్నా వెనక రాజకీయ రాద్ధాంతాలు కూడా కలగలసి ఉన్నాయన్నది వాస్తవం.
భారత రాష్ట్రపతి ఉప రాష్ట్రపతి రెండూ పరోక్ష ఎన్నికలే. అంటే ప్రజలు తాము గెలిపించిన ప్రజా ప్రతినిధులు వారిని ఎన్నుకుంటారు అన్న మాట. ఉప రాష్ట్రపతి విషయానికి వస్తే లోక్ సభ రాజ్యసభ ఎంపీలు ఎన్నుకుంటారు. ఇందులో నామినేటెడ్ ఎంపీలకు కూడా ఓటు చాన్స్ ఉంటుంది. అలా చూస్తే కనుక లోక్ సభలో 542 మంది రాజ్యసభలో 240 మంది ఎంపీలు కలిపితే మొత్తం 782 మంది ఎంపీలు ఉప రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. సగానికి కంటే ఎక్కువ ఓట్లు సంపాదించుకున్న వారు ఉప రాష్ట్రపతిగా నెగ్గినట్లు. అంతే కాదు ఆ రోజు ఓటింగుకు హాజరై ఓట్లు వేసిన వారిలో సగం పైగా ఏ అభ్యర్థికి వస్తాయో వారికే పీఠం దక్కుతుంది
ఈ లెక్కలు అన్నీ చూసుకున్నపుడు ఎన్డీయేదే పైచేయిగా ఉంటుంది అన్నది వాస్తవం. ఎన్డీయేకు లోక్ సభలో 293 మంది, రాజ్యసభలో 129 మంది ఎంపీల మద్దతు ఉంది. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 394 ఉంది. అంటే ఈ లెక్కన ఎన్డీయేకు 422 మంది ఎంపీల సాలిడ్ మద్దతు ఉన్నట్లే. ఇక ఇండియా కూటమికి లోక్ సభ ప్లస్ రాజ్యసభ కలిపితే దాదాపుగా మూడు వందల మంది దాకా ఎంపీల మద్దతు ఉంది. ఈ రెండు పార్టీలు కాకుండా మిగిలిన వారు న్యూట్రల్ ఎంపీలు వారు అరవై మంది దాకా ఉంటారు. ఇక వారి ఓట్లు ప్లస్ ప్రత్యర్ధి శిబిరం నుంచి ఓట్లు కనుక దక్కితే ఫలితం సంచలనం అవుతుందని ఇండియా కూటమి ఆశ.
ఇక ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో విప్ జారీ చేయడం ఉండదు. అంటే ఎంపీలను ఆయా పార్టీలు తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయమని విప్ ద్వారా శాసించలేవు. ఎవరికి నచ్చినట్లుగా వారు వేసుకునే వీలు ఉంది. అయితే అధికారికంగా విప్ జారీ చేయకపోయినా అనధికారికంగా ఆయా పార్టీలు తన ఎంపీల ఓట్లు జారీ పోకుండా చర్యలు తీసుకుంటాయి. దాంతో పార్టీ గీత దాటి ఓటు వేసే వారు బహు తక్కువ. మరో వైపు చూస్తే ఇది సిద్ధాంతపరమైన పోరుగా ఇండియా కూటమి అభి వర్ణిస్తోంది. రాజ్యాంగ వ్యవస్థలను రక్షించుకుంటామని చెబుతోంది.
ఒక వైపు రాజ్యాంగ వ్యవస్థల మీద దాడులు అని ఇండియా కూటమి ప్రచారం చేస్తోంది. విపక్షాలు రాజకీయం అని బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే అంటోంది దాంతో ఈ ఎన్నిక ఉత్కంఠతో కూడుకున్నదిగా మారుతోంది. ఇంకో వైపు చూస్తే ఈ ఎన్నికల్లో గెలిచి రాజ్యసభలో తమ ఆధిపత్యం చూపించాలని ఇండియా కూటమి భావిస్తోంది. తమ పోరాటానికి ఎన్డీయే కూటమి నుంచి సైతం మద్దతు దక్కుతుందని ఆశిస్తోంది.
ఇక ఈ ఎన్నికల్లో న్యూట్రల్ పార్టీలే కీలకంగా మారబోతున్నాయి. ఏపీ నుంచి వైసీపీ తెలంగాణా నుంచి బీఆర్ఎస్ ఒడిషా నుంచి బీజేడీ, యూపీ నుంచి బీఎస్పీ, ఢిల్లీ నుంచి ఆప్ లాంటి పార్టీలు ఏ కూటమిలో లేవు. వీటి ఓట్లే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో అత్యంత కీలకం అవుతాయని అంటున్నారు. ఇలా హోరా హోరీ పోటీ ఎవరికి వారుగా వ్యూహాలతో ముందుకు సాగుతున్న నేపథ్యం ఉంది. మొత్తం మీద చూస్తే ఎండీయే కూటమికి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో సులువుగా విజయం దక్కించకూడదు అన్న ఇండియా కూటమి వ్యూహాలు అయితే పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో కొత్త ఉప రాష్ట్రపతిగా ఎవరు కొలువు తీరుతారు.