వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బుధవారం విజయవాడ సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. ఫిబ్రవరి 16న అరెస్టైన వంశీ.. సుమారు 140 రోజులుగా జైల్లోనే ఉన్నారు. ఇప్పటి వరకూ ఆయనపై 11 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో తాజాగా అన్ని కేసుల్లోనూ బెయిల్ రావడంతో జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ సమయంలో వైసీపీ ఘన స్వాగతం పలికింది!
అవును… నకిలీ ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ మంజూరు కావడంతో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విజయవాడ సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన.. మీడియాతో మాట్లాడకుండా కారు ఎక్కి వెళ్లిపోయారు. ఈ సమయంలో వంశీ కోసం… ఆయన భార్య, మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ జైలు వద్దకు వచ్చారు.
ఈ సమయంలో… స్థానిక వైసీపీ నాయకత్వం వంశీకి స్వాగతం పలికింది. ఇందులో భాగంగా… విజయవాడ జైలు నుండి అతని వరకూ ఓ భారీ కాన్వాయ్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భారీగా పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్లపై హల్ చల్ చేశాయి. ఈ సమయలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి!
రాజకీయాలకు బై బై చెప్పబోతున్నారా?:
సుమారు 137 రోజుల పాటు జైల్లో మగ్గిన మాజీ ఎమ్మెల్యే వంశీ గురించిన ఓ ఆసక్తికర విషయం గన్నవరం నియోజకవర్గం నుంచి వినిపిస్తుంది! ఇందులో భాగంగా… గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో పాటు, సుమారు 11 కేసులు మీద ఉన్న నేపథ్యంలో.. వైసీపీని వదిలి, రాజకీయాలకు శాశ్వతంగా దూరం కావాలన్ని వంశీ భావిస్తున్నారనే ప్రచారం మొదలైంది.
ఈ సందర్భంగా విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని సహా పలువురు ఈ సమయంలో వంశీకి పరోక్షంగా ఆదర్శంగా మారుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి కొన్ని రోజులు కాస్త ఆరోగ్యం కుదుటి పడిన తర్వాత తన రాజకీయ భవిష్యత్తుపై వంశీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి.
వంశీ కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నిర్దేశం!:
వల్లభనేని వంశీపై నమోదైన అక్రమ మైనింగ్ కేసులో ముందస్తు బెయిల్ మంజూరుచేస్తూ ఏపీ హైకోర్టు మే 29న ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో… ఈ ఉత్తర్వ్యులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్.ఎల్.పీ. దఖలు చేసింది. దీనిపై బుధవారం జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ వినోద్ చంద్రన్ లతో కూడిన ధర్మాసనం విచారించింది.
ఈ సందర్భంగా… ఈ కేసులో ఇప్పటివరకూ నిర్వహించిన దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్ లో సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.