ఉద్ధవ్ వర్సెస్ షిండే: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక ఘట్టం
శివసేనలో మరో చీలిక?.. ఉద్ధవ్ వర్గానికి లోక్‌సభలో భారీ ఎదురుదెబ్బ
‘ఆపరేషన్ టైగర్’ సక్సెస్ అవుతుందా?.. ఉద్ధవ్ శిబిరంలో కలకలం
ఉద్ధవ్ ఠాక్రేకు కొత్త రాజకీయ సంక్షోభం.. 9 నుంచి 3కి పడిపోతుందా బలం?
పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి ఎదురవుతున్న రాజకీయ సవాళ్లు ఇంకా చర్చనీయాంశంగా కొనసాగుతుండగానే, దేశ రాజకీయాల దృష్టి ఇప్పుడు మహారాష్ట్ర వైపు మళ్లింది. 2022లో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో జరిగిన ఎమ్మెల్యేల తిరుగుబాటుతో తీవ్రంగా దెబ్బతిన్న ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి ఇప్పుడు మరో రాజకీయ ప్రకంపనం తాకింది. ఈసారి లక్ష్యం శాసనసభ కాదు… లోక్‌సభ. శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే)కు చెందిన ఎంపీల్లో మెజారిటీ వర్గం విడిపోయేందుకు సిద్ధమవుతుండటం మహారాష్ట్ర రాజకీయాలను మరోసారి వేడెక్కిస్తోంది.
శివసేన (యుబిటి)కి ప్రస్తుతం లోక్‌సభలో 9 మంది ఎంపీలు ఉన్నారు. వారిలో ఆరుగురు ఎంపీలు ప్రత్యేక పార్లమెంటరీ గ్రూప్‌గా గుర్తింపు ఇవ్వాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ అందజేసినట్లు వార్తలు వెలువడ్డాయి. తిరుగుబాటు శిబిరంలో ఉన్నవారిగా పేర్కొంటున్న ఎంపీలు:
1. సంజయ్ జాధవ్ (పర్భణి)
2. భౌసాహెబ్ వాక్చౌరే (షిర్డీ)
3. సంజయ్ దేశ్‌ముఖ్ (యవత్మాల్)
4. నాగేశ్ పాటిల్ అష్టీకర్ (హింగోలి)
5. ఓంరాజే నింబాల్కర్ (ధారాశివ్)
6. సంజయ్ దినా పాటిల్ (ముంబై నార్త్ ఈస్ట్)
అయితే ఓంరాజే నింబాల్కర్, సంజయ్ దినా పాటిల్‌లు తాము అధికారికంగా షిండే శిబిరంలో చేరుతున్నామని ఇప్పటివరకు ప్రకటించలేదు. అయినప్పటికీ, ప్రత్యేక గ్రూప్ ఏర్పాటుకు సంబంధించిన ప్రయత్నాలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో శివసేన (యుబిటి) నేతలు సంజయ్ రౌత్, అరవింద్ సావంత్, అనిల్ దేశాయ్‌లు స్పీకర్ ఓం బిర్లాను కలిసి తిరుగుబాటు ఎంపీలకు ప్రత్యేక గ్రూప్ హోదా కల్పించవద్దని విజ్ఞప్తి చేశారు. అసలు శివసేన తమదేనని, పార్టీ పేరు, గుర్తు, వారసత్వానికి సంబంధించిన పలు అంశాలు ఇంకా న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్నాయని వారు స్పష్టం చేశారు.
గత కొన్ని వారాలుగా మహారాష్ట్ర రాజకీయాల్లో “ఆపరేషన్ టైగర్” అనే పదం విస్తృతంగా వినిపిస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఎంపీలు, నేతలను ఏక్‌నాథ్ షిండే శిబిరంలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం సాగింది. జూన్ 19న జరగనున్న శివసేన 60వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ ఎంపీలు అధికారికంగా షిండే వర్గంలో చేరవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
స్పీకర్‌కు లేఖ అందజేయడం ద్వారా ఆ ప్రచారానికి బలం చేకూరినట్లైంది. ఈ పరిణామం పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చితే ఉద్ధవ్ వర్గం లోక్‌సభ బలం 9 నుంచి కేవలం 3 స్థానాలకు పడిపోవచ్చు. అదే సమయంలో షిండే నేతృత్వంలోని శివసేన బలం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. దీంతో ఎన్డీఏ కూటమి పార్లమెంటులో మరింత బలపడటమే కాకుండా, మహారాష్ట్రలో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలే పరిస్థితి ఏర్పడుతుంది.
ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత ముఖ్యమైన అంశం భారత రాజ్యాంగంలోని ఫిరాయింపుల నిరోధక చట్టం. ఒక శాసన పక్షంలోని కనీసం మూడింట రెండు వంతుల సభ్యులు కలిసి విడిపోతే వారికి అనర్హత వర్తించదు. ప్రస్తుతం 9 మంది ఎంపీలలో 6 మంది కలిసి వేరుపడితే అది రెండు మూడవ వంతు సంఖ్యకు సమానం అవుతుంది. అందుకే ఈ సంఖ్య రాజకీయంగా మాత్రమే కాకుండా చట్టపరంగా కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ పరిణామాలను అర్థం చేసుకోవాలంటే 2022లో జరిగిన శివసేన చీలికను గుర్తు చేసుకోవాల్సిందే. 1966లో బాల్ ఠాక్రే స్థాపించిన శివసేన మరాఠీ అస్మితకు ప్రతీకగా ప్రారంభమై, తరువాత హిందుత్వ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగింది. బీజేపీతో దశాబ్దాల పాటు మైత్రిని కొనసాగించిన ఈ పార్టీ, బాల్ ఠాక్రే మరణానంతరం ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలో కొనసాగింది.
2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవి వివాదంతో బీజేపీతో విభేదించిన ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్ మరియు ఎన్‌సీపీతో కలిసి మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇదే నిర్ణయం పార్టీలో అంతర్గత అసంతృప్తికి దారితీసింది.
2022 జూన్‌లో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో పెద్దఎత్తున ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి వేరు శిబిరం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్, ఎన్‌సీపీతో పొత్తు పార్టీ అసలు సిద్ధాంతాలకు విరుద్ధమని వాదించిన షిండే వర్గం చివరకు ఉద్ధవ్ ప్రభుత్వాన్ని కూల్చి, బీజేపీ మద్దతుతో అధికారంలోకి వచ్చింది.
చీలిక అనంతరం ఎన్నికల సంఘం 2023 ఫిబ్రవరిలో కీలక నిర్ణయం తీసుకుంది. శాసనసభ, పార్లమెంటరీ బలం ఎక్కువగా ఉన్న షిండే వర్గానికే అసలు “శివసేన” పేరు, చారిత్రాత్మక “ధనుస్సు–బాణం” గుర్తు కేటాయించింది. ఉద్ధవ్ వర్గం మాత్రం “శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే)” పేరుతో “మషాల్” గుర్తును కొనసాగిస్తోంది.
అప్పటి నుంచి రెండు వర్గాల మధ్య బాల్ ఠాక్రే రాజకీయ వారసత్వంపై పోరు కొనసాగుతూనే ఉంది. ఒకవైపు అసలు శివసేన తామేనని షిండే వర్గం వాదిస్తుండగా, మరోవైపు బాల్ ఠాక్రే ఆలోచనలను తామే కాపాడుతున్నామని ఉద్ధవ్ వర్గం చెబుతోంది.
2022లో ఎమ్మెల్యేల తిరుగుబాటు ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని కూల్చివేసింది. ఇప్పుడు ఎంపీల స్థాయిలో జరుగుతున్న ఈ పరిణామం ఆయన రాజకీయ నాయకత్వానికి మరో పెద్ద పరీక్షగా మారింది. ఇప్పటికే పార్టీ పేరు, గుర్తు, అధికారాన్ని కోల్పోయిన ఉద్ధవ్ వర్గం ఇప్పుడు పార్లమెంటరీ బలాన్నీ కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటోంది.
అయితే ఇంకా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. స్పీకర్ ఈ గ్రూప్‌కు పూర్తి గుర్తింపు ఇస్తారా? తిరుగుబాటు శిబిరంలోని కొందరు ఎంపీలు చివరి నిమిషంలో వెనక్కి తగ్గుతారా? లేక ఈ గ్రూప్ నేరుగా షిండే శివసేనలో విలీనం అవుతుందా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
శివసేన చరిత్రలో 2022 చీలిక ఒక సాధారణ అంతర్గత విభేదం కాదు; అది మహారాష్ట్ర రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చిన మలుపు. ఇప్పుడు ఎంపీల స్థాయిలో కనిపిస్తున్న ఈ తాజా పరిణామాలు ఆ మార్పులను మరింత లోతుగా తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. దాదాపు ‘ఆపరేషన్ టైగర్’ నిజంగా విజయవంతమేనట్టుగానే చూడాల్సిందే .అది కేవలం ఉద్ధవ్ ఠాక్రేకు మరో రాజకీయ దెబ్బ మాత్రమే కాదు మహారాష్ట్రలో ప్రతిపక్ష రాజకీయాల భవిష్యత్ దిశను కూడా ప్రభావితం చేసే కీలక ఘట్టం .ఉద్ధవ్ ఠాక్రే రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.
చందమూరి నరసింహరెడ్డి
ఫ్రీలాన్స్ జర్నలిస్టు ✒️
కదిరి


















