మమతా తర్వాత ఎవరు? టీఎంసీలో వారసత్వ పోరు తెరపైకి
అధికారం కోల్పోయిన తర్వాత టీఎంసీకి అంతర్గత తుఫాన్
టీఎంసీ విభజన నిజమవుతుందా? బెంగాల్ రాజకీయాల్లో అనిశ్చితి
‘దీదీ’ ఆధిపత్యానికి సవాలా? టీఎంసీలో పెరుగుతున్న అసమ్మతి
ఒకప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీ పేరు చెప్పగానే ప్రత్యర్థి పార్టీల్లో వణుకు పుట్టేది. పార్టీ నాయకత్వం, ఎన్నికల వ్యూహం, ప్రభుత్వ నిర్ణయాలు, కేడర్ నియంత్రణ అన్నీ ఆమె చుట్టూనే తిరిగేవి. “దీదీ” మాటే తుది నిర్ణయంగా భావించే పరిస్థితి ఉండేది. కానీ రాజకీయాల్లో శాశ్వత విజయాలు, శాశ్వత పరాజయాలు ఉండవని మరోసారి నిరూపితమవుతోంది. ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో నెలకొన్న పరిణామాలు మమతా బెనర్జీ నాయకత్వానికి అతిపెద్ద సవాలుగా మారుతున్నాయి.
టీఎంసీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత పార్టీ అంతర్గత అసమ్మతి ఒక్కసారిగా బయటపడింది. చాలా కాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి ఒక్క సారిగా భగ్గుమంది . ఇప్పుడు బహిరంగ తిరుగుబాటుగా మారింది. పార్టీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు బహిరంగంగా నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మమతా బెనర్జీ తర్వాత పార్టీ వారసత్వం, నిర్ణయాధికార కేంద్రీకరణ, అభిషేక్ బెనర్జీ పెరుగుతున్న ప్రభావం వంటి అంశాలు వివాదాలకు కేంద్రబిందువుగా మారాయి.
ఇటీవల టీఎంసీకి చెందిన 20 మంది తిరుగుబాటు లోక్‌సభ సభ్యులు తమను ఎన్సీపీఐ (నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా )లో విలీనం చేసుకున్నట్లు ప్రకటించడం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అంతేకాకుండా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని కూడా ప్రకటించారు.
అయితే ఈ విలీనాన్ని చట్టపరంగా గుర్తించాల్సిన ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. టీఎంసీ నాయకత్వం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది చట్టబద్ధమైన విలీనం కాదని వాదిస్తోంది. తుది నిర్ణయం లోక్‌సభ స్పీకర్ మరియు పార్లమెంటరీ విధానాల ఆధారంగా తీసుకోబడాల్సి ఉంది.
అయినప్పటికీ రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం పార్టీకి చెందిన రెండు మూడవ వంతు (2/3) సభ్యుల మద్దతు ఉంటే విలీన ప్రక్రియకు చట్టపరమైన బలం లభించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా తిరుగుబాటు వర్గం కేంద్రంలోని అధికార కూటమికి మద్దతు ప్రకటించడం కూడా రాజకీయ సమీకరణాల్లో కీలక అంశంగా పరిగణించబడుతోంది.
తిరుగుబాటు శిబిరంలో ఉన్నట్లు వార్తల్లో వచ్చిన 20 మంది ఎంపీల వివరాలిలా ఉన్నాయి.
1. శత్రుఘ్న సిన్హా
2. కాకోలీ ఘోష్ దస్తిదార్
3. జగదీశ్ చంద్ర బసునియా
4. ఖలీలూర్ రెహ్మాన్
5. యూసుఫ్ పఠాన్
6. అబూ తాహెర్ ఖాన్
7. పార్థ భౌమిక్
8. బాపి హల్దార్
9. సాయోని ఘోష్
10. మాలా రాయ్
11. మితాలి బాగ్
12. దీపక్ అధికారి (దేవ్)
13. కాలీపద్ సోరెన్
14. జూన్ మాలియా
15. అరూప్ చక్రవర్తి
16. శర్మిలా సర్కార్
17. అసిత్ కుమార్ మాల్
18. శతాబ్దీ రాయ్
19. రచనా బెనర్జీ
20. ప్రసూన్ బెనర్జీ
ఈ పేర్లు తిరుగుబాటు వర్గం సమర్పించిన పత్రాల్లో ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ జాబితాలోని కొందరు సభ్యులు ఇంకా తమతోనే ఉన్నారని టీఎంసీ అధికారిక వర్గం చెబుతోంది. అందువల్ల ఈ అంశంపై తుది స్పష్టత రావాల్సి ఉంది.
1998లో భారత జాతీయ కాంగ్రెస్ నుంచి విడిపోయిన మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్‌ను స్థాపించారు. గత దాదాపు మూడు దశాబ్దాలుగా పార్టీ ఎదుగుదల, విస్తరణ, ఎన్నికల విజయాలు అన్నీ మమతా వ్యక్తిత్వం చుట్టూనే తిరిగాయి. అందుకే రాజకీయ పరిశీలకులు తరచూ “టీఎంసీ అనేది కేడర్ ఆధారిత పార్టీ కంటే నాయకురాలి ఆధారిత ఉద్యమ పార్టీ” అని వ్యాఖ్యానిస్తుంటారు.
ఇప్పుడు మొదటిసారి ఆ నిర్మాణం తీవ్రమైన పరీక్షను ఎదుర్కొంటోంది.
లోక్‌సభ పరిణామాలకే పరిమితం కాకుండా రాజ్యసభలో కూడా టీఎంసీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి.
సుఖేందు శేఖర్ రాయ్ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయగా, ఆయన రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్ ఆమోదించారు.
సుష్మితా దేవ్ పార్టీ పదవులతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చాయి.
ప్రకాశ్ చిక్ బరాయక్ కూడా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా పత్రం సమర్పించినట్లు సమాచారం.
దీంతో రాజ్యసభలో కూడా టీఎంసీ ప్రభావం తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
భారత రాజకీయాల్లో అధికారం ఉన్నప్పుడు నాయకత్వంపై ప్రశ్నలు తక్కువగా ఉంటాయి. కానీ అధికారం కోల్పోయిన వెంటనే అసమ్మతి స్వరాలు బలపడటం కొత్త విషయం కాదు. దాదాపు అన్ని ప్రధాన పార్టీల్లోనూ ఇలాంటి పరిణామాలు గతంలో కనిపించాయి. టీఎంసీ ప్రస్తుతం అలాంటి దశను ఎదుర్కొంటోంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో మమతా బెనర్జీ ముందున్న ప్రధాన సవాలు ప్రత్యర్థి పార్టీలతో పోరాటం మాత్రమే కాదు. పార్టీ అంతర్గత ఐక్యతను కాపాడుకోవడం, అసంతృప్త వర్గాలను సమన్వయం చేయడం, అభిషేక్ బెనర్జీ నాయకత్వంపై వస్తున్న విమర్శలకు సమాధానం ఇవ్వడం కూడా అంతే కీలకంగా మారింది.
టీఎంసీ విభజన నిజంగానే చట్టబద్ధ రూపం దాల్చుతుందా? తిరుగుబాటు వర్గం ఎంత బలంగా నిలబడగలదు? మమతా బెనర్జీ పార్టీని మళ్లీ ఏకతాటిపైకి తీసుకురాగలరా? లేక పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొత్త శక్తి సమీకరణాలు ఏర్పడతాయా?
ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబోయే రోజుల్లో స్పష్టమవుతాయి. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు అభేద్యంగా కనిపించిన మమతా బెనర్జీ రాజకీయ కోట ఇప్పుడు తీవ్రమైన అంతర్గత ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభాన్ని ఆమె ఎలా అధిగమిస్తారన్నదే టీఎంసీ భవిష్యత్తును నిర్ణయించబోతోంది.
చందమూరి నరసింహరెడ్డి
ఫ్రీలాన్స్ జర్నలిస్టు✒️
కదిరి.


















