కలలు కనటం వేరు. వాటిని నెరవేర్చుకోవటం వేరు. అత్యున్నత స్థానంలో ఉన్నా.. అధికారం చేతిలో ఉన్నా అన్నీ అనుకున్నట్లుగా చేయటం అంత తేలికైన విషయం కాదు. కానీ.. అలాంటి సవాళ్లను ఎదుర్కొని మరీ తాను కల కన్న ఫ్యూచర్ సిటీకి ఒక గుర్తింపు వచ్చేలా.. అంతర్జాతీయంగా ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుకునేలా చేయటంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. గడిచిన రెండు రోజులుగా నిర్వహించిన ఫ్యూచర్ సిటీకి సంబంధించి పరిణామాలు.. లక్షలాది కోట్ల రూపాయిలు పెట్టుబడుల రూపంలో వెల్లువెత్తిన తీరు చూసినప్పుడు ఫ్యూచర్ సిటీ దిశగా అడుగులు మరింత వడివడిగా పడతాయని చెప్పాలి.
ఇలాంటి సమయంలోనే ఫ్యూచర్ సిటీ ఎలా ఉండాలి? దాన్నెలా నిర్మించాలన్న దానిపై ప్లాన్ చేసే సమయంలో చప్పున గుర్తుకొచ్చేది గుజరాత్ లోని గిఫ్టు సిటీ. ప్రపంచ వ్యాపారం కోసం దేశంలో నిర్మించిన మొట్టమొదటి స్మార్ట్ సిటీ. గుజరాత్ రాజధాని గాంధీనగర్ – అహ్మదాబాద్ మధ్య సబర్మతీ నదిని అనుకొని 886 ఎకరాల్లో ఏర్పాటైన గిఫ్ట్ సిటీ అత్యాధునిక టెక్నాలజీ.. వసతులతో అందరిని విపరీతంగా ఆకర్షిస్తోంది. అక్కడి పరిస్థితులు.. మౌలిక సదుపాయాలకు సంబంధించిన వివరాలు తెలిసినప్పుడు విస్మయానికి గురి కాకుండా ఉండలేం.
తెలంగాణ సీఎం రేవంత్ కలలు కంటున్న ఫ్యూచర్ సిటీని గిఫ్టు సిటీ మోడల్ ను ఫాలో అయితే.. బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతకూ గుజరాత్ గిఫ్టు సిటీలో ఏముంటుంది? అన్న విషయంలోకి వెళితే.. అక్కడున్న పరిస్థితుల గురించి చదవినప్పుడు నమ్మశక్యం కాని రీతిలో ఉంటాయని చెప్పకతప్పదు. డ్రైనేజీ పైపు లైన్ కనిపించకపోవటం.. కరెంట్ వైర్లు బయటకు కనిపించకుండా ఉండే వ్యవస్థలు అక్కడి సొంతం.
ఈ గిఫ్టు సిటీలో దేశంలోనే తొలి ఆటోమేటెడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ఉంది. పారిశుద్ధ్య కార్మికులు ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించే అవసరం లేకుండా ప్రత్యేక పైప్ లైన్ ద్వారా పెద్ద పెద్ద భవనాల్లోని అంతస్తుల నుంచే నేరుగా చెత్తను పైప్ లైన్ ద్వారా సేకరిస్తారు. అదెలా అంటే వాక్యూమ్ తో. చెత్త సేకరణకు ఎలా అయితే ప్రత్యేక పైప్ లైన్ వ్యవస్థను ఏర్పాటు చేశారో అదే విధంగా మంచినీరు.. విద్యుత్ సరఫరా కోసం అతి పెద్ద అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వ్యవస్థను తీసుకొచ్చారు.
ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్.. డ్రైనేజీ వాటర్ ను శుద్ధి చేసే ప్లాంట్ ఉన్నాయి. నాన్ స్టాప్ గా కరెంట్ సప్లై అయ్యే వ్యవస్థల్ని సిద్ధం చేశారు. శుద్ధి చేసిన మురుగు నీటిని 5 డిగ్రీలకు శీతలీకరించి.. వాటిని నగరంలో ఎయిర్ కండిషనింగ్ కోసం వాడతారు. దీంతో ఈ సిటీలో ఏసీ ఔట్ డోర్ యూనిట్లు మచ్చుకు కూడా ఉండవు. ఈ కూల్ పైప్ లైన్ ద్వారా ప్రతి భవనానికి ఎయిర్ కండిషనింగ్ ఉంటుంది. దీంతో సిటీ మరింత సుందరంగా.. కాలుష్యం అంత ఎక్కువ లేకుండా చేస్తుంది.
సాధారణ ఏసీలు పని చేసే కన్నా.. ఈ భిన్నమైన కూలింగ్ సిస్టమ్ తో విద్యుత్ వినియోగం కూడా తక్కువేనని చెబుతున్నారు. ఇవన్నీ చదివిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ కలల నగరమైన ఫ్యూచర్ సిటీని ఇదే తీరులో నిర్మిస్తే బాగుండన్న భావన కలుగక మానదు. మరి.. ఈ విషయాలు ముఖ్యమంత్రికి తెలిసేలా ఎవరో ఒకరు నడుం బిగిస్తే.. ఫ్యూచర్ సిటీ మరో గిఫ్టు సిటీలా మారుతుందని చెప్పకతప్పదు.
ప్రజాదరణ ఎంతున్నా పరిస్థితులు కలిసి రాకపోతే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే భాగ్యం దక్కదు. అన్నింటితో పాటు కూసింత లక్ కూడా తోడైతే తప్పించి సీఎం కాలేరు. అదే సమయంలో ముఖ్యమంత్రులైనోళ్లంతా చరిత్రలో నిలిచిపోరు. అందుకు ప్రత్యేకమైన కమిట్ మెంట్.. తన మార్క్ ను చూపించాలన్న తహతహతో పాటు.. తాను పాలించే రాష్ట్రాన్ని ఒక స్థాయికి తీసుకెళ్లాలన్న పంతంతోనే పలు పరిణామాలు చోటు చేసుకుంటాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కోవలోకే వస్తారు.
తనను ముఖ్యమంత్రిని చేసిన తెలంగాణ రాష్ట్రానికి తానేదో చేయాలన్న పట్టుదల ఆయనలో ఎక్కువే. అందుకు తగ్గట్లే ఆయనో విజన్ ఉంది. తన పదవీ కాలంలో తన మార్కును శాశ్వితంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలన్న ఆలోచనకు నిదర్శనంగా తాజాగా హైదరాబాద్ మహానగర శివారులో నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ ను దీనికో ఉదాహరణగా చెప్పాలి. తాజాగా తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ ను విడుదల చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన వందేళ్ల నాటికి (2047) తెలంగాణ రాష్ట్రం 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి చేరుకోవాలన్న లక్ష్యంతో రేవంత్ సర్కారు పని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
ఈ సందర్భంగా 83 పేజీలతో తమ ప్రభుత్వం సిద్ధం చేసిన విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేసిన ఆయన..తన లక్ష్యాలేమిటన్న విషయాన్ని అందులో క్లియర్ గా చెప్పేశారు. విజన్ డాక్యుమెంట్ తయారీలో నీతి ఆయోగ్.. ఐఎస్ బీ.. కేంద్ర.. రాషట్ర ప్రభుత్వాలతో పాటు ప్రజలు సైతం భాగస్వామ్యమయ్యారని పేర్కొన్న రేవంత్.. స్వేచ్ఛ.. సామాజిక న్యాయం.. సమాన అవకాశాల కల్పించటమే లక్ష్యంగా ఈ డాక్యుమెంట్ ను సిద్ధం చేశారు. కీలకాంశాలు ఇవే..
– 10 కీలక వ్యూహాలతో విజన్ డాక్యుమెంట్ రూపకల్పన. క్యూర్, ప్యూర్, రేర్ జోన్లుగా తెలంగాణ విభజన.
– CURE జోన్‌ను నెట్-జీరో సిటీగా, గ్లోబల్ ఇన్నొవేషన్ హబ్‌గా అభివృద్ధి.
– PURE జోన్‌ను తయారీ, లాజిస్టిక్స్ కేంద్రంగా అభివృద్ధి.
– RARE జోన్‌ను వ్యవసాయ – హరిత ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం.
– డాక్యుమెంట్‌లో ఎడ్యుకేషన్, ఇరిగేషన్‌కు ప్రాధాన్యం. పెట్టుబడుల ఆకర్షణ, పాలనలో పారదర్శకత
– గేమ్ ఛేంజర్ ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం.
– ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవం, డ్రై పోర్ట్, గ్రీన్‌ఫీల్డ్ హైవే, ట్రిపుల్ ఆర్, రింగు రైలు, బుల్లెట్ రైలు
– ప్రపంచ పెట్టుబడుల ఆకర్షణ, ప్రత్యేక నిధి ఏర్పాటు. వాతావరణ మార్పుల వల్ల నష్టాలను తగ్గించడం.
– పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యంపై ప్రత్యేక దృష్టి
– 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక మైలురాయి సాధించడం. 2047 నాటికి జాతీయ జీడీపీలో 10% వాటా టార్గెట్.
– నాలుగు లక్షల మంది ప్రజల అభిప్రాయాలతో రూపొందించిన దార్మనిక పత్రం.
– భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ రివర్ రీజువెనేషన్ వంటి గేమ్-ఛేంజర్ ప్రాజెక్టులు.
– రీజినల్ రింగ్ రోడ్, రింగ్ రైలు, బుల్లెట్ రైలు కారిడార్ల అభివృద్ధి.
– డిజిటల్ గవర్నెన్స్ ద్వారా పారదర్శకత, సేవలు వేగవంతం.
– ప్రపంచ స్థాయి విద్య – పరిశోధన కేంద్రాలతో తెలంగాణను నాలెడ్జ్ హబ్‌గా నిర్మించడం.
– మహిళలు, యువత, రైతులకు సమాన అవకాశాలతో సుస్థిర సంక్షేమం.
– భారీ మౌలిక వసతుల కోసం ప్రత్యేక పెట్టుబడి నిధుల ఏర్పాటు.
– పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పుల నియంత్రణకు ప్రాధాన్యం.
– తెలంగాణ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ మరియు పర్యాటక అభివృద్ధి.
– పాలనలో ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యంతో ‘ప్రజల కోసం–ప్రజల చేత’ అభివృద్ధి.

















