రహదారులపై టోల్ చార్జెస్ చెల్లింపు ఒకప్పుడు నగదుతోనే జరిగేది. ఆ తర్వాత 2019 డిసెంబరు 15న కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. తాజాగా ప్రయాణికులకు ఆ ఇబ్బంది కూడా లేకుండా, ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా, మరింత సులభంగా టోల్ వసూలయ్యేలా శాటిలైట్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రస్తుతం ప్రయోగాత్మకంగా తెలంగాణలో పంతంగి (చౌటుప్పల్) హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై, కొర్లపహాడ్(కేతేపల్లి), ఏపీలో చిల్లకల్లు (నందిగామ) టోల్ ప్లాజాల వద్ద ప్రస్తుతం శాటిలైట్ ద్వారా టోల్ వసూలు జరుగుతోంది. వాహనం ఆగనవసరం లేకుండానే శాటిలైట్ విధానం ద్వారా టోల్ దానికదే వసూలవుతోంది. దీంతో తమ వాహనాలకు ఫాస్టాగ్ లేకున్నా టోల్ చెల్లింపు ఎలా జరిగిందా! అని వాహనదారులు ఆశ్చర్యపోతున్నారు.
జాతీయ రహదారులపై వాహనదారులు ప్రయాణించిన దూరం మేరకే టోల్ వసూలు చేసేలా జీపీఎస్ ఆధారిత వ్యవస్థను తీసుకొస్తామని గతంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ విధానం అమలుకు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ట్రయల్ రన్ చేపట్టే యోచనలో ఉంది. త్వరలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై కూడా ఈ ట్రయల్న్ చేపట్టనున్నారని నేషనల్ హైవే అధార్టీ ఆప్ ఇండియాకి చెందిన ఓ అధికారి వివరించారు.