రానా నాయుడు 2 వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో తాజాగా విడుదలైంది. వెంకటేష్, రానా నటించిన ఈ సిరీస్ ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం.
రియల్ లైఫ్ బాబాయ్, అబ్బాయిలు విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి కలసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు సీజన్ 2పై ఆడియన్స్ లో మంచి ఆసక్తి ఉంది. కరణ్ అన్షుమాన్ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. రెండేళ్ల క్రితం 2023లో విడుదలైన రానా నాయుడు సీజన్ 1కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనితో సీజన్ 2పై కూడా అంచనాలు పెరిగాయి. ఎట్టకేలకు రానా నాయుడు సీజన్ 2(Rana Naidu Season 2) నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ఆడియన్స్ ముందుకు వచ్చింది. జూన్ 13 శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ మొదలైంది. రానా దగ్గుబాటి, వెంకటేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఈసారి కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుందా లేదా అనేది సమీక్షలో తెలుసుకుందాం.
కథ
సీజన్ 2లో రానా కుమారుడు అనీ కిడ్నాప్ సన్నివేశాలతో కథ మొదలవుతుంది. తన కొడుకుని రక్షించేందుకు రానా ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఈ క్రమంలో అతడికి గోవా నగరానికి సంబంధించి లీడ్ దొరుకుతుంది. దీనితో తన కుమారుడిని రక్షించేందుకు రానా గోవాకు చేరతాడు. అక్కడ అతను తన తండ్రి నాగ (వెంకటేష్)ను మళ్లీ కలుసుకుంటాడు. అనీని రక్షించే క్రమంలో తండ్రీకొడుకుల కలయిక ఆసక్తిని పెంచుతుంది.
అనీని రక్షించిన తర్వాత రానా మరోసారి తన తండ్రిని కుటుంబ జీవితం నుండి పూర్తిగా తప్పుకోవాలని హెచ్చరిస్తాడు. తరువాత, రానా తన శత్రువు సైఫ్‌ను అంతం చేయడంతో కథమరింత ఉత్కంఠగా మారుతుంది. జైలులో ఉన్న సైఫ్ సోదరుడు రావుఫ్ (అర్జున్ రాంపాల్) రానాపై ప్రతీకారం తీర్చుకోవాలని శపథం చేస్తాడు. ఇక రానా, రాజత్ కపూర్ తో కలిసి చివరి మిషన్‌లో పాల్గొంటాడు. అనీని రక్షించడంలో సాయం చేసినందుకు కృతజ్ఞతగా రానా ఆ మిషన్ లో పాల్గొంటాడు.
కృతి కర్బందా, తరుణ్ విర్వానీ లాంటి పాత్రలు కుటుంబ అనుబంధాలను చూపిస్తూ కథలో భావోద్వేగాలను మరింత పెంచుతాయి. అయితే, ఓబీ అనే రానా సహచరుడు రావుఫ్‌ను జైలులో నుంచి బయటకు తీసేందుకు సహాయపడుతూ చివరికి రావుఫ్ చేతే మోసపోవడం కథకు షాక్ టర్న్‌ను ఇస్తుంది. రానా చేపట్టిన చివరి మిషన్ ఏంటి ? రావుఫ్ రానాపై ప్రతీకారం తీర్చుకోగలిగాడా ? లాంటి అంశాలు సిరీస్ చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ
రానా నాయుడు 2 సీజన్‌లో గత సీజన్‌తో పోల్చితే మరింత మెరుగైన కథా, కథనాలు కనిపిస్తాయి. కథని, ఎమోషన్స్ ని మిక్స్ చేసిన విధానం.. గ్రాండ్ విజువల్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటాయి. గత సీజన్ లో ఉపయోగించి డైలాగ్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా ఇబ్బంది కలిగించాయి. దానిని దృష్టిలో పెట్టుకుని ఈ సీజన్లో అలాంటి డైలాగుల మోతాదు తగ్గించారు.
అక్కడక్కడా అలాంటి డైలాగులు ఉంటాయి. అయినప్పటికీ, యాక్షన్, ఎమోషన్స్ ని డైరెక్టర్ హైలైట్ చేసిన విధానం బావుంది. కుటుంబ గొడవలు, తద్వారా రగిలిన భావోద్వేగాలతో కథ ఆసక్తికరంగా ఉంటుంది. అయితే కథనం ఇంకాస్త వేగంగా ఉండిఉంటే బావుండేది.
మొత్తం 8 ఎపిసోడ్లలో కొన్ని బాగా నెమ్మదిగా సాగుతాయి అనే ఫీలింగ్ ఉటుంది. అక్కడక్కడా బలహీనమైన సన్నివేశాల కారణంగా టెంపో మిస్ అవుతున్నట్లు అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు అయితే కథ నుంచి పక్కకి వెళ్లి గందరగోళానికి గురిచేస్తాయి. కొన్ని సన్నివేశాలని బాగా సాగదీశారు. కథలో చాలా సబ్ ప్లాట్స్ ఉండడం వల్ల కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది.
ఓవరాల్ గా వాటి వల్ల కథకి డ్యామేజ్ జరగకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డారు. ఫైనల్ ఎపిసోడ్ ని దర్శకుడు సంతృప్తికరంగా ముగించాడు. చివరి 30 నిమిషాల కథనం అంతకు ముందు చూసిన ట్విస్టులు, ఎమోషనల్ సీన్స్ కి తగ్గట్లుగా ఆసక్తికరంగా సాగుతుంది.
నటీనటులు
రానా దగ్గుబాటి ఆకర్షణీయమైన లుక్‌తో, ఆకట్టుకునే నటనతో ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. యాక్షన్ సన్నివేశాలు అయినా, భావోద్వేగ సన్నివేశాలు అయినా రానా తన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. వెంకటేష్ పాత్రలో గంభీరంగా కనిపించారు. మరోసారి వెంకటేష్ నుంచి పవర్ ఫుల్ పెర్ఫామెన్స్ చూడొచ్చు. కానీ వెంకటేష్ కి రాసిన డైలాగులు అంత గొప్పగా లేవు. అర్జున్ రాంపాల్ ప్రతినాయకుడిగా తనదైన ముద్ర వేశాడు. సుర్వీన్ చావ్లా, కృతి ఖర్బందా, తరుణ్ విర్వానీ, రాజత్ కపూర్ వంటి నటీనటులందరూ తమ పాత్రలకు న్యాయం చేసి కథా బలాన్ని పెంచారు.
టెక్నీషియన్లు
రానా నాయుడు 2 కి ప్రధాన మైనస్ అంటే డైలాగులే అని చెప్పొచ్చు. రైటింగ్ డిపార్ట్మెంట్ ఇంకాస్త మెరుగ్గా సంభాషణలు రాసి ఉండాల్సింది. కథ టోన్ కి తగ్గట్లుగా సినిమాటోగ్రఫీ ఉంది. కొన్ని ఎపిసోడ్స్ లో అద్భుతమైన విజువల్స్ అందించారు. బ్యాగ్రౌండ్ సంగీతం చాలా వరకు వర్కౌట్ అయింది కానీ కొన్ని ఎపిసోడ్స్ లో తేలిపోయింది. యాక్షన్ కొరియోగ్రఫీ చాలా బావుంది. దర్శకుడు కరణ్ అన్షుమాన్ గత సీజన్ కంటే సీజన్ 2ని బెటర్ గా తీర్చిదిద్దడంలో సక్సెస్ అయ్యారు.
ఫైనల్‌గా
క్రైమ్, యాక్షన్, ఎమోషన్స్ రానా నాయుడు సీజన్ 2లో పర్ఫెక్ట్ గా మిక్స్ చేయబడ్డాయి. గత సీజన్ కంటే ఇది మెరుగ్గా ఉందని చెప్పడంలో సందేహం లేదు.
రేటింగ్ :3/5