న్యాయానికి నకిలీ నీడలు… చట్టాన్ని కాపాడాల్సిన చేతుల్లోనే చట్టానికి సంకెళ్లు!
ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాలున్నాయని మనం గర్వంగా చెబుతాం. అందులో న్యాయవ్యవస్థ చివరి ఆశ్రయం. అన్ని తలుపులు మూసుకుపోయినప్పుడు ప్రజలు చివరకు తట్టే తలుపు కోర్టుదే. దేశంలో ఒక సామెత ఉంది “వందమంది నేరస్థులు తప్పించుకున్నా పరవాలేదు, ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు.” ఈ గొప్ప న్యాయసూత్రం మీదే భారత న్యాయవ్యవస్థ నిలబడి ఉంది. కానీ ఆ న్యాయవ్యవస్థ ద్వారానే న్యాయం కొనసాగే సమయంలో, న్యాయాన్ని వాదించే వారిలోనే నకిలీ డిగ్రీలతో వచ్చినవారు ఉంటే అది కేవలం ఒక అక్రమం కాదు రాజ్యాంగం మీద, న్యాయవ్యవస్థ మీద, ప్రజల విశ్వాసం మీద జరిగిన ప్రత్యక్ష దాడి.
అలాంటి పవిత్రమైన వ్యవస్థలోనే నకిలీ లా డిగ్రీలు, బోగస్ న్యాయవాదుల నీడలు కనిపిస్తున్నాయంటే అది కేవలం ఒక అవినీతి కథ కాదు .దేశ రాజ్యాంగానికే విసిరిన సవాలు.ఇటీవలి కాలంలో భారత ప్రధాన న్యాయమూర్తి నకిలీ లేదా బోగస్ లా డిగ్రీలతో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించిన వారి గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం దేశమంతటా చర్చకు దారి తీసింది. అవసరమైతే ఈ అంశంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)తో విచారణ జరిపించాల్సిన పరిస్థితి రావచ్చని ఆయన వ్యాఖ్యానించడం సమస్య తీవ్రతను ప్రతిబింబిస్తోంది.
ఈ సమస్య కొత్తది కాదు. ఇప్పటికే 2017లోనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు తెలిపిన వివరాల ప్రకారం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నకిలీ డిగ్రీలు లేదా నమోదు లేకుండానే న్యాయవాదులుగా చెలామణి అవుతున్న వారి అంశాన్ని గుర్తించి, న్యాయవాదుల విద్యార్హతలు, నమోదు, ప్రాక్టీస్‌లను ధృవీకరించే ప్రక్రియను ప్రారంభించింది. అంటే సమస్య చాలాకాలంగా ఉన్నప్పటికీ, అది పూర్తిగా పరిష్కారం కాలేదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.న్యాయవాది అంటే కేవలం కేసులు వాదించే వ్యక్తి కాదు. ఒక కుటుంబం భవిష్యత్తు కాపాడేవాడు , ఒక నిర్దోషికి స్వేచ్ఛ కలిపించే వాడు , ఒక రైతు భూమిని కాపాడేవాడు, ఒక మహిళ గౌరవం, ఒక కార్మికుడి హక్కు, ఒక చిన్నారి భవిష్యత్తు కోసం వాదించే వాడు. ఇవి అన్నీ కొన్నిసార్లు న్యాయవాది చేతుల్లోనే ఉంటాయి. అలాంటి స్థానంలో నకిలీ అర్హతలతో వచ్చిన వ్యక్తి ఉంటే, అతను ఓ కేసును మాత్రమే కాదు, ఒక జీవితాన్నే నాశనం చేసే ప్రమాదం ఉంది.
ఈ పరిస్థితికి బాధ్యులు ఎవరు? నకిలీ డిగ్రీ తయారు చేసిన విద్యాసంస్థలా? దానిని కొనుగోలు చేసిన వ్యక్తులా? ధృవీకరణ చేయకుండా నమోదు చేసిన వ్యవస్థలా? లేక సంవత్సరాల తరబడి తనిఖీలు చేయని నియంత్రణ సంస్థలా? నిజానికి ఈ నలుగురి నిర్లక్ష్యమే సమస్యను ఈ స్థాయికి తీసుకొచ్చింది. నకిలీ డిగ్రీ కొనేవాడు ఎంతటి నేరస్థుడో, దాన్ని తయారు చేసేవాడు, గుర్తించలేని వ్యవస్థ కూడా అంతే బాధ్యత వహించాలి.అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, ప్రజలు న్యాయవాది అసలు అర్హతలను సాధారణంగా పరిశీలించరు. కోర్టు ముందు నల్లకోటు ధరించి నిలబడితే చాలు, అతను నిజమైన న్యాయవాదే అని నమ్మేస్తారు. ఆ నమ్మకాన్నే కొందరు మోసం చేసే సాధనంగా మార్చుకుంటే, అది ప్రజాస్వామ్యానికి తీవ్రమైన హెచ్చరిక.
ఈ పరిస్థితి ఇక పునరావృతం కాకూడదంటే కఠినమైన సంస్కరణలు తప్పనిసరి.మొదటిగా, దేశంలోని ప్రతి న్యాయవాది డిగ్రీని సంబంధిత విశ్వవిద్యాలయం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర బార్ కౌన్సిల్ సంయుక్తంగా డిజిటల్ పద్ధతిలో ధృవీకరించాలి. ప్రతి న్యాయవాదికి QR కోడ్ లేదా డిజిటల్ వెరిఫికేషన్‌తో కూడిన గుర్తింపు వ్యవస్థ ఉండాలి. ప్రజలు కూడా ఒక క్లిక్‌తో వారి నమోదు చెల్లుబాటు అవుతుందో లేదో తెలుసుకునే అవకాశం కల్పించాలి.రెండవది, నకిలీ డిగ్రీలు జారీ చేసిన విద్యాసంస్థలపై కేవలం జరిమానాలు కాకుండా, క్రిమినల్ కేసులు నమోదు చేసి, గుర్తింపును రద్దు చేసే స్థాయిలో చర్యలు తీసుకోవాలి.మూడవది, బార్ కౌన్సిళ్లు క్రమం తప్పకుండా సభ్యుల అర్హతలు, నమోదు, ప్రాక్టీస్‌లపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలి. ఒక్కసారి నమోదు అయిందంటే జీవితాంతం ఎలాంటి తనిఖీ లేకుండా కొనసాగించే విధానం మారాలి.
నాలుగవది, నకిలీ న్యాయవాదుల వల్ల నష్టపోయిన బాధితులకు ప్రత్యేక న్యాయ సహాయం, పరిహారం అందించే విధానం కూడా రూపొందించాలి.ఐదవది, న్యాయ విద్యలో ప్రవేశం నుంచి పట్టా వరకు, పట్టా నుంచి న్యాయవాదిగా నమోదు వరకు ప్రతి దశను పూర్తిగా డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థలోకి తీసుకురావాలి. కాగితాల ఆధారిత ధృవీకరణకు బదులుగా సురక్షితమైన డిజిటల్ రికార్డులు తప్పనిసరి చేయాలి.చివరగా, ఈ సమస్యను కేవలం న్యాయవాదుల సమస్యగా చూడకూడదు. ఇది ప్రతి పౌరుడి సమస్య. ఎందుకంటే రేపు కోర్టు గడప తొక్కేది ఎవరో కాదు. ఏపౌరుడైనా కావచ్చు.
న్యాయమూర్తులు న్యాయం చెబుతారు. న్యాయవాదులు న్యాయాన్ని వాదిస్తారు. కానీ న్యాయవాది అర్హతే నకిలీ అయితే, న్యాయానికి పునాది కదిలిపోతుంది. చట్టాన్ని కాపాడాల్సిన చేతుల్లోనే చట్టానికి సంకెళ్లు పడితే, ప్రజాస్వామ్యం ప్రమాద ఘంటికలు మోగించడం ప్రారంభించినట్టే.న్యాయస్థానం ముందు నిలబడిన ప్రతి నల్లకోటు వెనుక నిజాయితీ ఉండాలి నకిలీ డిగ్రీ కాదు.ప్రతి న్యాయవాది చేతిలో చట్టపుస్తకం ఉండాలి మోసపూరిత అర్హత కాదు.ప్రతి తీర్పు వెనుక సత్యం ఉండాలి వ్యవస్థ వైఫల్యం కాదు. న్యాయం ఆలస్యం అయితే అన్యాయం అంటారు. కానీ న్యాయాన్ని వాదించే వ్యక్తే నకిలీ అయితే, అది అన్యాయానికంటే ప్రమాదకరం. ప్రజాస్వామ్యం నిలబడేది కేవలం చట్టాలపై కాదు చట్టాన్ని అమలు చేసేలా చేసే వ్యక్తుల నిజాయితీపై.
న్యాయస్థానాలపై ప్రజల విశ్వాసం భారత ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు. ఆ విశ్వాసాన్ని కాపాడడం ప్రభుత్వం, బార్ కౌన్సిళ్లు, విశ్వవిద్యాలయాలు, న్యాయవ్యవస్థ మాత్రమే కాదు సమాజం మొత్తం పంచుకోవాల్సిన బాధ్యత. నకిలీ డిగ్రీలకు తలుపులు మూసి, నిజాయితీకి తలుపులు తెరిచినప్పుడే న్యాయం నిజమైన అర్థంలో సజీవంగా నిలుస్తుంది.
నరసింహారెడ్డి చందమూరి.
ఫ్రీలాన్స్ జర్నలిస్టు.
కదిరి



















