కదిరి అంటే ఒక పేరు కాదు.. ఒక చరిత్ర. కదిరి అంటే ఒక పట్టణం కాదు.. శతాబ్దాల సంస్కృతికి సజీవ సాక్ష్యం. చరిత్రను అడిగితే పాలేగాళ్ల ఆనవాళ్లను చూపిస్తుంది. ఆధ్యాత్మికతను ప్రశ్నిస్తే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వైభవాన్ని పరిచయం చేస్తుంది. సమాజాన్ని ప్రశ్నించే స్వరం ఎక్కడ పుట్టిందని వెతికితే ప్రజాకవి వేమన నడయాడిన నేలను గుర్తు చేస్తుంది. ప్రకృతి వైభవాన్ని చూస్తే తిమ్మమ్మ మర్రిమాను విశాలతను ప్రపంచం ముందు నిలబెడుతుంది. చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికత, ప్రకృతి, రాజకీయ చైతన్యం.. ఇలా అనేక విశిష్టతలను తనలో మోస్తూ కాలంతో పాటు ప్రయాణించిన నేలే కదిరి.
విజయనగర సామ్రాజ్య వైభవం నుంచి బ్రిటిష్ పాలనా వ్యవస్థ వరకు, తాలూకాల నుంచి ఫిర్కాల వరకు, ఫిర్కాల నుంచి మండలాల వరకు, ఒక పరిపాలనా కేంద్రం నుంచి నేటి రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఎదిగే వరకు కదిరి ప్రస్థానం దాదాపు రెండు శతాబ్దాల పరిపాలనా చరిత్రను తనలో దాచుకుంది. కాలాలు మారాయి. పాలకులు మారారు. పరిపాలనా సరిహద్దులు మారాయి. రాజకీయ సమీకరణలు మారాయి. కానీ కదిరి ప్రాధాన్యం మాత్రం కాలగర్భంలో కలిసిపోలేదు.
1820 నాటికే కదిరి తాలూకా పరిపాలనా వ్యవస్థలో భాగమైందని బ్రిటిష్ కాలం నాటి రికార్డులు సూచిస్తున్నాయి. 1826–34 కాలంలో కదిరిలో తహసీల్దారీ పాఠశాల ఉన్నట్లు బ్రిటిష్ విద్యా రికార్డుల్లో నమోదవడం కూడా అప్పటికే కదిరి ఒక ముఖ్యమైన పరిపాలనా కేంద్రంగా ఎదిగిందనే విషయానికి చారిత్రక ఆధారంగా నిలుస్తోంది. కదిరి మొదట్లో కడప జిల్లా పరిధిలోని తాలూకాగా ఉండేది. అనంతరం 1910 అక్టోబర్ 1న అనంతపురం జిల్లా పరిపాలనా పరిధిలోకి వచ్చింది. తర్వాత పెనుకొండ రెవెన్యూ డివిజన్‌లో భాగమై, కాలానుగుణంగా మారుతున్న పరిపాలనా వ్యవస్థలను తనలో మోసుకుంటూ ముందుకు సాగింది.
1901 జనాభా లెక్కలే అప్పటి కదిరి పరిమాణం, ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. విస్తారమైన 1,158 చదరపు మైళ్ల తాలూకా, 1.45 లక్షలకు పైగా జనాభా, 139 గ్రామాలు.. ఈ గణాంకాలు కదిరి అప్పటికే ఎంతటి విస్తృత పరిపాలనా ప్రాధాన్యత కలిగిన కేంద్రంగా ఉందో తెలియజేస్తున్నాయి. తాలూకా కేంద్రంగా కదిరి చుట్టుపక్కల ప్రాంతాల సామాజిక, ఆర్థిక, పరిపాలనా వ్యవహారాలకు కేంద్రబిందువుగా నిలిచింది.
1985లో తాలూకా–ఫిర్కా వ్యవస్థ స్థానంలో మండల వ్యవస్థ వచ్చినప్పుడు పాత కదిరి తాలూకా అనేక మండలాలుగా విడిపోయింది. పరిపాలనా పటంలో రూపం మారినా కదిరి ప్రాధాన్యం మాత్రం తగ్గలేదు. నేడు శ్రీ సత్యసాయి జిల్లాలో రెవెన్యూ డివిజన్ కేంద్రంగా, ఎనిమిది మండలాలకు పరిపాలనా కేంద్రంగా కదిరి తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ఒకప్పుడు విస్తారమైన తాలూకాకు కేంద్రంగా ఉన్న కదిరి, నేడు మారిన పరిపాలనా వ్యవస్థలోనూ తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది.
కదిరి చరిత్ర కేవలం పరిపాలనా పరిణామాలతోనే పరిమితం కాలేదు. 1952లో శాసనసభ ఎన్నికలతో ప్రారంభమైన రాజకీయ ప్రయాణం కూడా ఈ ప్రాంత సామాజిక చైతన్యానికి అద్దం పడుతుంది. ఏడు దశాబ్దాలకు పైగా సాగిన ఎన్నికల చరిత్రలో కదిరి ప్రజలు వివిధ రాజకీయ పార్టీలను ఆదరించారు. నాయకత్వాలను మార్చారు. అధికార పార్టీలకు అవకాశాలు ఇచ్చారు. ప్రతిపక్షాలకు కూడా తమ మద్దతును అందించారు. ఒకే పార్టీకి శాశ్వతంగా కట్టుబడి ఉండకుండా, కాలానుగుణంగా తమ రాజకీయ అభిప్రాయాన్ని ఓటు ద్వారా వ్యక్తం చేశారు. అందుకే కదిరి ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే ప్రజాస్వామ్య చైతన్యానికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తాయి.
1951 డిలిమిటేషన్ ఉత్తర్వుల మేరకు 1952లో కదిరి అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటైంది. ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కావు. అప్పటికి ఆంధ్ర రాష్ట్రం కూడా ఏర్పడలేదు. కదిరి ప్రాంతం మద్రాస్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతంలో భాగంగా ఉండేది. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాతే కదిరి ఆంధ్ర రాష్ట్ర రాజకీయ వ్యవస్థలోకి వచ్చింది. 1952 ఎన్నికలు స్వతంత్ర భారతదేశంలో జరిగిన తొలి సాధారణ ఎన్నికలలో భాగంగా నిలిచాయి.
1952లో జరిగిన మద్రాస్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కదిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కె.వి. వేమారెడ్డి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి పాపిరెడ్డిపై 5,275 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 1952 జనవరిలో ఎన్నికలు జరగగా, ఫలితాల లెక్కింపు మార్చి 27న జరిగింది. మొత్తం నమోదైన ఓటర్లు 72,868 మంది. వారిలో 40,880 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ శాతం 56.10గా నమోదైంది. కాంగ్రెస్ అభ్యర్థి కె.వి. వేమారెడ్డికి 19,696 ఓట్లు లభించగా, స్వతంత్ర అభ్యర్థి వై. పాపిరెడ్డి 14,421 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అభ్యర్థి సి. మహమ్మద్ అలీ 4,596 ఓట్లతో మూడో స్థానంలో నిలవగా, కృషికార్ లోక్ పార్టీ అభ్యర్థి వెంకటశివరెడ్డి 2,167 ఓట్లు సాధించారు. కదిరి రాజకీయ చరిత్రలో జరిగిన తొలి ఎన్నికలోనే కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
1952లో మద్రాస్ రాష్ట్రంలోని మొత్తం 375 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 152 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది. సీపీఐ 62 స్థానాలతో రెండో అతిపెద్ద రాజకీయ శక్తిగా అవతరించింది. కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ 35 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ రాకపోయినప్పటికీ, తర్వాత సి. రాజగోపాలాచారి రాజాజీ ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడింది.
1955లో జరిగిన ఎన్నికల్లో కదిరి మరోసారి కాంగ్రెస్ వశమైంది. కాంగ్రెస్ అభ్యర్థి కె.వి. వేమారెడ్డి తన సమీప ప్రత్యర్థి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి ఎనుముల పాపిరెడ్డిపై 11,059 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ప్రధాన శాసనసభ ఎన్నికలు ఇవి. 1955 ఫిబ్రవరి 11న ఎన్నికలు జరిగాయి. కదిరి 143వ నియోజకవర్గంగా నమోదైంది. మొత్తం 54,061 మంది ఓటర్లలో 32,658 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ శాతం 60.41గా నమోదైంది. కె.వి. వేమారెడ్డికి 20,501 ఓట్లు రాగా, సీపీఐ అభ్యర్థి ఎనుముల పాపిరెడ్డికి 9,442 ఓట్లు లభించాయి. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
1952లో మద్రాస్ రాష్ట్రంలో సాధారణ శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో ఆంధ్ర ప్రాంతం మద్రాస్ రాష్ట్రంలో భాగంగా ఉండేది. 1953 అక్టోబర్ 1న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అనంతరం రాజకీయ పరిణామాల నేపథ్యంలో 1955లో ఆంధ్ర రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరిగాయి. 1956 నవంబర్ 1న ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలు కలసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడ్డాయి. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో 1955లో ఎన్నికైన ఆంధ్ర ప్రాంత శాసనసభ సభ్యుల పదవీకాలం ప్రత్యేక నిబంధనల ప్రకారం 1962 వరకు కొనసాగింది. తెలంగాణ ప్రాంతానికి మాత్రం 1957లో ఎన్నికలు నిర్వహించారు. ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది.
1962లో జరిగిన సాధారణ శాసనసభ ఎన్నికల్లో కదిరి నియోజకవర్గం కాంగ్రెస్ వశమైంది. కాంగ్రెస్ అభ్యర్థి ఈ. గోపాల్ నాయక్ తన సమీప ప్రత్యర్థి సీపీఐ అభ్యర్థి ఘనే నాయక్‌పై 1,084 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కదిరి నియోజకవర్గం షెడ్యూల్డ్ ట్రైబ్‌కు రిజర్వ్‌డ్ నియోజకవర్గంగా మారింది. నియోజకవర్గ సంఖ్య 165గా నమోదైంది. 1962 ఫిబ్రవరి 19న పోలింగ్ జరిగింది. మొత్తం 59,175 మంది ఓటర్లలో 28,341 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ శాతం 47.89గా నమోదైంది. కాంగ్రెస్ అభ్యర్థి గోపాల్ నాయక్‌కు 13,427 ఓట్లు, సీపీఐ అభ్యర్థి ఘనే నాయక్‌కు 12,343 ఓట్లు లభించాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చింది.
1967 ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి కదిరి స్థానాన్ని నిలబెట్టుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి కె.వి. వేమారెడ్డి తన సమీప ప్రత్యర్థి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి ఎస్.ఏ. రావూఫ్‌పై 13,097 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఫిబ్రవరి 21న జరిగిన ఎన్నికల్లో మొత్తం 72,340 మంది ఓటర్లలో 45,381 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ శాతం 62.73గా నమోదైంది. కాంగ్రెస్ అభ్యర్థికి 22,235 ఓట్లు, ప్రత్యర్థికి 9,138 ఓట్లు లభించాయి. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ 165 స్థానాలు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
అయితే 1972 కదిరి రాజకీయ చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలిచింది. తొలిసారిగా స్వతంత్ర అభ్యర్థి సి. నారాయణరెడ్డి కాంగ్రెస్‌ను ఓడించి విజయం సాధించారు. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి కె.వి. వేమారెడ్డిపై 2,002 ఓట్ల మెజారిటీతో గెలిచారు. మార్చి 15న జరిగిన ఎన్నికల్లో మొత్తం 85,104 మంది ఓటర్లలో 53,773 ఓట్లు పోలయ్యాయి. సి. నారాయణరెడ్డికి 25,544 ఓట్లు రాగా, కె.వి. వేమారెడ్డికి 23,542 ఓట్లు లభించాయి. 1952, 1955, 1967 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున విజయం సాధించిన కె.వి. వేమారెడ్డిని అదే కదిరి ఓటర్లు 1972లో ఓడించడం రాజకీయంగా విశేషం. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ఘన విజయం సాధించినప్పటికీ, కదిరి మాత్రం స్వతంత్ర అభ్యర్థికి పట్టం కట్టింది.
1978లో కదిరి మళ్లీ కాంగ్రెస్ వైపు మొగ్గుచూపింది. కాంగ్రెస్ (ఐ) అభ్యర్థి నిజాం వలి తన సమీప ప్రత్యర్థి జనతా పార్టీ అభ్యర్థి దొరిగల్లు రాజారెడ్డిపై 15,808 ఓట్ల మెజారిటీతో గెలిచారు. మొత్తం 1,04,229 మంది ఓటర్లలో 77,277 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ శాతం 74.14గా నమోదైంది. నిజాం వలికి 40,984 ఓట్లు రాగా, జనతా పార్టీ అభ్యర్థికి 25,176 ఓట్లు వచ్చాయి. గతంలో పలుమార్లు కదిరి నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన కె.వి. వేమారెడ్డి ఈసారి మూడో స్థానంలో నిలవడం రాజకీయ పరిణామాలకు అద్దం పట్టింది.
1978 తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన పరిణామాలు కూడా ఆసక్తికరమైనవి. కాంగ్రెస్‌లో ఏర్పడిన విభేదాల నేపథ్యంలో కాంగ్రెస్ (ఐ), కాంగ్రెస్ (ఆర్) వంటి వర్గాలు ఏర్పడ్డాయి. ఇందిరాగాంధీకి చెందిన కాంగ్రెస్ (ఐ) రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగింది. ఈ పరిణామాల ప్రభావం కదిరి ఎన్నికలపై కూడా కనిపించింది.
1983 ఎన్నికలు కదిరి మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలోనే ఒక విప్లవాత్మక మలుపు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మహమ్మద్ షాకీర్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి నిజాం వలిపై 21,457 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మొత్తం 1,16,513 మంది ఓటర్లలో 68,589 ఓట్లు పోలయ్యాయి. టీడీపీ అభ్యర్థి మహమ్మద్ షాకీర్‌కు 42,545 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి నిజాం వలికి 21,088 ఓట్లు వచ్చాయి.
ఎన్.టి. రామారావు 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి, కేవలం తొమ్మిది నెలల్లోనే రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ కాకుండా మరో పార్టీ అధికారంలోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ భారీ విజయాన్ని సాధించగా, కదిరి కూడా ఆ రాజకీయ మార్పును స్వీకరించింది.
1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కూడా టీడీపీ కదిరిని నిలబెట్టుకుంది. టీడీపీ అభ్యర్థి చెన్నూరు అబ్దుల్ రసూల్ స్వతంత్ర అభ్యర్థి బాచినేని వెంకముని చౌదరిపై 10,928 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 1,24,162 మంది ఓటర్లలో 72,001 ఓట్లు పోలయ్యాయి. రాష్ట్ర రాజకీయ సంక్షోభం, 1984లో జరిగిన అధికార మార్పు, అనంతరం ఎన్‌టీఆర్ తిరిగి అధికారంలోకి రావడం వంటి పరిణామాల తర్వాత జరిగిన ఈ ఎన్నికలు ప్రజల తీర్పుకు ప్రతీకగా నిలిచాయి. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఘన విజయం సాధించింది.
1989లో రాజకీయ గాలి మళ్లీ మారింది. కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ షాకీర్ కదిరి నుంచి విజయం సాధించారు. ఆయన స్వతంత్ర అభ్యర్థి దేశాయి రామిరెడ్డిపై 18,275 ఓట్ల మెజారిటీతో గెలిచారు. మహమ్మద్ షాకీర్‌కు 43,105 ఓట్లు రాగా, దేశాయి రామిరెడ్డికి 24,830 ఓట్లు లభించాయి. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
1994లో కదిరి ఎన్నికల చరిత్రలో భారీ మెజారిటీలలో ఒకటి నమోదైంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జొన్నా సూర్యనారాయణ కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ షాకీర్‌పై 55,231 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. మొత్తం 1,68,001 మంది ఓటర్లలో 1,15,439 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ శాతం 68.71గా నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా కూడా టీడీపీ అధికారంలోకి వచ్చింది.
1999లో కదిరి ఓటర్లు మరోసారి విభిన్న తీర్పునిచ్చారు. బీజేపీ అభ్యర్థి ఎం.ఎస్. పార్థసారథి కాంగ్రెస్ అభ్యర్థి సి.ఏ. రసూల్‌పై 9,770 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బీజేపీ అభ్యర్థికి 56,686 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి 46,916 ఓట్లు లభించాయి. కదిరి ఎన్నికల చరిత్రలో తొలిసారిగా బీజేపీ అభ్యర్థి విజయం సాధించడం విశేషం. రాయలసీమ ప్రాంతం నుంచి బీజేపీ తరఫున ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యేగా ఆయన నిలిచిన అంశం కూడా రాజకీయంగా ప్రాధాన్యం పొందింది.
2004లో కాంగ్రెస్ పార్టీ తిరిగి కదిరి స్థానాన్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి జొన్నా రామయ్య స్వతంత్ర అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్‌పై 8,938 ఓట్ల మెజారిటీతో గెలిచారు. జొన్నా రామయ్యకు 48,104 ఓట్లు రాగా, కందికుంట వెంకట ప్రసాద్‌కు 39,166 ఓట్లు లభించాయి. ఈ ఎన్నిక కందికుంట వెంకట ప్రసాద్ రాజకీయ ప్రయాణంలో ముఖ్యమైన తొలి అడుగుగా నిలిచింది.
2009లో డిలిమిటేషన్ తర్వాత కదిరి అసెంబ్లీ నియోజకవర్గ సంఖ్య 280గా మారింది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ కాంగ్రెస్ అభ్యర్థి బత్తుల వెంకటరమణపై 14,977 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కందికుంట వెంకట ప్రసాద్‌కు 72,308 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి 57,331 ఓట్లు లభించాయి. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి పి. వెంకట సిద్ధారెడ్డి 18,177 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. 2004లో స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన కందికుంట వెంకట ప్రసాద్, 2009లో టీడీపీ తరఫున కదిరి నుంచి విజయం సాధించడం ఆయన రాజకీయ ఎదుగుదలలో కీలక ఘట్టంగా నిలిచింది.
2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో కదిరి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అత్తార్ చాంద్ బాషా విజయం సాధించారు. ఆయన టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్‌పై కేవలం 968 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి 81,639 ఓట్లు, టీడీపీ అభ్యర్థికి 80,671 ఓట్లు లభించాయి. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరు కదిరి ఎన్నికల చరిత్రలో ప్రత్యేకంగా నిలిచింది. రాష్ట్రంలో మాత్రం టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైంది.
2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కదిరిలో తన ఆధిపత్యాన్ని మరింత బలపరిచింది. పార్టీ అభ్యర్థి పి.వి. సిద్ధారెడ్డి టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్‌పై 27,243 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సిద్ధారెడ్డికి 1,02,432 ఓట్లు రాగా, కందికుంట వెంకట ప్రసాద్‌కు 75,189 ఓట్లు లభించాయి. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
2024లో కదిరి రాజకీయ ముఖచిత్రం మరోసారి మారింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బి.ఎస్. మక్బూల్ అహ్మద్‌పై 6,265 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థికి 1,03,610 ఓట్లు రాగా, వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి 97,345 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ అభ్యర్థి కె.ఎస్. షాన్వాజ్‌కు 3,314 ఓట్లు వచ్చాయి. మొత్తం 2,53,682 మంది ఓటర్లలో 2,06,210 ఓట్లు పోలవడంతో 81.29 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయాన్ని సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
| సంవత్సరం | విజేత | పార్టీ | ఓట్లు | రన్నరప్ | పార్టీ | ఓట్లు | మెజారిటీ |
|---|---|---|---|---|---|---|---|
| 1952 | కె.వి. వేమారెడ్డి | కాంగ్రెస్ | 19,696 | వై. పాపిరెడ్డి | ఇండిపెండెంట్ | 14,421 | 5,275 |
| 1955 | కె.వి. వేమారెడ్డి | కాంగ్రెస్ | 20,501 | ఎనుముల పాపిరెడ్డి | సీపీఐ | 9,442 | 11,059 |
| 1962 | ఈ. గోపాల్ నాయక్ | కాంగ్రెస్ | 13,427 | ఘనే నాయక్ | సీపీఐ | 12,343 | 1,084 |
| 1967 | కె.వి. వేమారెడ్డి | కాంగ్రెస్ | 22,235 | ఎస్.ఏ. రావూఫ్ | కమ్యూనిస్ట్ పార్టీ | 9,138 | 13,097 |
| 1972 | సి. నారాయణరెడ్డి | ఇండిపెండెంట్ | 25,544 | కె.వి. వేమారెడ్డి | కాంగ్రెస్ | 23,542 | 2,002 |
| 1978 | నిజాం వలి | కాంగ్రెస్ (ఐ) | 40,984 | దొరిగల్లు రాజారెడ్డి | జనతా పార్టీ | 25,176 | 15,808 |
| 1983 | మహమ్మద్ షాకీర్ | టీడీపీ | 42,545 | నిజాం వలి | కాంగ్రెస్ | 21,088 | 21,457 |
| 1985 | చెన్నూరు అబ్దుల్ రసూల్ | టీడీపీ | 35,398 | బాచినేని వెంకముని చౌదరి | ఇండిపెండెంట్ | 24,470 | 10,928 |
| 1989 | మహమ్మద్ షాకీర్ | కాంగ్రెస్ | 43,105 | దేశాయి రామిరెడ్డి | ఇండిపెండెంట్ | 24,830 | 18,275 |
| 1994 | జొన్నా సూర్యనారాయణ | టీడీపీ | — | మహమ్మద్ షాకీర్ | కాంగ్రెస్ | — | 55,231 |
| 1999 | ఎం.ఎస్. పార్థసారథి | బీజేపీ | 56,686 | సి.ఏ. రసూల్ | కాంగ్రెస్ | 46,916 | 9,770 |
| 2004 | జొన్నా రామయ్య | కాంగ్రెస్ | 48,104 | కందికుంట వెంకట ప్రసాద్ | ఇండిపెండెంట్ | 39,166 | 8,938 |
| 2009 | కందికుంట వెంకట ప్రసాద్ | టీడీపీ | 72,308 | బత్తుల వెంకటరమణ | కాంగ్రెస్ | 57,331 | 14,977 |
| 2014 | అత్తార్ చాంద్ బాషా | వైఎస్సార్‌సీపీ | 81,639 | కందికుంట వెంకట ప్రసాద్ | టీడీపీ | 80,671 | 968 |
| 2019 | పి.వి. సిద్ధారెడ్డి | వైఎస్సార్‌సీపీ | 1,02,432 | కందికుంట వెంకట ప్రసాద్ | టీడీపీ | 75,189 | 27,243 |
| 2024 | కందికుంట వెంకట ప్రసాద్ | టీడీపీ | 1,03,610 | బి.ఎస్. మక్బూల్ అహ్మద్ | వైఎస్సార్‌సీపీ | 97,345 | 6,265 |
కదిరి ఎన్నికల చరిత్రలో పార్టీ వారీగా ప్రధాన విజయాలు
| పార్టీ | విజయాలు |
|---|---|
| కాంగ్రెస్ | 6 |
| టీడీపీ | 4 |
| వైఎస్సార్‌సీపీ | 2 |
| ఇండిపెండెంట్ | 1 |
| బీజేపీ | 1 |
కదిరి రాజకీయ చరిత్రను ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేల ఏ ఒక్క పార్టీకి శాశ్వత కంచుకోటగా మారలేదు. కాంగ్రెస్‌ను ఆదరించింది. స్వతంత్ర అభ్యర్థికి పట్టం కట్టింది. తెలుగుదేశం పార్టీకి భారీ విజయాలు ఇచ్చింది. బీజేపీకి చారిత్రక విజయాన్ని అందించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా వరుస విజయాలు ఇచ్చింది. మళ్లీ రాజకీయ పరిస్థితులు మారినప్పుడు టీడీపీకి అవకాశం ఇచ్చింది. ఇదే కదిరి ఓటరు ప్రత్యేకత. పరిస్థితులను బట్టి తీర్పు చెప్పడం.. నాయకత్వాలను పరిశీలించడం.. అవసరమైతే మార్పుకు ఓటేయడం.
చరిత్ర ఇక్కడ నిద్రించదు. ప్రతి రాయి ఒక కథ చెబుతుంది. ఆధ్యాత్మికత ఇక్కడ ఆగిపోదు. ప్రతి అడుగు ఒక అనుభూతిని మిగులుస్తుంది. రాజకీయ చైతన్యం ఇక్కడ మసకబారదు. ప్రతి తరం ఒక ప్రశ్నను సంధిస్తుంది. పాలేగాళ్ల కాలం నుంచి ప్రజాస్వామ్య యుగం వరకు.. తాలూకా నుంచి రెవెన్యూ డివిజన్ వరకు.. ఆలయ ఘంటానాదం నుంచి ఎన్నికల తీర్పు వరకు.. కాలం మారినా కదిరి తన చరిత్రను మరచిపోలేదు.
ఆధ్యాత్మికతకు ఆలయం.. చైతన్యానికి నిలయం.. పరిపాలనా పరిణామానికి సజీవ సాక్ష్యం.. ప్రజాస్వామ్య ప్రయాణానికి అద్దం.. అదే కదిరి. చరిత్రను ఒడిసిపట్టుకున్న నేల. అనేక పార్టీలను ఆదరించి, అనేక మంది నాయకులను ప్రజాజీవితానికి అందించిన రాజకీయ చైతన్య కేంద్రం. ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికైన నాయకుల్లో కొందరు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. అసెంబ్లీ స్పీకర్‌గా, వివిధ శాఖలకు మంత్రులుగా పనిచేసిన నాయకులకు కూడా ఈ ప్రాంతం రాజకీయ వేదికగా నిలిచింది.
కదిరి అంటే కేవలం భౌగోళిక సరిహద్దు కాదు. అది గతాన్ని గుర్తు చేసే చరిత్ర.. వర్తమానాన్ని నడిపించే చైతన్యం.. భవిష్యత్తును ప్రశ్నించే ప్రజాస్వామ్య స్పూర్తి. శతాబ్దాల సంస్కృతిని మోస్తూ, రాజకీయ పరిణామాలను చూస్తూ, ప్రజల తీర్పులను తన చరిత్రలో లిఖించుకుంటూ ముందుకు సాగుతున్న నేల.. కదిరి.
Kadiri History
నరసింహారెడ్డి చందమూరి
ఫ్రీలాన్స్ జర్నలిస్టు
కదిరి


















