తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మూసీ నది సుందరీకరణ, అభివృద్ధి ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు 734.07 ఎకరాల భూమిని బదలాయిస్తూ భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) లోకేశ్ కుమార్ సోమవారం ఉత్తర్వులు (జీవో 138) జారీ చేశారు. దీంతో ప్రాజెక్టు పనులు మరింత వేగవంతం కానున్నాయి.
గతంలో పలు ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన భూములను ఇప్పుడు మూసీ కార్పొరేషన్‌కు అప్పగించారు. ఈసా నది సమీపంలోని గండిపేట మండలం పరిధిలోని హిమాయత్ సాగర్, కిసమత్‌పూర్‌తో పాటు రాజేంద్రనగర్ మండలంలోని ప్రేమావతిపేట్, బుద్వేల్ ప్రాంతాల్లో ఈ భూములు ఉన్నాయి. టీఈఈఆర్‌ఎల్, ఐఐపీహెచ్, వాలంతరి వంటి సంస్థలకు కేటాయించిన భూములతో పాటు, శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడలో హెచ్‌ఎండీఏ లేఅవుట్ కోసం కేటాయించిన భూమిని కూడా మూసీ ప్రాజెక్టు కోసం బదలాయించారు.
అయితే, ఈ భూములు ఏపీ పునర్‌విభజన చట్టంలోని 10వ షెడ్యూల్ పరిధిలో ఉన్నందున, ఏవైనా న్యాయపరమైన వివాదాలు, ఇతర నిబంధనలకు లోబడి తదుపరి చర్యలు ఉంటాయని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. భూములను కోల్పోయిన సంస్థలకు ప్రత్యామ్నాయంగా ఫ్యూచర్ సిటీలో స్థలాలను కేటాయించనున్నట్లు తెలిపింది.
భూ కేటాయింపు ప్రక్రియ ఒకవైపు కొనసాగుతుండగా, మరోవైపు ప్రాజెక్టుకు అవసరమైన నిధుల సమీకరణలో కూడా పురోగతి సాధించారు. మూసీ అభివృద్ధి కోసం ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) నుంచి రూ. 4,100 కోట్ల రుణం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది.
గతంలో ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలని భావించినా, తాజాగా ఏడీబీ నుంచి నిధులు స్వీకరించేందుకు పురపాలక శాఖ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. సెప్టెంబర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన సందర్భంగా ఏడీబీ ప్రతినిధులతో అధికారులు సమావేశమై చర్చలు జరపగా, రుణం మంజూరుకు ఏడీబీ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపకల్పనపై అధికారులు దృష్టి సారించారు. నవంబర్ నాటికి డీపీఆర్ సిద్ధం చేసి, కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపాలని ప్రభుత్వం యోచిస్తోంది.















