తెలంగాణ రాజధాని హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో, ప్రపంచ అందాల సుందరాంగులకు వేదికగా నిలిచింది. 72వ మిస్ వరల్డ్ పోటీలు స్థానిక సాంస్కృతిక వైభవానికి, ప్రపంచ సౌందర్య వైభోగానికి అద్దం పట్టేలా అత్యంత వైభవంగా, అద్భుతంగా ప్రారంభమయ్యాయి.
హైదరాబాద్ మహా నగరంలో 72వ మిస్ వరల్డ్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. గచ్చిబౌలి స్టేడియంలో ‘జయజయహే తెలంగాణ’ రాష్ట్ర గీతం ఆలాపనతో మిస్ వరల్డ్-2025(Miss World 2025) పోటీలు మొదలయ్యాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా 250 మంది కళాకారులతో పేరిణి నృత్య ప్రదర్శన నిర్వహించారు. మిస్ వరల్డ్-2025 పరిచయ కార్యక్రమంలో భాగంగా పోటీదారులు విభిన్న వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఛైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, నగర మేయర్ విజయలక్ష్మి, మిస్ వరల్డ్ సీఈవో జూలియా మోర్లే, మిస్ వరల్డ్-2024 విజేత క్రిస్టినా పిస్కోవా తదితరులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.
ప్రతిష్టాత్మకమైన 72వ మిస్ వరల్డ్(Miss World 2025) పోటీలకు భాగ్య నగరం వేదికైంది. మే 10 నుండి 31 వరకు దాదాపు 22 రోజుల పాటు జరగనున్న ఈ అందాల పోటీల్లో ప్రపంచంలోని సుమారు 120కి దేశాల నుండి సుందరీమణులు హాజరవుతున్నారు. భారత్ తరఫున మిస్ ఇండియా నందిని గుప్తా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటివరకు 111 మంది మన నగరానికి చేరుకోగా… వారికి తెలంగాణ సంప్రదాయలతో ఎయిర్‌పోర్టులో ఘనంగా స్వాగతం పలికారు. జూన్ 1వ తేదీన హైటెక్స్‌లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. మొదటి 3, 4 స్థానాల్లో నిలిచిన సుందరీమణులు జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొంటారు. కాగా మిస్ వరల్డ్ 71వ ఎడిషన్ (2024) ఫైనల్ పోటీలు ముంబైలో జరిగాయి. వరుసగా రెండోసారి పోటీలు ఇండియాలోనే జరుగుతుండటం విశేషం.
అయితే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ మిస్ వరల్డ్ పోటీలు వాయిదా పడతాయని సర్వత్రా భావించారు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం తరపున మిస్ వరల్డ్ సుందరీమనులకు చౌమహల్ల ప్యాలెస్ లో ఇవ్వాలనుకున్న డిన్నర్ సైతం క్యాన్సిల్ చేసినట్లు రాష్ట్ర సెక్రటేరియట్ నుంచి ప్రకటన విడుదలైంది. అయితే ఈ పుకార్లను కొట్టివేస్తూ షెడ్యూల్ ప్రకారంగానే శనివారం సాయంత్రం నుంచి మిస్ వరల్డ్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య హైదరాబాద్ లో గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా ఈ రోజు సాయంత్రం 72వ మిస్ వరల్డ్ పోటీల ప్రారంభించారు.
వేదికను అలంకరించిన రంగురంగుల లైట్లు, చుట్టూ సందడి చేస్తున్న ప్రేక్షకులు అన్నీ కలసి ఒక విజువల్ ఫీస్ట్‌గా మారాయి. తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయ హే తెలంగాణ’ ఆలాపన ఈ వేడుకను మరింత ప్రత్యేకం చేసినది. ప్రముఖ రచయిత అందెశ్రీ రచించిన ఈ గీతం 250 మంది నృత్యకళాకారుల సమూహ ప్రదర్శనకు నేపథ్యంగా మారింది. కళ, శిల్పం, నృత్యం, దేశ భక్తి అన్నీ ఒక్కటే కావడం ఈ ప్రదర్శనలో కనిపించింది. ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ నృత్య విభావం, తెలంగాణ తీరును అద్భుతంగా ప్రతిబింబించింది.