ప్రపంచవ్యాప్తంగా కాస్త పేరున్న పాతకాలం నాటి వజ్రాల ప్రస్తావన ఎక్కడవచ్చినా, వాటికి తెలుగు నేలతో సంబంధం ఉంటుంది.గోల్కొండ వజ్రాలు, అవి దొరికిన ఆంధ్రా గనుల పేర్లు ఆ వజ్రాల చరిత్రలో కచ్చితంగా కనిపిస్తూ ఉంటాయి.ఇటీవల భారీ దొంగతనం జరిగిన ఫ్రాన్స్‌లోని లూవ్ర మ్యూజియంలోని చాలా వజ్రాలకు కూడా ప్రస్తుత ఆంధ్ర, తెలంగాణలతో సంబంధం ఉంది.ఇంతకీ అక్కడ తాజాగా జరిగిన దొంగతనంలో గోల్కొండ వజ్రాలు ఉన్నాయా లేవా?దాదాపు 18వ శతాబ్దం వరకూ భారత్ మాత్రమే ప్రపంచానికి వజ్రాలను సరఫరా చేసేది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, పెన్నా నదీ ప్రాంతాల్లో విరివిగా వజ్రాలు దొరికేవి.కొన్ని వందల సంవత్సరాల పాటు ఆ వజ్రాలను తవ్వి, అమ్మి, వాటితో వ్యాపారం చేసి, తెలుగు నేలను పాలించిన విజయనగర, గోల్కొండ రాజ్యాలు అత్యంత బలమైన సామ్రాజ్యాలుగా మారాయి.
ఆ క్రమంలోనే యూరోప్ అంతటా గోల్కొండ వజ్రాల పేరు మార్మోగింది. అటు హంపి వీధులు, ఆ తరువాత ఇటు హైదరాబాద్ పాత బస్తీలోని కార్వాన్ వీధులు వజ్రాల వ్యాపారులతో కిటకిటలాడేవి.కోహినూర్ వంటి కొన్ని వజ్రాల విషయంలో స్పష్టత లేకున్నా, చాలా వజ్రాలు ఎక్కడకు, ఎలా వెళ్లాయనేది గ్రంథస్థం అయ్యింది.కొన్ని వజ్రాలు దొంగతనం, అక్రమ రవాణా జరిగినా, చాలా వజ్రాలు వ్యాపారం ద్వారా విదేశాలకు చేరాయి. వాటికి యూరోప్‌లో ఉన్న క్రేజ్ ఇక్కడ భారతీయ వ్యాపారులు, రాజ్యాల పాలిట వరంగా మారింది.అలా యూరోప్ వెళ్లిన పలు వజ్రాలను ఫ్రెంచ్ రాజులు, రాజ కుటుంబీకులు, సంపన్నులు కొనేవారు. ఫ్రెంచ్ వర్తకులు అనేకులు భారత్ వచ్చి వజ్రాలు కొనేవారు.వాటిలో చాలా వజ్రాలను ఫ్రెంచ్ రాచ నగలలో పొదిగారు. ఇటీవల లూవ్ర మ్యూజియం దొంగతనంలో పోయిన రాజ ఆభరణాల్లో కూడా రెండు గోల్కొండ వజ్రాలు ఉన్నాయి. మరికొన్ని వజ్రాలు మాత్రం భద్రంగా ఉన్నాయి.
దొంగతనం జరిగిన వాటిలో రెక్వరీ, బ్రూచ్ ఉన్నాయి. ఇది ఫ్రెంచ్ సామ్రాజ్ఞి యుగ్నేయికి చెందినవి. ఈ ఆభరణాన్ని 1855లో తయారు చేశారు. అందులో 94 వజ్రాలు పొదిగారు.మజారిన్ 17, 18 అనే వజ్రాలు కూడా అందులో ఉన్నాయి. ఈ రెండు మజారిన్ వజ్రాలూ గోల్కొండ వజ్రాలని క్రిస్టీ సంస్థ ప్రకటనను బట్టి తెలుస్తోంది.1661లో ఫ్రెంచ్ రాజు 14వ లూయికి కార్డినల్ మజారిన్ ఈ వజ్రాలను ఇచ్చారు.ఈ రెండు వజ్రాలూ గోల్కొండ నుంచి పారిస్ చేరిన విధానాన్ని క్రిస్టీ అనే సంస్థ వివరించింది.1766 నుంచి వజ్రాలు, ఖరీదైన కళాకృతుల అమ్మకాలవ్యాపారంలో ఉంది ఈ క్రిస్టీ సంస్థ. ‘లె గ్రాండ్ మజారిన్’ అనే గోల్కొండ వజ్రాన్ని వేలం వేసే క్రమంలో దాని చరిత్రతో పాటు లూవ్ర మ్యూజియంలోని శాన్సీ వజ్రం, 17, 18 నంబర్లున్న మజారిన్ వజ్రాల చరిత్రను ఆ సంస్థ వివరించింది.
”చరిత్రాత్మక వజ్రాలకు ప్రసిద్ధి గాంచిన దక్షిణ మధ్య భారతంలోని గోల్కొండ గనుల్లో దొరికిన లె గ్రాండ్ మజారిన్ వజ్రం, ఇటాలియన్ కార్డినల్ అయిన మజారిన్ నుంచి 14వ లూయి రాజు వద్దకు చేరింది. ఇది 1661లో జరిగింది. దాంతో పాటే శాన్సీ, ఇతర మజారిన్ వజ్రాలు ఫ్రెంచ్ రాజు చేతికి వెళ్లాయి” అని ఆ సంస్థ చెప్పింది.అయితే దొంగతనానికి గురైన మిగిలిన ఆభరణాల్లో గోల్కొండ వజ్రాలు ఉన్నాయా లేదా అన్నది స్పష్టంగా లేదు.అదే సమయంలో ఆ ప్రదర్శనశాలలో అసలు దొంగతనం కాకుండా భద్రంగా ఉన్న వాటిలో మూడు కీలకమైన వజ్రాలు, భారత్ నుంచి వెళ్లినవి ఉన్నాయి.ప్రస్తుత ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో, ఒకప్పటి గోల్కొండ సామ్రాజ్య పరిధిలోని కోళ్ళూరు, పరిటాల గనుల్లో దొరికిన కొన్ని వజ్రాలు ఈ లూవ్ర మ్యూజియంలో ఉన్నాయి. వాటిలో అతి ముఖ్యమైనది రీజెంట్ వజ్రం. దీని ప్రస్తుత బరువు 140.5 కారెట్లు.
ప్రపంచంలో ఉన్న అతి పెద్ద మేలైన వజ్రాలుగా పేరున్న వాటిల్లో ఒకటైన ఈ రీజెంట్ డైమండ్ ప్రస్తుత కృష్ణా జిల్లా పరిటాలలో దొరికింది. ఈ వజ్రం భారత్ నుంచి యూరోప్ వరకూ చేరిన తీరును ‘ద డైరీ ఆఫ్ విలియం హెడ్జెస్ డ్యూరింగ్ హిజ్ ఏజెన్సీ ఇన్ బెంగాల్’ అనే పుస్తకంలో వివరంగా రాశారు.”ఈ రీజెంట్ వజ్రానికే పిట్ వజ్రం అనే పేరు కూడా ఉంది. ఇప్పటి పరిటాల గ్రామం దగ్గర గనుల్లో ఇది దొరికింది. అప్పట్లో 426 కారెట్లు ఉండేదని చరిత్రకారులు రాశారు. దీన్ని అక్కడ పనిచేసే ఒక బానిస కార్మికుడు దొంగచాటుగా అక్కడి నుంచి తరలించి మద్రాస్ తీసుకువెళ్లి, బ్రిటిష్ ఓడ నావికుడికి అమ్మజూపాడు. కానీ బ్రిటిష్ నావికుడు అతణ్ని చంపి ఆ డైమండ్ తీసుకెళ్లాడు.
తర్వాత ఆ నావికుడు ఆ వజ్రాన్ని ఓ భారతీయ వ్యాపారికి అమ్మాడు. అప్పటి గోల్కొండ కరెన్సీ అయిన పగోడాల లెక్కల్లో 48 వేల పగోడాలు పలికింది ఆ వజ్రం. అతని నుంచి అప్పటి మద్రాస్ గవర్నర్ పిట్ దాన్ని భారీ సొమ్ము చెల్లించికొన్నాడు” అని బీబీసీకి చెప్పారు గోల్కొండ సామ్రాజ్య చరిత్ర పరిశోధకుడు, పాత్రికేయుడు నానిశెట్టి శెరీష్.తరువాత ఒక వ్యక్తి బూట్లలో ఈ వజ్రాన్ని దాచి, దాన్ని మద్రాస్ నుంచి లండన్ పంపినట్టు అనేకమంది చరిత్రకారులు రాశారు. ప్రస్తుతం ఈ వజ్రం 140.64 కారెట్లు ఉన్నట్టు లూవ్ర మ్యూజియం అధికారిక సమాచారం.
‘‘1698లో గోల్కొండ గనుల్లో దొరికిన ఈ వజ్రం, అప్పటి మద్రాస్ గవర్నర్ థామస్ పిట్ దగ్గరకు చేరింది. ఆయన అధిక ధరకు దీన్ని కొన్నారు. దీన్ని లండన్‌లో సాన పట్టగా, తర్వాత 1717లో ఫ్రెంచ్ రీజెంట్ అయిన ఫిలిప్ దగ్గరకు చేరింది. ఇప్పటికీ ఇది ప్రపంచంలోనే మేలైన వజ్రాల్లో ఒకటి” అని లూవ్ర తన వెబ్‌సైట్లో పేర్కొంది.1721లో 15వ లూయి దాన్ని ధరించారు. ఆయన కిరీటంలో కూడా దీన్ని పొదిగారు. తరువాత 16వ లూయి పట్టాభిషేక కిరీటంలో కూడా ఇది ఉంది.ఇటీవల లూవ్ర మ్యూజియంలో జరిగిన దొంగతనం సమయంలో దొంగల కళ్లు ఈ వజ్రంపై పడలేదు. ఇది ఇంకా ఆ మ్యూజియంలో భద్రంగా ఉంది.రీజెంట్ మాత్రమే కాదు..హోర్టెన్సియా, శాన్సీ అనే మరో రెండు గోల్కొండ వజ్రాలు కూడా లూవ్ర మ్యూజియంలో ఉన్నాయి.
”ఒక గుర్తు తెలియని వ్యాపారి నుంచి 14వ లూయి ఈ హోర్టెన్సియా వజ్రాన్ని కొన్నారు. ఫ్రెంచ్ విప్లవం సమయం 1792లో ఇది కూడా దొంగతనానికి గురైంది. నెపోలియన్ 1 దీన్ని రికవరీ చేశారు. ఆయన తరువాత హాలెండ్ రాణి దీన్ని ధరించారు. 1830లో మరోసారి దొంగతనం జరిగింది. ఆ తరువాత ఇది లూవ్ర చేరింది” అని చెప్పారు శెరీష్.ఈ వజ్రం గురించి 1691లో మొదటిసారి రాజ నగల ప్రస్తావనలో కనిపించిందని లూవ్ర అధికారిక సమాచారం.శాన్సీ ప్రస్తుతం 55 కారెట్ల వజ్రం. దీని చరిత్రపై రెండు భిన్నమైనవాదనలు ఉన్నాయి. ఇది రీజెంట్ కంటే పాత వజ్రం. అనేకమంది యూరోప్, ఆసియా రాజులు, రాచ కుటుంబం, ప్రముఖ వ్యక్తులు, వ్యాపారుల చేతులు మారింది.
1661లో శాన్సీ డైమండ్ ఫ్రెంచ్ రాచ నగలలో చేరింది. కార్డినల్ జులెస్ మజారిన్ 14వ లూయికి ఇచ్చిన 18 రత్నాల్లో ఇది కూడా ఉంది. ఆ 18 రత్నాల్లో రెండు తాజాగా దొంగతనం కాగా, ఈ వజ్రం మాత్రం భద్రంగా ఉంది. అయితే ఇది స్పష్టంగా కోళ్ళూరు, పరిటాల్లోని ఏ గనిలో దొరికిందనే స్పష్టత లేదు. హోర్టెన్సియా కూడా గోల్కొండ వజ్రమే కానీ, ఏ గనిలో దొరికిందన్న స్పష్టత లేదంటున్నారు చరిత్రకారులు.17 శతాబ్దం నాటికి ప్రపంచం మొత్తానికి వజ్రాలు అందించింది భారత దేశమే. అందులోనూ.. ఫ్రాన్స్‌కు ఎక్కువ వజ్రాలు గోల్కొండ సామ్రాజ్యం నుంచే వెళ్లాయి. కాబట్టి ఇవి గోల్కొండ వజ్రాలు అయ్యే అవకాశమే ఎక్కువుందని మెజార్టీ చరిత్రకారుల అభిప్రాయం.
దాదాపు 1200 నుంచి 1800 వరకూ కృష్ణా, పెన్నా తీరాల్లో వజ్రాల వేట సాగింది.
”18వ శతాబ్దం వరకూ కనీసంగా రెండున్నరవేల సంవత్సరాల పాటు దక్షిణ భారతంలోని దక్కన్ ప్రాంతం వజ్రాలకు ప్రధాన వనరుగా ఉండేది. కోహినూర్ మాత్రమే కాకుండా, గ్రేట్ మొఘల్, రీజెంట్, ఓర్లాఫ్, నిజాం, హోప్.. ఇలాంటి వజ్రాలు ఇక్కడే దొరికాయి. ముఖ్యంగా 13-17 శతాబ్దాల మధ్య ఈ వజ్రాల వ్యాపారం వెల్లివిరిసింది. 18వ శతాబ్దం తరువాతే ఆఫ్రికా, దక్షిణ అమెరికాల్లో వజ్రాల గనులు కనుగొన్నారు. ఆంధ్ర, తెలంగాణల్లోని కృష్ణా, పెన్నా నదీ లోయల్లో పెద్ద ఎత్తున వజ్రాలు దొరికేవి. అక్కడక్కడా చిన్న చిన్న గనులు మినహాయిస్తే ప్రపంచానికి ఇదే పెద్ద డైమండ్ వనరు. 1725లో బ్రెజిల్‌లో గనులు కనుగొనే వరకూ అదే పరిస్థితి’’ అని బీబీసీతో చెప్పారు జీఎస్ఐకి చెందని రిటైర్డ్ శాస్త్రవేత్త ఎస్వీ సత్యనారాయణ.
 
			



















