ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా ప్రసిద్ధిచెందిన మహా కుంభమేళాకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెళ్లారు. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించి, గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ వేదికగా జరుగుతోన్న మహా కుంభమేళాలో.. గంగా, యమున, సరస్వతీ నదుల సంగమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుణ్యస్నానాలు ఆచరించారు. త్రివేణీ సంగమం వద్దకు బోటులో వెళ్లారు. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం చేశారు. రాష్ట్రపతి మహా కుంభమేళా పర్యటనలో ఆమె వెంట ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనంది బెన్ పటేల్ ఉన్నారు. నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత.. అక్కడే ఉన్న పక్షులకు ఆహారం కూడా అందించారు రాష్ట్రపతి.
ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సోమవారం ఉదయం పది గంటలకు రాష్ట్రపతి ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారు. రాష్ట్రపతి మహా కుంభమేళా పర్యటన సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.సోమవారం ఉదయమే ప్రయాగ్‌రాజ్ చేరుకున్న రాష్ట్రపతి ముర్ముకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందిబెన్ పటేల్ పుష్పగుచ్చాలు అందించి ఘనస్వాగతం పలికారు.
విమానాశ్రయం నుంచి రాష్ట్రపతితో పాటు.. యూపీ సీఎం, గవర్నర్ కూడా త్రివేణీ సంగమానికి బోటులో వెళ్లారు. త్రివేణి సంగమం వద్ద ఉన్న పక్షులకు రాష్ట్రపతి ముర్ము.. ఆహారం అందించారు. త్రివేణీ సంగమం వద్ద పవిత్ర స్నానం ఆచరించారు. అక్కడే గంగమ్మ తల్లికి రాష్ట్రపతి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రపతి పరర్యటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాకు వెళ్లిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఎనిమిది గంటల పాటు అక్కడే ఉండబోతున్నారు. బడే హనుమాన్ ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత అక్ష యవత్ వృక్షాన్ని కూడా రాష్ట్రపతి దర్శించుకుంటారు. అనంతరం మహా కుంభమేళాలో ఏర్పాటు చేసిన డిజిటల్ కుంభ్ అనుభవ్ సెంటర్‌ను రాష్ట్రపతి పరిశీలిస్తారు. సాయంత్రం 5.45 గంటలకు రాష్ట్రపతి ప్రయాగ్‌రాజ్ నుంచి ఢిల్లీకి విమానంలో బయలుదేరి వెళ్తారు.
గత నెల 13వ తేదీన ప్రారంభమైన మహా కుంభమేళా 45 రోజుల పాటు కొనసాగనుంది. ఈనెల 26వ తేదీన మహా కుంభమేళా ముగుస్తుంది. మహా కుంభమేళా ప్రారంభమైనప్పటినుంచీ ఇప్పటి వరకు 44 కోట్ల మందికి పైగా భక్తులు పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. కుంభమేళా ముగిసే నాటికి మరో ఆరు కోట్ల మందికి పైగా భక్తులు ప్రయాగ్ రాజ్ తరలివస్తారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కుంభమేళా నిత్యం కిక్కిరిసిపోతోంది. ప్రయాగ్ రాజ్‌కు వెళ్లే ప్రతి దారిలోనూ ట్రాఫిక్ జామ్ అవుతోంది. ప్రయాగ్‌రాజ్ చేరుకోవడానికి గంటలు, పూటలు, రోజుల సమయం పడుతోంది.
కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..
మహాకుంభమేళా జరుగుతున్న ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు పోటెత్తుతుంటంతో ప్రయాగ్‌రాజ్ చేరుకునే అన్ని రోడ్డు మార్గాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. 25 కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్థంభించిపోయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రయాగ్‌రాజ్‌కు దారి తీసే వారణాసి, లక్నో, కాన్పూర్, రేవా మార్గాలన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. ప్రయాగ్‌రాజ్‌కు దారితీసే ఏడు ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్‌ను 20 కిలోమీటర్ల ముందే నిలిపివేస్తున్నారు. దీంతో పుణ్యస్నానాలాచరించే సంగమ ప్రాంతానికి వెళ్లేందుకు భక్తులు కనీసం 20 కిలోమీటర్లు నడవాల్సి వస్తోందని తెలిసింది. రద్దీని నియంత్రించేందుకు అధికారులు మధ్యప్రదేశ్‌లోనే వాహనాలను నిలిపివేస్తున్నారు. కనీసం 50 వేల వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయని అంచనా. 48 గంటలుగా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయామని భక్తులు చెబుతున్నారు. ట్రాఫిక్‌లో చిక్కుకున్న వారి కోసం అధికారులు తాగునీరు, ఆహారంతో పాటు తాత్కాలిక వసతి ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ ను కొంత మేర అయినా నియంత్రించాలనే ఉద్దేశంతో ఫిబ్రవరి 14 వరకు ప్రయాగ్‌రాజ్ సంగం రైల్వేస్టేషన్‌ను మూసివేయాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఇంకా పదిహేను రోజులో మహాకుంభమేళా ముగియనున్న నేపధ్యంలో భక్తుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ఇప్పటికే దాదాపు 41 కోట్ల మంది భక్తులు మహాకుంభమేళాలలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు చెపుతున్నాయి.